ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి | Congress MLA Raja Gopal reddy Key Comments On Indiramma House | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి

Sep 10 2026 1:34 PM | Updated on Sep 10 2026 1:45 PM

Congress MLA Raja Gopal reddy Key Comments On Indiramma House

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయం సరిపోవడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో రూ.5 లక్షలతో పూర్తయ్యే ఇల్లు ప్రస్తుతం రూ.12 లక్షల వరకు ఖర్చవుతోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయం పెంచాలని సూచించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇళ్ల నిర్మాణం కోసం తమ భార్యల బంగారం కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలోనే లేబర్ కాస్ట్ దాదాపు రూ.3 లక్షల వరకు అవుతోంది. అందువల్ల ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల సాయాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇళ్ల సంఖ్య కొంత తగ్గించినా ఫర్వాలేదని, అయితే ఒక్కో ఇంటికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

కాగా, ప్రస్తుతం ప్రభుత్వం సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో సామాజిక వర్గాల వారీగా కేటాయింపులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వం మైనార్టీలకు ప్రత్యేకంగా ఇళ్ల కేటాయింపుపై జీవో ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండు లక్షల ఇళ్లు ఇస్తామని చెబుతోందని, ఆ రెండు లక్షల ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత శాతం కేటాయిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఫ్యూచర్‌ సిటీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement