ఇంట్లో పెట్టుకున్న డెకర్ పీస్ అంటే రోజంతా మూలన కూర్చుని అందంగా కనిపించడం మాత్రమే కాదు! అందుకే, ఇప్పుడు ఇల్లు అందంగా కనిపించేలా చేస్తూనే... రోజువారీ పనుల్లోనూ చక్కగా చేయూతనిచ్చే ఈ డ్యూయల్ డ్యూటీ గాడ్జెట్లు మీకోసం!
గోడ మీద గొడుగు!
తాళాలు ఎక్కడ? కత్తెర ఎక్కడ? టవల్ ఎక్కడ? అని ఇంట్లో రోజూ జరిగే ‘పోయిన వస్తువుల వేట’కు ఇక సెలవు చెప్పొచ్చు! ఎందుకంటే, ఈ చిన్న గొడుగు ఆకారపు హుక్ గోడకు అతుక్కుని, ఇంట్లో చెల్లాచెదురుగా తిరిగే చిన్నచిన్న వస్తువులన్నింటికీ ఓ చిరునామా ఇస్తుంది! చూడ్డానికి ముద్దుగా ఉండే ఈ గొడుగు హుక్‌లో తాళాలు, టవల్స్, చిన్న ఉపకరణాలు వంటి వాటిని వేలాడదీయొచ్చు.
అవసరాన్ని బట్టి దీన్ని తిప్పి చిన్న వస్తువులు పెట్టుకునే హోల్డర్‌లా కూడా వాడుకోవచ్చు. గోడకు అతికించే విధానంలో ఉండటంతో డ్రిల్, మేకులు అంటూ గోడకు కొత్త గాయాలు చేయాల్సిన పనిలేదు! బాత్‌రూమ్‌లో ఒకటి... కిచెన్‌లో ఒకటి... ఆఫీసు టేబుల్ దగ్గర ఇంకొకటి పెట్టుకుంటే చాలు... ‘ఎక్కడ పెట్టాను?’ అనే ప్రశ్నకు ఈ గొడుగులే సమాధానం చెబుతాయి! ఆరు హుక్‌ల ప్యాక్ ధర రూ.250 మాత్రమే!
పిల్లి పంజాకు మురికి పరార్!
అద్దం ముందు నిలబడి ఫొటో తీసుకోవాలంటే, మన ముఖం కంటే ముందే అద్దంపై ఉన్న నీటి చారలే కనిపిస్తున్నాయా? సింక్ దగ్గర సబ్బు మరకలు చూస్తూ ‘రేపు క్లీన్ చేద్దాంలే’ అని వాయిదా వేస్తున్నారా? అయితే ఈసారి క్లీనింగ్ పనికి ఓ క్యూట్ పిల్లిని పెట్టుకోండి! అదీ... పంజాలతో పని చేసే పిల్లి! పిల్లి పంజా ఆకారంలో ఉండే ఈ చిన్న స్పాంజ్‌తో అద్దాలు, గ్లాస్ ఉపరితలాలు, టైల్స్, సింక్‌లను తుడిచేయొచ్చు. నీటి చారలు, వేలిముద్రలు, సబ్బు మరకలు వంటి మచ్చలను సులభంగా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చిన్నగా, తేలికగా ఉండటంతో అవసరమైనప్పుడు చేతిలోకి తీసుకుని పని పూర్తి చేయొచ్చు. ధర రూ.300 మాత్రమే!
గదిలోనే చిన్న స్పా!
ఇంట్లో కూర్చుంటేనే కాస్త రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుందా? అయితే... గదిలో పరిమళం, చుట్టూ మెల్లని వెలుగు, చెవుల్లో నచ్చిన పాటలు ఉంటే ఎలా ఉంటుంది? అందుకోసం ఒక్కో పనికి ఒక్కో పరికరం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కటే మూడు పనులు చేసేస్తుంది! ఇది ఒకేసారి హ్యూమిడిఫైయర్, అరోమా డిఫ్యూజర్, బ్లూటూత్ స్పీకర్‌లా పనిచేస్తుంది. 350 మిల్లీలీటర్ల ట్యాంక్‌తో సుమారు 8 గంటల వరకు మిస్ట్ అందిస్తుంది.
ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటే గదంతా ఆహ్లాదకరమైన పరిమళం వ్యాపిస్తుంది. బ్లూటూత్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేసి నచ్చిన పాటలు వినొచ్చు. ఎల్‌ఈడీ లైటింగ్‌తో గదికి మూడ్ లైటింగ్ కూడా వచ్చేస్తుంది. ఇక సెట్టింగ్స్ మార్చడానికి ప్రతిసారీ లేవాల్సిన పనిలేదు... యాప్ ద్వారా మిస్ట్, టైమర్, లైటింగ్ వంటివి నియంత్రించుకోవచ్చు. నీరు అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే సదుపాయం కూడా ఉంది. గదినే చిన్న స్పాగా మార్చేసే దీని ధర రూ. 2000.
(చదవండి:


