నిర్మల హృదయమే గర్భగుడి | A pure heart is the sanctum sanctorum | Sakshi
Sakshi News home page

నిర్మల హృదయమే గర్భగుడి

Sep 7 2026 1:54 AM | Updated on Sep 7 2026 1:54 AM

A pure heart is the sanctum sanctorum

ఆధ్యాత్మికథ

ఒక చిన్న పల్లెటూరి చివరన, ఒక పాత పూరి గుడిసెలో రామయ్య అనే వృద్ధ మట్టి శిల్పి ఉండేవాడు. వయసు పైబడినా ఆయన చేతుల్లో ఏదో ఇంద్రజాలం ఉండేది. ఆయన చేసే మట్టి విగ్రహాలు ప్రాణం ఉన్నట్టుగా ఉండేవి. కానీ రామయ్యకు అహంకారం అంటే ఏమిటో తెలియదు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ భగవంతుడి స్వరూపం గా భావించి, ఎంతో వినయంగా నమస్కరించేవాడు. ఆ ఊరిలోనే భుజంగరావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. దర్పం, అహంకారం ఆయనకు ఆభరణాలు. తన ఇంట్లో కొత్తగా కట్టించిన పెద్ద పూజామందిరంలో ప్రతిష్టించడానికి ఒక అద్భుతమైన వినాయకుడి విగ్రహం కావాలని రామయ్య దగ్గరకు వచ్చాడు.

రామయ్య శిల్పం చెక్కుతుండగా చూసి భుజంగరావు ‘రామయ్యా! నా హోదాకు తగ్గట్టు గా ఈ విగ్రహం ఉండాలి. రంగులు, అలంకరణలు అత్యంత ఖరీదైనవిగా ఉండాలి. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ నా విగ్రహం చూసి ఊరంతా నోరెళ్లబెట్టాలి!’ అన్నాడు. 

రామయ్య చేతులు జోడించి, వినయంగా తలవంచి... ‘అలాగే బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అన్నాడు. మరుసటి రోజు, రామయ్య విగ్రహాన్ని తయారు చేస్తుండగా... రాజీ అనే ఎనిమిదేళ్ల పేద బాలిక అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కేవలం ఒక రూపాయి నాణెం ఉంది. ఎంతో ఆశగా రామయ్య వైపు చూస్తూ...
‘తాతా! మా అమ్మకు ఒంట్లో అస్సలు బాగోలేదు. మా ఇంట్లో పూజ చేసుకుని, అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకోవడానికి ఒక చిన్న వినాయకుడి బొమ్మ ఇస్తావా.’ అని అడిగింది. 

అప్పుడే అక్కడకు వచ్చిన భుజంగరావు అది చూసి ఈసడించుకుంటూ... ‘ఏయ్‌ పిల్లా! పక్కకు పో. నా పెద్ద విగ్రహం పని పాడు చేయకు. అయినా ఈ నాణేనికి మట్టి కూడా రాదు’ అని గద్దించాడు. కానీ రామయ్య మనస్సు కరిగింది. ఆ అమ్మాయి అమాయకత్వంలో, నిష్కపటమైన ప్రేమలో ఆయనకు సాక్షాత్‌ ఆ దేవుడే కనిపించాడు. రామయ్య ఎంతో భక్తితో తను చేసిన ఒక చిన్న ముద్దుల వినాయకుడి విగ్రహాన్ని ఆ బాలిక చేతిలో పెట్టాడు. ఆ చిన్నారి కళ్లలో కనిపించిన ఆనందం రామయ్య హృదయాన్ని నింపేసింది.

కొన్ని రోజులకు భుజంగరావు పురమాయించిన పెద్ద విగ్రహం తయారైంది. అది నిజంగానే ఎంతో భవ్యంగా, రంగురంగుల ఆభరణాలతో మెరిసిపోతోంది. భుజంగరావు కూలీలతో కలిసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కానీ విచిత్రం! నలుగురు బలాఢ్యులైన మనుషులు ఆ విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించినా  కనీసం అంగుళం కూడా కదపలేకపోయారు.

భుజంగరావు కోపంతో ఊగిపోతూ... ‘రామయ్యా! ఏంటిది? ఇందులో ఏమైనా ఇనుము, రాళ్ళు పెట్టి చేశావా? ఎందుకు ఇంత బరువుగా ఉంది?’ అని గద్దించాడు.
రామయ్య ఏమాత్రం కలత చెందకుండా, ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ‘అహంకారం’, ‘హోదా’ అనే బరువులు కూడా ఇందులో చేరాయి స్వామీ! అహంకారం ఎప్పుడూ మోయలేనంత బరువుగానే ఉంటుంది. ఆ బరువును దేవుడు కూడా ఇష్టపడడు’’ అన్నాడు. 

ఆ మాటలు భుజంగరావు గుండెల్లో తూటాల్లా పేలాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చిన్న గుడిసెలో రాజీ అనే చిన్నారి... రామయ్య ఇచ్చిన చిన్న విగ్రహాన్ని ఎంతో సులువుగా చేతుల్లో పట్టుకుని, భక్తితో పూజ చేయడం ఆయన కంట పడింది. ఆయనలోని గర్వం కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లతో, ‘నన్ను క్షమించు రామయ్యా! ఈ రోజు నుంచి నా అహంకారాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను’ నమస్కరించి అన్నాడు. ఆశ్చర్యకరంగా... మరుక్షణమే ఆ విగ్రహం ఎంతో తేలిక గా మారిపోయింది. 
భుజంగరావుకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. దైవత్వం అనేది బాహ్య ఆడంబరాలలో, డబ్బులో లేదు. అది అంతరంగంలోని వినయం, నిష్కపటత్వం, భక్తిలోనే ఉంటుందని గ్రహించాడు.

– తరిగొప్పుల వీఎల్లెన్‌ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement