ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. ఓసారి ‘హర్ముజ్ సీమైన్లను తొలగించి.. పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాం’ అంటారు. మరోసారి హర్ముజ్‌లో ఇరాన్ మళ్లీ సీమైన్లు పెడుతోందని.. తమ సైన్యం అడ్డుకుంటోందని అంటారు. ఇంకోసారి ఇరాన్‌లో అమెరికా నిఘా ఎంత పక్కాగా ఉందో చెబుతూ.. ‘వాళ్లు బాత్రూమ్‌కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ ఇంతలా మాట్లాడుతుంటే.. ఇరాన్ ఏం చేసిందో తెలుసా?.. ‘హబీబీ.. ఇరాన్‌కు రా!’ అంటూ అమెరికాను ఓ ఆటాడుకుంటోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ విషయంలో చేస్తున్న హెచ్చరికలకు నేరుగా స్పందించకుండా.. ఒక వీడియో గేమ్ రూపంలో వ్యంగ్యాస్త్రం సంధించింది ఇరాన్. ఆ దేశ ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఖాతా ఈ వ్యంగ్య వీడియోను పోస్టు చేసింది. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న యానిమేషన్‌లో హర్ముజ్ జలసంధి 3డీ మ్యాప్ కనిపిస్తుంది. ఆ తర్వాత అది ‘మైన్‌స్వీపర్’ గేమ్‌లా మారుతుంది. పాత కంప్యూటర్లలో బాంబులు ఎక్కడున్నాయో గుర్తిస్తూ ఆడే ఈ గేమ్‌ను.. హర్ముజ్‌లోని సీమైన్లకు అన్వయిస్తూ ఇరాన్ ఈ వీడియో రూపొందించింది. దానితోపాటు ‘హబీబీ (అంకుల్ సామ్).. ఇరాన్‌కు రా!’ అంటూ సందేశం ఇచ్చింది. అంటే మైన్‌స్వీపర్‌లో బాంబుల కోసం వెతికినట్టే.. అమెరికా కూడా హర్ముజ్‌లో సీమైన్ల కోసం వెతుకుతోందన్న భావన వచ్చేలా హేళన చేస్తూ వీడియోను రూపొందించిందన్నమాట.
అసలు మైన్‌ల గొడవేంటి?
పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి.. హార్ముజ్ జలసంధిలో సీమైన్లు ఏర్పాటు చేసి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు నెలల తర్వాత సీక్రెట్ ఆపరేషన్‌తో వాటిని సమర్థవంతంగా తొలగించామని.. ఇది అమెరికా సైన్యం సాధించిన అజేయ విజయమని ట్రంప్ ప్రకటించారు. అయితే రెండ్రోజులకే నాలిక మడతేసి.. ఇరాన్ మళ్లీ కొత్తగా సీమైన్లు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ అంతర్జాతీయ నౌకా మార్గాల్లో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.
Habibi (Uncle Sam), come to Iran! pic.twitter.com/Ay6FdpwF8E
— Iran Embassy in Sierra Leone (@IRANinSalone) September 3, 2026
ఈ క్రమంలో.. హార్ముజ్ జలసంధిలోని ఇరాన్‌కు చెందిన లారక్ దీవిపై అమెరికా రెండు రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసింది. ఆ లాంచర్లతో సీమైన్లను హార్ముజ్‌లోకి పంపేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో దాదాపు నెల రోజుల తర్వాత పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఈ క్రమంలో అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ముందు నుంచే కొట్టిపారేస్తోంది. హర్ముజ్ సీమైన్ల విషయంలో అమెరికా తొలి నుంచి చెబుతోందంతా అబద్ధమేనని.. మార్కెట్లను శాంతింపజేసే ప్రయత్నమేనని అంటోంది. అంతేకాదు.. హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ తమదేనంటూ ఉద్ఘాటించింది. దీంతో అమెరికా-ఇరాన్‌ల మధ్య‘ఎవరి నిఘా ఎంత?’.. ‘హార్ముజ్‌పై ఎవరి పట్టు?’ అనే రీతిలో పోరు కొనసాగుతోంది.
ట్రంప్ మాటలకు మాటలతోనే కాదు..
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, ప్రాంతీయ మిత్రదేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు దిగుతోంది. దీంతో హర్ముజ్ చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆంక్షలను కఠినతరం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే హర్ముజ్ విషయంలో అమెరికా సైనిక బలం, ఇరాన్ వ్యూహాత్మక ప్రతిస్పందన.. రెండూ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇదీ చదవండి: శని గ్రహంపై సరికొత్త మిస్టరీ!


