అమెరికా: కత్తితో మహిళ వీరంగం: ఒకరి మృతి.. నిందితురాలి కాల్చివేత! | Woman Stabs Two in New Yorks Times Square One Dead Accused Shot Dead by Police | Sakshi
Sakshi News home page

అమెరికా: కత్తితో మహిళ వీరంగం: ఒకరి మృతి.. నిందితురాలి కాల్చివేత!

Sep 1 2026 8:53 AM | Updated on Sep 1 2026 9:05 AM

Woman Stabs Two in New Yorks Times Square One Dead Accused Shot Dead by Police

న్యూయార్క్‌: అమెరికాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన న్యూయార్క్ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌లో సోమవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో 32 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా, 68 ఏళ్ల వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం నిందితురాలిని పోలీసులు ఘటనా స్థలంలోనే కాల్చిచంపారు.

పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్వీన్స్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ తన షాపింగ్ బ్యాగ్‌లోంచి రెండు పెద్ద కత్తులను బయటకు తీసి ఈ ఘాతుకానికి పాల్పడింది. సబ్‌వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి, రోడ్డు దాటేందుకు భార్యతో కలిసి వేచి చూస్తున్న 68 ఏళ్ల వ్యక్తి పొట్ట భాగంలో ఆమె మొదట కత్తితో పొడిచింది. ఆ వెంటనే మరో 32 ఏళ్ల మహిళపై దాడి చేసింది. బాధితులిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 32 ఏళ్ల మహిళ మరణించింది. గాయపడిన వృద్ధుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని చుట్టుముట్టారు. చేతిలోని కత్తులను కింద పడేయాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆమె నిరాకరించింది. ‘నేను దేన్నీ వదలను, మీ ఇద్దరినీ చంపడానికైనా సిద్ధమే’ అంటూ వారి వైపు దూసుకురావడంతో పోలీసులు తొలుత టేజర్ ప్రయోగించి, అనంతరం కాల్పులు జరిపారు. బుల్లెట్ తగలడంతో నిందితురాలు అక్కడికక్కడే కుప్పకూలింది. నిందితురాలికి మానసిక సమస్యలు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు 7వ అవెన్యూలోని కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్‌వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement