సంతానం లేనివారు సంతానం కలిగే వరకు పరితపిస్తూనే ఉంటే, సంతానం ఉన్నవారు తమ పిల్లలకు ఎటువంటి అంటువ్యాధులు, రోగాలు రాకుండా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేసే వ్రతమే పొలాల అమావాస్య వ్రతం. శ్రావణ బహుళ అమావాస్య నాడు చేసే ఈ వ్రతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉద్దేశంతో... ఒక్కోవిధంగా చేస్తారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పశువులను పూజిస్తే మరికొన్ని తాలలో కంద మొక్కను పూజించి, కలగలపు పులుసు చేసుకుని తింటారు.రేపు పోలాల అమావాస్య సందర్భంగా ఆ వ్రత విధానం ...
పూజకు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, పండ్లు. దీపారాధన కుందులు, నూనె/నెయ్యి, వత్తులు, అగరు బత్తీలు, కర్పూరం సిద్ధం చేసుకోవాలి. మరీ ముఖ్యమైనవి: కంద మొక్క (లేదా కంద పిలక), తోరాలు (పసుపు రాసి, పసుపు కొమ్ములు కట్టిన దారాలు). నైవేద్యం: పూర్ణం బూరెలు, 9 రకాల కూరగాయలతో చేసిన కలగాయ కూర/పులుసు. పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, పీటపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్నిపరచాలి. దానిపై కంద మొక్కను ఉంచి మంగళగౌరీ దేవి లేదా పోలేరమ్మ తల్లిగా భావించాలి.
గణపతి ప్రార్థన: ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా సాగడానికి ముందుగా వినాయకుడిని మనసు లో స్మరించుకోవాలి.‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ‘దీపారాధన: దీపాలను వెలిగించి, దానికి పసుపు, కుంకుమలు పెట్టాలి. ‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’ అంటూ మూడుసార్లు నీటిని తీసుకోవాలి.
ప్రధాన పూజ – తోర పూజ కంద మొక్కకు పసుపు, కుంకుమలు పెట్టి, పూలతో అలంకరించాలి. అమ్మవారిని షోడశోపచారాలతో (ధ్యానం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు) పూజించాలి. తోర పూజ: పసుపు కొమ్ములు కట్టిన తోరాలను (దారాలను) అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించాలి.
తోరం కట్టుకునేటప్పుడు ‘పోలాయ నమస్తుభ్యం సర్వ సౌభాగ్యదాయిని... పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం బధ్నామి తవ తోరకమ్’ అని భక్తి శ్రద్ధలతో చదువుతూ తోరం కట్టుకోవాలి.
‘నైవేద్యం: తయారు చేసుకున్న పూర్ణం బూరెలు, కలగాయ (ఇరుగు పొరుగు ఇళ్లనుంచి సేకరించిన లేదా స్వయంగా సమకూర్చుకున్న రకరకాల కూరగాయలతో చేసిన పులుసు)ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పోలాల అమావాస్య వ్రత కథ. (ఈ కథను కూడా ఒక్కో ్ర΄ాంతంలో ఒక్కో విధంగా చెప్పుకుంటారు. అధిక ప్రాచుర్యం పొందిన కథలలో ఇదొకటి) పూజ పూర్తయిన తర్వాత చేతిలో అక్షతలు, పూలు పట్టుకుని ఈ కింది కథను భక్తితో చదువుకోవాలి లేదా వినాలి.
వ్రతకథ: పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారందరికీ వివాహాలై, పిల్లలు కలిగారు. అయితే అందరికంటే చిన్నవాడి భార్యకు పుట్టిన పిల్లలందరూ పుట్టిన వెంటనే చనిపోతుండేవారు. ప్రతి ఏటా శ్రావణ లేదా భాద్రపద అమావాస్య రోజున పెద్దకోడళ్లు అందరూ కలిసి ఎంతో వైభవంగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించేవారు. కానీ చిన్నకోడలికి పిల్లలు చనిపోతుండటం వల్ల, ఆమెను సూతకం (మైల) కారణంతో పూజకు రానిచ్చేవారు కాదు. ఒక సంవత్సరం అమావాస్య నాడే చిన్నకోడలికి మళ్లీ బాబు పుట్టాడు, కానీ ఆ బాబు కూడా వెంటనే చనిపోయాడు. ఆ దుఃఖాన్ని భరించలేక, పూజకు ఆటంకం కలుగుతుందనే భయంతో ఆమె ఆ చనిపోయిన బిడ్డను ఎవరికీ చెప్పకుండా గదిలో ఒక చాట కింద దాచిపెట్టింది.
తోడికోడళ్లు పూజ ముగించుకుని, కందమొక్కకు కట్టిన తోరాలను చిన్నకోడలికి ఇవ్వడానికి వచ్చారు. ఆమె తోరాన్ని తీసుకుని, మనసులో ఎంతో బాధపడుతూ గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లిని మనసారా ప్రార్థించింది. అనంతరం చిన్నకోడలు చనిపోయిన తన బిడ్డను ఎత్తుకుని ఎవరికీ తెలియకుండా ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్లి, దేవత పాదాల చెంత బిడ్డను ఉంచి బోరున విలపించింది. ఆమె నిష్కల్మషమైన భక్తికి, మాతృత్వపు వేదనకు కరిగిపోయిన పోలేరమ్మ తల్లి ప్రత్యక్షమైంది.
తన అమృత హస్తంతో ఆ చనిపోయిన బాలుడిని తాకగానే, ఆ బిడ్డ ప్రాణాలతో లేచి బోసినవ్వులు నవ్వాడు. అంతేకాకుండా, గతంలో చనిపోయిన ఆమె మిగతా పిల్లలందరినీ కూడా అమ్మవారు బతికించి ఆమెకు అప్పగించింది. తన పిల్లలందరితో కలిసి చిన్నకోడలు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె భక్తిని చూసి ఊరివారంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి సంతాన రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని నిష్టగా చేయడం ప్రారంభించారు.
ఉద్యాపన లేదా ముగింపు
కథ పూర్తయిన తర్వాత చేతిలోని అక్షతలను తలపై వేసుకోవాలి. పూజించిన తోరాలను తీసుకుని తల్లి తన పిల్లల కుడి చేతికి కట్టాలి. ఆ తర్వాత ముత్తయిదువులకు వాయనాలు (తాంబూలం, బూరెలు) ఇచ్చి, పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనితో వ్రతం సంపూర్ణమవుతుంది. ఆ తర్వాత యథాశక్తి దాన ధర్మాలు చేయాలి.
పూజించిన కంద మొక్కను ఏం చేయాలి?
ఈ వ్రతంలో పూజించిన కంద మొక్కను ΄ోలాల అమావాస్య మరుసటి రోజు ఇంటి ఆవరణలో కానీ, పూల కుండీల్లో కానీ నాటాలి. ప్రతిరోజూ నీళ్లు ΄ోస్తూ మొక్కను సంరక్షించాలి. కొద్ది రోజులకు ఈ మొక్క పక్కనే మరికొన్ని పిలకలు వస్తాయి. అలా రావడం శుభసూచకం. కంద మొక్కకు పిలకలు వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అప్పటికే సంతానం ఉన్నవారికి వారి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుందని ప్రతీతి.
– పి.సాయికృష్ణ ప్రణతి
(చదవండి: అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!)


