‘చేసిన పాపం ఊరికే పోదు.. గుట్టు ఎంత దాచినా ఏదో ఒకరోజు రట్టవుతుంది!’ అన్నట్టుగా ఈజిప్టులో ఓ ప్రముఖ టీవీ యాంకర్ కథ అనూహ్య మలుపు తిరిగింది. నేరాలపై కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఇప్పుడు అదే నేరాల కేసులో నిందితురాలిగా నిలిచింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో దోషిగా తేలడంతో టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫా (39)కు ఉరిశిక్ష పడింది. ఆమెతో పాటు మరో 11 మందికి మరణదండన విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తెరపై నేరాలను విశ్లేషించిన ఆమె.. ఇప్పుడు తన జీవితాన్నే మార్చేసిన తీర్పును ఎదుర్కోవడం ఈ కేసులో సంచలనంగా మారింది.
అసలు ఏం జరిగింది?
సారా ఖలీఫాతో పాటు మరో 11 మందిని మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను అక్రమంగా దిగుమతి చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో దోషులుగా కోర్టు తేల్చింది. అంతేకాదు.. వారి వద్ద అక్రమ తుపాకులు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు కూడా ఆరోపణలు నమోదయ్యాయి. కాగా, సారా ఖలీఫా ఈజిప్టులో క్రైమ్ అంశాలపై ప్రసారమయ్యే ‘మిషన్ ఇంపాజిబుల్’ కార్యక్రమంతో గుర్తింపు పొందారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆమె మొదటి నుంచీ ఖండిస్తున్నారు.
750 కిలోలకు పైగా డ్రగ్స్ స్వాధీనం..
పోలీసుల దర్యాప్తులో భాగంగా అధికారులు 750 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు, వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో 20 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు.. సంభాషణలు, వీడియో క్లిప్పులు వంటి ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా కోర్టు ముందుంచారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన విచారణ సందర్భంగా సారా ఖలీఫాను ఆమె పాత్రపై న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే తనకు డ్రగ్స్ గురించి ఎలాంటి అవగాహన లేదని ఆమె చెప్పినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా వెల్లడించింది. నార్కోటిక్స్ అథారిటీ కార్యాలయంలోనే తొలిసారి డ్రగ్స్‌తో తన ఫొటోలు తీశారని ఆమె కోర్టుకు చెప్పినట్లు పేర్కొంది.
Egypt court hands DEATH SENTENCE TO 39yo TV PRESENTER SARAH KHALIFA over DRUG CHARGES
CONVICTED OF MANUFACTURING and TRAFFICKING NARCOTICS pic.twitter.com/3MtvWlIwOI— RT (@RT_com) September 5, 2026
గ్రాండ్ ముఫ్తీ అభిప్రాయం తర్వాతే తుది తీర్పు..
ఈ మరణదండన తీర్పును గత నెలలోనే ప్రకటించినప్పటికీ.. ఈజిప్టు చట్టం ప్రకారం ఉరిశిక్ష కేసుల్లో దేశ గ్రాండ్ ముఫ్తీ నుంచి మతపరమైన అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాతే కోర్టు తాజాగా మరణదండనను ధ్రువీకరించింది. అయితే కోర్టు తీర్పుపై నిందితులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
ఈజిప్టులో మరణశిక్షలపై చర్చ..
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2025 నివేదిక ప్రకారం.. ఆ ఏడాది ఈజిప్టులో 492 మరణదండన తీర్పులు వెలువడగా, 23 మందిని ఉరితీశారు. అయితే అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల ప్రమాణాల ప్రకారం మరణశిక్షను అత్యంత తీవ్రమైన, ఉద్దేశపూర్వక హత్యలకు మాత్రమే పరిమితం చేయాలని అమ్నెస్టీ పేర్కొంది.
الحكم بالإعــدام على المذيعة سارة خليفة و١١ آخرين https://t.co/fz2yA5B7ut pic.twitter.com/NnmIWOiN7s
— فنجرام (@Fangramm) September 5, 2026


