హెచ్‌–4 వీసాదారులకు ట్రంప్‌ ఝలక్‌..! | Trump administration latest move on H-4 employment authorisation | Sakshi
Sakshi News home page

హెచ్‌–4 వీసాదారులకు ట్రంప్‌ ఝలక్‌..!

Sep 1 2026 4:52 AM | Updated on Sep 1 2026 4:52 AM

Trump administration latest move on H-4 employment authorisation

ఈఏడీ కేటగిరీ 26 రద్దుకు ప్రతిపాదన 

అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి

సాక్షి, అమరావతి: అమెరికాలో విదేశీయుల ఉద్యోగ అవకాశాలపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కొరడా ఝుళిపించేందుకు సిద్ధపడుతున్నారు. హెచ్‌–4 వీసాలపై అమెరికాలో ఉన్నవారు ఆ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు కల్పిస్తున్న నిబంధనను తొలగించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఆర్‌ఐఎన్‌ 1615–ఏడీ–14 ప్రతిపాదనలను రూపొందించింది. ఇది  దీర్ఘకాలంగా ప్రతిపాదనలో ఉన్న అంశమని కూడా పేర్కొంది.  

ఈఏడీ కేటగిరీ 26 అంటే... 
అమెరికాలో హెచ్‌–1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు హెచ్‌–4 వీసాలను మంజూరు చేస్తారు. డిపెండెంట్‌ జీవిత భాగస్వాములుగా హెచ్‌–4 వీసా పొందినవారు అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు 2015 నుంచి అనుమతిస్తున్నారు. ఇందుకు కొన్ని షరతులతో అనుమతిస్తూ ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)లోని కేటగిరీ 26 కింద ఈ అవకాశం కల్పించారు. దీనిప్రకారం హెచ్‌–1 బీ వీసాదారు ఆమోదిత ఎంప్లాయింట్‌ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ అయ్యుండాలి.

ఆ వీసాదారుకు సాధారణంగా అనుమతి ఉండే ఆరేళ్ల గడువు కంటే పొడిగింపు లభించి ఉండాలి. ఆ విధమైన హెచ్‌–1 బీ వీసాదారు జీవిత భాగస్వామి (హెచ్‌–4 వీసాదారు) దరఖాస్తు చేసుకుంటే అమెరికాలో ఉద్యోగం చేసేందుకు, ఉద్యోగం మారేందుకు, స్వయం ఉపాధి ద్వారా  ఆదాయం పొందేందుకు, సొంతంగా ఏదైనా కెరీర్‌ను కొనసాగించేందుకు ఈఏడీ కేటగిరీ 26 కింద అనుమతిస్తారు.  

భారతీయులపై ఎఫెక్ట్‌ 
హెచ్‌–4 వీసా ప్రయోజనం పొందుతున్న వారిలో పెద్ద సంఖ్యలో భారతీయులే ఉండటంతో  ప్రస్తుతం అమెరికాలోని భారతీయుల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈఏడీ  హెచ్‌–4 వీసాదారులు దాదాపు 1.50 కోట్ల మంది ఉండడం గమనార్హం. వారిలో భారత మూలాలు ఉన్నవారు 50 లక్షలకుపైగా ఉన్నట్టు అంచనా. ఇక ఈఏడీ కేటగిరీ 26 కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు, భవిష్యత్‌లో దరఖాస్తు చేసుకునేవారిలో అత్యధికులు భారతీయ అమెరికన్లే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈఏడీ కేటగిరీ 26 రద్దు చేస్తే అత్యధికంగా నష్టపోయేది భారతీయ అమెరికన్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement