నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా! | Nepal Flash Floods: Tunnel Rescue Brings Hope After 9 Days | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!

Sep 4 2026 10:36 AM | Updated on Sep 4 2026 10:46 AM

Nepal Flash Floods: Tunnel Rescue Brings Hope After 9 Days

నేపాల్‌ ఆకస్మిక వరదతో వేలమంది గల్లంతైన వేళ.. అద్భుత ఘటన చోటుచేసుకుంది. శిథిలాలతో పూర్తిగా కూరుకుపోయిన జలవిద్యుత్‌ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా రక్షించగలిగారు. దీంతో సహాయక బృందాల్లోనే కాకుండా.. గల్లంతైన వారి కుటుంబాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

త్రిశూలి ప్రాంతంలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్‌ ప్రాజెక్టు టన్నెల్‌లో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 26న వచ్చిన భారీ వరదల కారణంగా టన్నెల్‌ ప్రవేశ మార్గం మట్టి, బురద, శిథిలాలతో మూసుకుపోయింది. అప్పటి నుంచి లోపల చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ఇద్దరు వ్యక్తులు సజీవంగా ఉన్నట్లు గుర్తించి.. వారిని బయటకు తీసుకొచ్చారు.

వాళ్ల పేర్లు కబీర్‌ మహార్జన్‌ (45), సంజయ్‌ షా (30)గా నేపాల్‌ హోంమంత్రి సుదన్‌ గురుంగ్‌ వెల్లడించారు. కబీర్‌ మహార్జన్‌ త్రిశూలి-3ఏ ప్రాజెక్టులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా.. సంజయ్‌ షా నేపాల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీలో మెకానికల్‌ ఫోర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు టన్నెల్‌లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడటం వారి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది.

ఓ పొడి గదిలో ఉండడంతో.. వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారని రెస్క్యూ టీం వెల్లడించింది. సంజయ్‌ షాను బయటకు తీసుకువచ్చే సమయానికి ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరని సమాచారం. వెంటనే అతడిని బట్టార్‌ ప్రాంతానికి విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కబీర్‌ మహార్జన్‌ స్పృహలోనే ఉన్నారని ఆయన భార్య తెలిపారు. ఆయనను ఖాట్మాండులోని ఛావునీ మిలటరీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇద్దరు కార్మికులను బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. బురదతో పూర్తిగా తడిసిపోయిన ఓ కార్మికుడిని రక్షక సిబ్బంది భుజాలపై మోసుకెళ్లారు. మరో వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన సమయంలో అతడి చేతులు జోడించి ప్రార్థిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తొమ్మిది రోజుల పాటు చీకటి, బురద మధ్య ప్రాణాలతో పోరాడి బయటపడటం నిజంగా అద్భుతమేనని పలువురు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే.. నేపాల్‌లోని మరికొన్ని జలవిద్యుత్‌ ప్రాజెక్టుల టన్నెళ్లలో కూడా భారీగా కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు అరడజను టన్నెళ్లలో 150 మందికిపైగా చిక్కుకుని ఉండొచ్చని అంచనా. మొత్తం 12 జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు చెందిన సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 500 మంది టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని గుర్తించి రక్షించేందుకు ఇంజినీర్లు టన్నెళ్లలోకి గాలిని పంపుతున్నారు. 

ఆగస్టు 26న సంభవించిన ఈ భారీ విపత్తు నేపాల్‌లోని పలు పట్టణాలు, లోయలను అతలాకుతలం చేసింది. హిమనదం(గ్లేసియర్‌) కూలిపోవడం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 1,259 మంది మృతి చెందగా.. 5,000 మందికిపైగా గల్లంతైనట్లు నేపాల్‌ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. టన్నెల్‌ నుంచి ఇద్దరు సజీవంగా బయటపడటంతో.. ఇంకా ఎక్కడైనా చిక్కుకున్న వారు ఉంటే వారిని కూడా క్షేమంగా రక్షించవచ్చన్న ఆశలు బలపడ్డాయి.

ఇదీ చదవండి: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న నేపాల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement