'పుష్ప' రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. మిగతా తెలుగు హీరోలకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం 'రాకా' అనే భారీ బడ్జెట్ మూవీతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే రీసెంట్‌గా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై బన్నీ ఫొటో పడింది. ఈ క్రమంలోనే సదరు మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. 'పుష్ప' గురించి, ప్రస్తుతం వస్తున్న మూవీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?)
ఫోర్బ్స్ ఇంటర్వ్యూలోని తాను మాట్లాడిన కొన్ని విషయాల్ని ఇన్ స్టాలో ఫొటోల రూపంలో బన్నీ షేర్ చేశాడు. వీటిలో ఎక్కువ ఆకర్షిస్తున్నది అయితే 'పుష్ప'లో లేడీ గెటప్ ధరించడం గురించి ఇతడి చెప్పిన మాటలు. 'నా జీవితంలో నేను చేసిన అత్యంత ఆల్ఫా(మగతనం/పవర్‌ఫుల్) పని.. 'పుష్ప'లో మహిళలా చీరకట్టుకుని నటించడమే' అని అన్నాడు.
'ఒత్తిడి అనేది అరుదుగా దొరికే ఒక గొప్ప వరం. దేశంలో కొద్దిమందికి మాత్రమే అలాంటి అవకాశం లభిస్తుంది. నా దృష్టిలో ఒత్తిడి అనేది అదృష్టం. ఇప్పుడు యావరేజ్ కంటెంట్‌ని ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తే, మిగిలిన బాక్సాఫీస్ లెక్కలన్నీ అదే చూసుకుంటుంది. 'పుష్ప' సాధించిన విజయం.. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా నన్ను రోజూ ప్రేరేపిస్తోంది' అని కూడా బన్నీ చెప్పాడు.
(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)


