వెలిగొండ వేదికగా.. వెన్నుపోటు విన్యాసాలు! | Chandrababu lies at the Gantavanipalle meeting: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వెలిగొండ వేదికగా.. వెన్నుపోటు విన్యాసాలు!

Sep 1 2026 3:52 AM | Updated on Sep 1 2026 3:52 AM

Chandrababu lies at the Gantavanipalle meeting: Andhra Pradesh

గంటావానిపల్లె సభలో పచ్చి అబద్ధాలు వల్లె వేసిన సీఎం చంద్రబాబు 

నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నానంటూ గప్పాలు.. నిర్వాసితులకు పూర్తిగా పరిహారం చెల్లించకుండా ద్రోహం 

అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి హార్టీకల్చర్‌ హబ్‌లో మార్కాపురాన్ని చేర్చినట్లు డాంబికాలు

సాక్షి, అమరావతి: వెలిగొండకు నేనే శంకుస్థాపన చేశా..! నేనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నానంటూ.. కృష్ణా జలాలకు సాష్టాంగ ప్రణామం చేస్తూ సీఎం చంద్రబాబు ప్రదర్శించిన విన్యాసాలు పిట్టలదొరను మరిపించాయని ప్రాజెక్టు సాధన కోసం ఉద్యమం చేసిన వారు, రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 1996 లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కనిగిరిలో పర్యటించిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చిచెప్పారని ప్రాజెక్టు సాధన కోసం ఉద్యమం చేసిన నాయకులు  గుర్తు చేస్తున్నారు.

‘జలయజ్ఞం’లో భాగంగా 2004 అక్టోబరు 27న సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండకు శంకుస్థాపన చేసి.. దేశంలో తొలిసారిగా విదేశాల నుంచి టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌(టీబీఎం) దిగుమతి చేసుకుని ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారని ప్రస్తావిస్తున్నారు. ఆ తర్వాత 2014–19 అధికారంలో ఉన్న చంద్రబాబు, వెలిగొండలో మిగిలిన పనులను పూర్తి చేసి 2016లో ప్రారంభిస్తా.. 2017లో జాతికి అంకితం చేస్తా.. 2018లో పూర్తి చేస్తా.. అంటూ ముహూర్తాలు మార్చుకుంటూ వెళ్లారు.

 2014కు ముందు చేసిన పనులకే ధరల సర్దుబాటు పేరుతో రూ.630.57 కోట్లను కాంట్రాక్టర్‌కు దోచిపెట్టటాన్ని కాగ్‌ (కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) సైతం తప్పుబట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఫీడర్‌ కెనాల్‌ లైనింగ్‌ పనుల అంచనా వ్యయాన్ని రూ.207.45 కోట్ల నుంచి రూ.456 కోట్లకు పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టారని పేర్కొంటున్నారు. 

వెనుకబడిన మార్కాపురం జిల్లాలో పెద్దదోర్నాల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను నిలిపివేసి.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతూ... 2024, 2025 సీజన్‌లలో వెలిగొండకు నీళ్లు ఇవ్వకుండా ఆ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు సోమవారం గంటావానిపల్లె సభలో తన దైన శైలిలో పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ పిట్టలదొరను మరిపించారంటూ విశ్లేషిస్తున్నారు.

సీఎం చంద్రబాబు: వెలిగొండకు 1996 మార్చి 6న నేను శంకుస్థాపన చేశా. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి నేనే జాతికి అంకితం చేస్తున్నా. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే వెలిగొండ ఎప్పుడో పూర్తయ్యేది. 2019లో వెలిగొండకు పట్టిన గ్రహణం 2024లో వీడింది.  

వాస్తవం: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠా­న్ని చంద్రబాబు అధిరోహించాక లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు 1996 మార్చి 6న వెలిగొండకు శంకుస్థాపన చేశారు. శిలాఫలకం.. సభ నిర్వహణ ఏర్పాట్లకు వెలిగొండ ఖాతాలో రూ.పది లక్షలు వ్యయం చేశారు. ఆ ఎన్నికలు పూర్తయ్యాక కనిగిరిలో పర్యటించిన చంద్రబాబు సాంకేతికంగా వెలిగొండ సాధ్యం కాదని ప్రకటించి  చేతులెత్తేశారు. 2004లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక 2004 అక్టోబర్‌ 27న వెలిగొండకు శంకుస్థాపన చేశారు. 

శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించేలా ఆసియాలో అత్యంత పొడవైన 18.80 మీటర్ల వ్యాసంతో కూడి­న రెండు సొరంగాలు.. నల్లమలసాగర్, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల ఆయ­కట్టు, 23 లక్షల మంది దాహార్తి తీర్చేలా వెలిగొండ పనులను పరుగులెత్తించారు. రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి చేశారు. కానీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వెలిగొండను దోపిడీకి ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు సర్కార్‌ దోపిడీకి నిదర్శనం.

జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు  దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌) మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. 2019లో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కరోనా ప్రతి­కూల పరిస్థితుల్లోనూ మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు.

రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయా­న్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్‌ జగన్‌.. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి, టీడీపీ సర్కార్‌ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరం­గం పనులను అప్పగించి 2024 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయించారు. ఆ రెండు సొరంగాలను 2024 మార్చి 6న జాతికి అంకితం చేసి.. రూ.1,301.56 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2024 ఆగస్టులో నల్లమలసాగర్‌ను నింపి.. దుర్భిక్ష ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చే ప్రణాళికను ప్రకటించారు. వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుర్భుద్ధితోనే రెండేళ్లుగా వెలిగొండకు నీటిని విడుదల చేయకుండా సీఎం చంద్రబాబు జాప్యం చేస్తూ వచ్చారని రైతులు మండిపడుతున్నారు.  

సీఎం చంద్రబాబు: కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం ఇచ్చాం. ఇంకా రూ.165 కోట్లు ఇవ్వాలి. ఇది కాకుండా మరో రూ.169 కోట్లు ఇవ్వాలి. మొత్తం రూ.1,070 కోట్ల పరిహారం నిర్వాసితులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాది.  

వాస్తవం: నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాల­కు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద నిర్వా­సితులకు రూ.1,301.56 కోట్లతో పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. అందులో 96 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి 2024 జనవరి నాటికే పునరావాసం కల్పించింది. 

మిగతా 7,225 నిర్వాసిత కుటుంబాలకు పున­రావాసం కల్పించి.. 2024 సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ.. ఇప్పుడు చంద్రబాబు సర్కార్‌ పరిహారంలో కోత వేసింది. ఇప్పటివరకూ కేవలం రూ.768 కోట్ల పరిహారం మాత్రమే ఇచ్చి నిర్వాసితులకు వెన్నుపోటు పొడిచింది.

సీఎం చంద్రబాబు: సెప్టెంబర్‌లో రూ.లక్ష కోట్ల గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ ప్రాజెక్ట్‌లో మార్కాపురాన్ని భాగం చేస్తాం. వెనుకబడిన ఈ ప్రాంతం రేపు పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుంది. వెలిగొండ మొదటి దశ ప్రారంభించాం. ఇక్కడితో ఆగం. ఇదే వేగంతో వెలిగొండ ఫేజ్‌–2 కూడా 2028కి పూర్తి చేసే బాధ్యత మాదే. 

వాస్తవం: వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లందించి మార్కాç­³#రం, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వెనుకబడిన మార్కాపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ బలంగా అడుగులు వేసింది. రామా­యపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపట్టి 95 శాతం పూర్తి చేసింది. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను పూర్తి చేసింది. వెలిగొండ నుంచి 2.58 టీఎంసీలను దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండ్రస్టియల్‌ హబ్‌కు, 1.27 టీఎంసీలను పామూరు నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌)కు సరఫరా చేసేందుకు లైన్‌ క్లియర్‌ చేసి పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఇవ్వడం ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను యువతకు కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు.

కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేటుకు కట్టబెట్టేసింది. రామాయపట్నం పోర్టు­ను కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది. పెద్దదోర్నాల వద్ద వైఎస్‌ జగన్‌ చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని చంద్రబాబు సర్కార్‌ అటకెక్కించేసింది. మార్కాపురం వద్ద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన మెడికల్‌ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. హార్టీకల్చర్‌ హబ్‌ ప్రాజెక్టుకు 2026–27 బడ్జెట్‌లో కేవలం రూ.200 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు.. మూడేళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది.

ఇప్పుడు ఆ ప్రాజెక్టులో మార్కాపురాన్ని చేర్చుతానని ప్రకటించడంపై విస్తుపోతున్నారు. కేవలం ఆ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామాకు తెరతీశారని చెబుతున్నారు. పిట్టలదొరలు పొట్టకూటి కోసం ప్రజలను నవి్వంచడానికి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా గప్పాలు కొడితే.. రాజకీయ బతుకుదెరువు కోసం అంతకుమించి పచ్చి అబద్ధాలు వల్లె వేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement