శవాలు దొరక్క.. గడ్డి బొమ్మలకు దహన సంస్కారాలు | Nepal Flood Tragedy Villagers Perform Symbolic Cremations with Grass Effigies | Sakshi
Sakshi News home page

శవాలు దొరక్క.. గడ్డి బొమ్మలకు దహన సంస్కారాలు!

Sep 3 2026 1:40 PM | Updated on Sep 3 2026 1:45 PM

Nepal Flood Tragedy Villagers Perform Symbolic Cremations with Grass Effigies

గోర్ఖా (పాలుంగ్‌తార్): నేపాల్‌లోని భోటేకోశీ వరదల్లో గల్లంతైన వారి మృతదేహాలు లభించకపోవడంతో బంధువులు దర్భలతో (కుశ గడ్డి) ప్రతీకాత్మక మానవ ఆకారాలను తయారుచేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గోర్ఖా జిల్లా పాలుంగ్‌తార్‌లోని చేపే, మర్శ్యాంగ్దీ నదుల సంగమ తీరంలో  ఈ విషాదకర దృశ్యాలు కనిపించాయి. ఆగస్టు 10న నౌఖోర్ నుంచి గోసాయింకుండ పుణ్యక్షేత్రానికి 31 మంది యాత్రికులతో వెళ్తున్న వాహనం నువాకోట్‌లోని భైంసే వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఐదుగురు వాహనం నుంచి దూకి ప్రాణాలు దక్కించుకోగా, మిగిలిన 26 మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు నౌఖోర్ గ్రామానికి చెందినవారే.

ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో, స్థానిక పురోహితుల సూచన మేరకు గడ్డితో బొమ్మలు తయారు చేసి, వాటికి బార్లీ పిండిని పూసి శవాలుగా భావించి వేదమంత్రాల మధ్య దహన సంస్కారాలు జరుపుతున్నారు. బుధవారం నాటికి ఆరుగురికి దహన సంస్కారాలు పూర్తికాగా, శుక్రవారానికల్లా మిగిలిన వారందరికీ క్రతువులు ముగించేలా గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని 20 కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ప్రయాణికులను కాపాడేందుకు చివరి వరకు స్టీరింగ్‌ను నియంత్రించేందుకు యత్నించి గల్లంతైన డ్రైవర్ సాగర్ దేవ్‌కోటాకు ఆయన ఐఏళ్ల కుమార్తె దహన సంస్కారాల్లో నిప్పు పెట్టింది. కడసారి చూపునకైనా తమవారి భౌతికకాయాలు దక్కలేదని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇది కూడా చదవండి: నేపాల్‌కు జపాన్‌ దుప్పట్లు, ప్లాస్టిక్‌ షీట్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement