నేపాల్‌లో ఇద్దరు బాధితులకు కృష్ణాష్టమి రోజే పునర్జన్మ
హరే కృష్ణ’ మహామంత్రమే కాపాడిందన్న సంజయ్ షా
ఆర్మీ ఆస్పత్రిలో కబిర్ మహర్జన్‌కు చికిత్స
త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్ నుంచి కాపాడిన అధికారులు
కఠ్మాండు: సరిగ్గా 9 రోజులు.. 216 గంటలు.. చుట్టూ చిమ్మచీకటి.. ఆకలేస్తున్నా తినడానికి తిండి లేదు. దాహమేస్తున్నా తాగడానికి మంచినీరు లేదు. అయినా బతుకుతామన్న ఆశను కోల్పోలేదు. శ్రీకృష్ణుడి నామస్మరణ చేస్తూ రేపటి కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. అదృష్టం వారిపైపే ఉంది. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. పవిత్ర పర్వదినం కృష్ణాష్టమి రోజే వారికి పునర్జన్మ లభించడం గమనార్హం.
ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులోని ఒక సొరంగం నుంచి ఇద్దరు వ్యక్తులను అధికారులు శుక్రవారం రక్షించారు. వారిద్దరినీ ఈ ప్రాజెక్టులో మెకానికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కబిర్ మహర్జన్(45), ఫోర్‌మెన్ సంజయ్ షా(30)గా గుర్తించారు. మహర్జన్‌ను కఠ్మాండులోని నేపాల్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు సంజయ్ షా నువాకోట్‌లోని త్రిశూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సహచరుల ప్రాణాలే ముఖ్యం
సెంట్రల్ నేపాల్‌లోని త్రిశూలి నది పరీవాహక ప్రాంతంలో ఆగస్టు 24న సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగంలోకి నీరు చేరింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న కబిర్ మహర్జన్, సంజయ్ షా బయటకు రాలేకపోయారు. సొరంగం ముఖద్వారం మట్టితో మూసుకుపోయింది. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తొమ్మిది రోజుల అన్వేషణ ద్వారా వారిద్దరూ బయటపడ్డారు. గత తొమ్మిది రోజులుగా సొరంగంలో హరే కృష్ణ మహా మంత్రాన్ని జపిస్తూనే ఉన్నానని సంజయ్ షా భద్రతా సిబ్బందికి చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు తాను కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్నానని తెలిపాడు.
‘‘కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్నప్పుడు అందరి ప్రాణాలను కాపాడటమే నా బాధ్యత. ప్రమాదం తర్వాత అందరినీ బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాను. మొదట నా ప్రాణాల కంటే సహచరుల ప్రాణాలే ముఖ్యమని భావించా. వారు బయటకు వెళ్లేదాకా అక్కడే వేచి చూశాను. నేను తప్పించుకోవడానికి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సొరంగం మూసుకుపోవడంతో నుంచి బయటకు రాలేకపోయాను.
సొరంగం లోపల నా చట్టుపక్కల ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించా. వారితో మాట్లాడేందుకు ప్రయతి్నంచా. శబ్దాలు చేయడం ద్వారా సంభాíÙంచగలిగాం. పవర్‌హౌస్ పరిసరాలతో సహా సొరంగం లోపలి భాగంలో మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చు. వారు ఏమైపోయారన్నది తెలియదు. ఆ సొరంగం చాలా పొడవైనది. వరద నీటి ఉధృతికి లోపలున్న కారి్మకులు దూరంగా కొట్టుకుపోయి ఉండొచ్చు. అందరూ క్షేమంగా బయటపడే అవకాశమైతే లేదు’’అని సంజయ్ షా చెప్పాడు. మాధేషి ప్రావిన్స్‌లోని సప్తరి జిల్లాకు చెందిన సంజయ్ షా చాలా రోజులుగా ఈ సొరంగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
నా భర్తకు ఇది పునర్జన్మ: మహర్జన్ భార్య
కబిర్ మహర్జన్ ప్రాణాలతో తిరిగిరావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తన భర్తకు పునర్జన్మ లభించిందని మహర్జన్ భార్య హీరా శోభ చెప్పారు. ఆయనను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన రక్షక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రార్థనలు, ఎదురుచూపులు ఫలించాయని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గడచిన తొమ్మిది రోజులు తనకు, తన కుటుంబానికి అత్యంత బాధాకరమైనవని చెప్పారు.
తాము సరిగ్గా తినలేకపోయామని, నిద్ర కూడా పోలేదని అన్నారు. తన భర్త బతికే ఉన్నాడని, కచ్చితంగా తిరిగి వస్తాడని విశ్వసించానని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇతర సొరంగాల్లో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది మంది కార్మికలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియరావడం లేదు. నేపాల్ సైన్యం నేతృత్వంలోని భద్రతా దళాలు ప్రత్యేక పరికరాలను ఉపయోగించి గాలింపు, సహాయక చర్యలు సాగిస్తున్నాయి.
కబిర్ మహర్జన్, సంజయ్ షాలు చిక్కుకుపోయిన సొరంగం లోపలి నుంచి అరుపులు వినిపించడంతో అతికష్టంమీద వారిని రక్షించగలిగామని అధకారులు వెల్లడించారు. 11 హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న 600 మందికిపైగా కారి్మకులు వరదల్లో గల్లంతైనట్లు నేపాల్ స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. కబిర్ మహర్జన్, సంజయ్ షాను సజీవంగా టన్నెల్ నుంచి బయటకు తీయడం సహాయక సిబ్బందిలో కొత్త ఆశను రేకెత్తించింది. మరికొందరిని కూడా కాపాడగలమని వారు భావిస్తున్నారు.
శాటిలైట్ డేటాతో గుర్తింపు
త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రం వద్ద సొరంగంలో ఆచూకీ తెలియకుండా పోయిన 42 మంది కారి్మకుల కోసం డజన్ల కొద్దీ సహాయక సిబ్బంది గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. వారు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడానికి శాటిలైట్ డేటాను ఉపయోగించారు. ఆ తర్వాత బురద, మట్టిని తొలగించడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు. చేతులతో జాగ్రత్తగా తవ్వడం కొనసాగించడానికి ముందు దారిని సుగమం చేయడానికి పేలుడు పదార్థాలను ప్రయోగించారు.
చివరకు ఇద్దరి ఆచూకీ మాత్రం కనిపెట్టగలిగారు. శుక్రవారం తొలుత సంజయ్ షాను సొరంగం నుంచి బయటకు తీశారు. కొద్దిసేపటికే తర్వాత కబీర్ మహర్జన్‌ను రక్షించారు. బయటకు వచ్చిన తర్వాత సంజయ్ షా అడిగిన మొదటి ప్రశ్న.. ఈ రోజు తేదీ ఏమిటి? అని. అత్యవసర వైద్య చికిత్స కోసం వారిద్దరినీ విమానంలో రాజధాని కఠ్మాండులోని సైనిక ఆసుపత్రికి తరలించారు. సంజయ్ షా పరిస్థితి నిలకడగా ఉండగా, మహర్జన్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.
ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు భారతీయులను కాపాడిన సిబ్బంది
న్యూఢిల్లీ: నేపాల్–భూటాన్ సరిహద్దుల్లో సంభవించిన భీకర వరదల్లో గల్లంతైన ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు భారతీయులను శుక్రవారం నువాల్‌కోట్ జిల్లా త్రిశూలి బజార్ ప్రాంతంలో సహాయక సిబ్బంది కాపాడారు. వీరిని అభిజిత్ సురేశ్ పవార్, దీపికా అభిజిత్ పవార్, సమర్థ్ అభిజిత్ పవార్‌గా గుర్తించామని విదేశాంగ శాఖ తెలిపింది.
కఠ్మాండులోని భారత రాయబారి కార్యాలయం వీరిని విమానంలో స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించింది. దీంతో సురక్షితంగా బయటపడిన భారతీయుల సంఖ్య 166కు చేరుకుంది. మరోవైపు, 275 మంది భారతీయుల జాడ తెలియాల్సి ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తెలిపారు.చైనా నుంచి నేపాల్‌లోకి 1,907 మంది భారతీయులు సురక్షితంగా చేరుకున్నారని పేర్కొన్నారు. టిబెట్‌లో చిక్కుకుపోయిన వారిలో భారతీయులెవరూ లేరని చైనా ప్రభుత్వం తెలిపిందని జైశ్వాల్ వెల్లడించారు.
1,295కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 1,295కి చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఎనిమిది వేర్వేరు జిల్లాల్లో ఇప్పటివరకు 1,293 మృతదేహాలను వెలికితీశారు. చిత్వాన్ జిల్లాలో 359, తూర్పు నవల్‌పరాసిలో 221, పశి్చమ నవల్‌పరాసిలో 212, నువాకోట్‌లో 186, రసువాలో 140, గోర్ఖాలో 72, ధాడింగ్‌లో 65, తనాహులో 38 మృతదేహాలను వెలికితీశారు.
శుక్రవారం కఠ్మాండులో రెండు వేర్వేరు ఆసుపత్రులలో వరద బాధితులు ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,295కు చేరింది. ఇప్పటివరకు 13,093 మందిని రక్షించారు. మరో 5 వేల మందికిపైగా గల్లంతయ్యారు. రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నేపాల్‌లో సహాయక చర్యలకు భారతదేశం మద్దతు ఇస్తోంది. భారత్ నుంచి ఫోరెన్సిక్ కిట్లు, వైద్య సామగ్రితో సహా 21.5 టన్నుల సహాయక సామగ్రితో విమానాలు గురువారం రాత్రి కఠ్మాండుకు చేరుకున్నాయి.


