రష్యా, జర్మనీల మధ్య ఉద్రిక్తతలు
పరస్పరం సాంస్కృతిక కేంద్రాల మూసివేత
రష్యా రాయబారులకు పలు దేశాల సమన్లు
వార్సా: లీప్జిగ్ విమానాశ్రయంపై ఆగస్ట్ 4వ తేదీన రష్యా డ్రోన్ దాడికి యతి్నంచిందన్న జర్మనీ ఆరోపణ తీవ్ర దుమారం రేపింది. ఈ ఆరోపణను తీవ్రంగా ఖండించిన రష్యా..మరో అడుగుముందుకేసి, తమ దేశంలోని జర్మన్ సాంస్కృతి కేంద్రాలను మూసివేయాలని ఆదేశించింది.
మాస్కోతోపాటు సెయింట్ పీటర్స్‌బర్గ్, ఎక్తెరినాబర్గ్ నగరాల్లోని గోతె ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నడిచే కల్చరల్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ బుధవారం చెప్పారు.
బదులుగా, బాన్‌లోని రష్యా కాన్సులేట్, బెర్లిన్‌లోని రష్యన్ హౌస్ కల్చరల్‌సెంటర్‌ను కూడా తాము మూసివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. గురువారం మ్యూనిక్‌లో రక్షణ రంగ సంస్థల సముదాయం పక్కన నిర్మాణంలో ఉన్న భవనంపై గుర్తు తెలియని వస్తువులను విసిరేయగా, అవి మండిపోయాయని జర్మనీ తెలిపింది. ఇది రష్యా పనేనని ఆరోపించింది. తమపై నిత్యం రష్యా ఇలాంటి వాటికి పాల్పడుతోందని పేర్కొంది.
కాగా, లీప్జిగ్ విమానాశ్రయంపై దాడికి నిరసనగా లండన్‌లోని రష్యా రాయబారికి యూకే ప్రభుత్వం గురువారం నోటీసు పంపింది. పోలెండ్, డెన్మార్క్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, లిథువేనియా కూడా తమ దేశాల్లోని రష్యా బారులకు నోటీసులు పంపాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాతో ఇప్పటికే దాదాపుగా యూరప్ దేశాలన్నీ తెగదెంపులు చేసుకున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం, మరిన్ని చర్యలకు దారి తీయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా తీరుపై ఇప్పటికే భయపడుతున్న యూరప్ దేశాలు ముందస్తు భద్రతా చర్యలను మొదలుపెట్టాయి. గురువారం ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో 2 వేల మంది పౌర రక్షణ విన్యాసాల్లో పాలుపంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చేపట్టిన అతి పెద్ద విన్యాసంగా దీనిని భావిస్తున్నారు. రష్యా తమ ఆయుధ కంపెనీలు, వివిధ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని డెన్మార్క్ సైతం ఆరోపిస్తోంది.
7


