‘బతికించమని అడుక్కోవాలా?’.. నేపాల్‌లో రెస్క్యూ తీరిదీ! | Six Days and Still Waiting Trapped Workers Families Slam Nepal Govt | Sakshi
Sakshi News home page

‘బతికించమని అడుక్కోవాలా?’.. నేపాల్‌లో రెస్క్యూ తీరిదీ!

Sep 2 2026 12:08 PM | Updated on Sep 2 2026 12:20 PM

Six Days and Still Waiting Trapped Workers Families Slam Nepal Govt

నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించి వారం రోజులు దాటుతున్నా.. వేల మంది జాడ లేకుండా పోయింది. నేపాల్‌ సైన్యంతో పాటు భారత్‌, చైనా, అమెరికా, దక్షిణ కొరియా దేశాలు అన్వేషణలో సాయం చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, నదులు పొంగిపొర్లుతుండడం.. ఇప్పటికే బురద దట్టంగా పేరుకుపోయి ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ తరుణంలో సొరంగాల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. 

నేపాల్‌ ఆకస్మిక వరదల్లో 4 వేల మంది జాడ తెలియరావడం లేదు. ఇందులో సుమారు 1000 మంది సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. దీంతో ఆ టన్నెళ్లకు రంధ్రాలు చేసి.. పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్‌ను పంపిస్తున్నారు. అయితే బోర్‌హోల్‌ కెమెరాలతో సొరంగాల పరిశీలనలో కార్మికులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వాళ్లంతా కొట్టుకుపోయి ఉంటారా? లేదంటే వాటిల్లోనే సమాధి అయ్యారా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సహాయక చర్యలు నత్తనడకన సాగుతుండడంపై బాధిత కుటుంబాలు నేపాల్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

రసువా జిల్లాలోని త్రిశూలీ-3ఏ జలవిద్యుత్‌ కేంద్రంలో సుమారు 40 మంది నెపాల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉద్యోగులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ‘ఆరు రోజులుగా ఎదురుచూస్తున్నాం.. అసలు రెస్క్యూ ఎప్పుడు?’ అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఓ ఇంజినీర్‌ భార్య. తన భర్తతో పాటు 40 మంది ఉద్యోగులు త్రిశూలీ-3ఏ ప్రాజెక్టులో చిక్కుకున్నారని ఆమె తెలిపారు. ఈ జలవిద్యుత్‌ కేంద్రం దేశంలోనే అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటని చెప్పడంతో.. లోపలున్న వారంతా క్షేమంగానే ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతోందన్నారు. సమాచారం కోసం ఆర్మీ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. కొందరు టన్నెల్‌ వద్దకు కూడా వెళ్లారు. ఎవరి నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు అని వాపోయారామె.

ప్రకటనలకే పరిమితమా?
చైనా, భారత్‌ నుంచి రెస్క్యూ బృందాలు వెళ్లాయని మీడియాలో వార్తలు వస్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆమె ఆరోపించారు. ‘చైనా, భారత్‌ బృందాలు వెళ్లాయని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క జేసీబీ కూడా అక్కడికి చేరలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వరద తీవ్రత, మట్టి, శిథిలాల పరిస్థితి తెలిసి ఆరు రోజులైనా.. సొరంగాల్లోకి వెళ్లేందుకు అవసరమైన భారీ యంత్రాలు, టన్నెల్‌ కట్టర్లు ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. రోజుకో రెస్క్యూ బృందం వచ్చిందంటూ ప్రకటనలు చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదన్నారు.

‘ఈ రోజు.. రేపు అంటూ ఆరు రోజులు’
రెస్క్యూ బృందాలు వస్తున్నాయని, మంత్రులు ఘటనాస్థలికి వెళ్తున్నారని, చైనాతో సమన్వయం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని ఆమె తెలిపారు. దీంతో బాధిత కుటుంబాలు కూడా ‘ఈరోజు కాకపోతే రేపైనా మా వాళ్లు బయటకు వస్తారు’ అని ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ‘ఇలా ఆశ పెట్టుకుని ఆరు రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రతి గంటా, ప్రతి క్షణం భారంగా మారింది’ అని కన్నీటి పర్యంతమయ్యారు.

‘వాళ్ల ప్రాణాలతో ఆటలు ఆడాలా?’
రెస్క్యూ చర్యల పురోగతిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పది మీటర్లు వెళ్లాం.. 20 మీటర్లు వెళ్లాం అని చెబుతున్నారు. ఇది ఏంటి? మనం వాళ్ల ప్రాణాలు కాపాడుతున్నామా? లేక ఆటలు ఆడుతున్నామా?’ అని ప్రశ్నించారు. ‘ఇది ఒక్కరి విషయం కాదు. 40 కుటుంబాల ప్రాణాల సమస్య. వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ప్రభుత్వానికి తెలుసా?’ అని నిలదీశారు.

తమ ఆవేదనను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితిలో పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రుల పాలయ్యారని తెలిపారు. ‘ఆయన వ్యక్తిగత పని కోసం అక్కడికి వెళ్లలేదు. దేశం కోసం పని చేయడానికి వెళ్లారు. మరి ఆయనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ప్రాణాలు కాపాడమని మేము మీడియా ముందు వేడుకోవాలా?’ అని ఆమె ప్రశ్నించారు.

వందలాది మంది ఉద్యోగులు గల్లంతు
నేపాల్‌లో వరదల కారణంగా మరికొన్ని హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. అప్పర్‌ త్రిశూలీ-1 ప్రాజెక్టు వద్ద 550 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదని ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నేపాల్‌ (ఐపీపీఏఎన్‌) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్కడ 254 మందిని సురక్షితంగా రక్షించినప్పటికీ.. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

అప్పర్‌ త్రిశూలీ-3బీ ప్రాజెక్టులో 122 మంది, లాంగ్‌టాంగ్‌ ఖోలా ప్రాజెక్టులో 41 మంది, చిలిమే హైడ్రోపవర్‌ ప్రాజెక్టులో ఎనిమిది మంది, మెయిలంగ్‌ ఖోలా ప్రాజెక్టులో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. రసువాగఢి హైడ్రోపవర్‌ ప్రాజెక్టులోనూ 93 మంది ఆచూకీ తెలియడం లేదు. చైనా, దక్షిణ కొరియా, భారత్‌కు చెందిన బృందాలు నేపాల్‌ సైన్యంతో కలిసి పలు ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం సమయం గడుస్తున్న కొద్దీ కుటుంబాల ఆందోళన మరింత పెరుగుతోంది.

అధికారులు ఏం చెబుతున్నారు?
మరోవైపు.. సహాయక చర్యల్లో తామేమీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని అక్కడి అధికారులు అంటున్నారు. సొరంగాల్లోకి చేరుకోవడం అత్యంత క్లిష్టంగా మారిందని చెబుతున్నారు. భారీ బురద, నీరు, రాళ్లు, శిథిలాలు మార్గాన్ని పూర్తిగా మూసేశాయని.. కొన్ని ప్రాంతాల్లో డ్రిల్లింగ్‌, భారీ యంత్రాల సాయంతో మార్గాన్ని క్లియర్‌ చేస్తున్నామని వెల్లడించారు. చైనా, భారత్‌ తదితర దేశాల నిపుణుల సహకారంతో పరిస్థితిని అంచనా వేసి రెస్క్యూ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: భారత్‌ మాకు పరిహారం చెల్లించాల్సిందే.. నేపాల్‌ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement