నేపాల్‌లో 60 ఏళ్ల వృద్ధురాలు, చైనా జాతీయుడిని రక్షించిన అధికారులు
కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలు
589 మంది విదేశీయులు సహా 5,000 మంది మిస్సింగ్
కఠ్మాండు: నేపాల్‌లో మరో అద్భుతం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. నువాకోట్ జిల్లా బిదుర్ పట్టణంలో ఆకస్మిక వరదల వల్ల కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలు చండికా శ్రేష్ట 10 రోజుల తర్వాత సజీవంగా బయటపడింది.
సహాయక సిబ్బంది బురద, ఒండ్రు మట్టిని తొలగించి ఆమెను శనివారం క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ నెమ్మదిగా స్పృహలోకి రావడం వీడియోలో కనిపిస్తోంది. సహాయక సిబ్బంది ఆమెను దుప్పటి, జాకెట్‌తో కప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వృద్ధురాలిని చికిత్స కోసం వెంటనే హెలికాప్టర్‌లో కఠ్మాండు ఆసుపత్రికి తరలించారు.
సొరంగంలో చైనా జాతీయుడు
రసువా జిల్లాలో భారీ వరదల ధాటికి ధ్వంసమైన అప్పర్ త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి ఒక చైనా జాతీయుడిని శనివారం రక్షించారు. అతడిని లూహైటతావోగా గుర్తించారు. వరదల సమయంలో ‘ఆడిట్ టన్నెల్ 4’లో చిక్కుకుపోయాడు. లూహైతావోను నేపాలీ సైన్యం, విదేశీ సహాయక సిబ్బందితో కూడిన బృందం కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. సొరంగ మార్గంలో సుమారు 225 మీటర్ల లోపల ఉన్న ఒక ప్రదేశం నుంచి సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు.
అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగాల సజీవంగా బయటకు తీసిన కార్మికుల సంఖ్య మొత్తం మూడుకు చేరింది. శుక్రవారం త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్లాంట్‌లోని ఒక సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు కబిర్ మహర్జన్, సంజయ్ షాను రక్షించిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో పదికిపైగా జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద కనీసం 900 మంది కార్మికులు గల్లంతయ్యారని, వీరిలో దాదాపు 500 మంది సొరంగాల లోపలే ఉండి ఉంటారని అధికారులు వెల్లడించారు.
1,344కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం 1,344కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 13,000 మందికి పైగా బాధితులను రక్షించామని పేర్కొన్నారు. ఎనిమిది జిల్లాల్లో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల్లో 758 పెద్దలవి, 85 పిల్లలవి కాగా, 501 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయని తెలిపారు. డీఎన్‌ఏ సేకరణ సహా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మొత్తం 1,030 మృతదేహాలను ఖననం చేశారు. కేవలం 96 మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించారు.


