నదులన్నీ విషతుల్యం.. చేపల వేటపై నిషేధం! | Nepal Floods Trigger Health Alert, Avoid Fish And Aquatic Animals From Polluted Rivers, Check More Details Inside | Sakshi
Sakshi News home page

నదులన్నీ విషతుల్యం.. చేపల వేటపై నిషేధం!

Aug 31 2026 8:25 AM | Updated on Aug 31 2026 10:19 AM

Health Alert Avoid Consuming Fish and Aquatic Animals from Flooded Rivers in Nepal

నవల్‌పూర్ (నేపాల్): రసువాలో సంభవించిన వరదల దృష్ట్యా ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పుపై నవల్‌పూర్ ప్రావిన్షియల్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్ ఏడు సూత్రాల మార్గదర్శకాలను (అడ్వైజరీ) జారీ చేసింది. వరద ప్రవాహంలో మృతదేహాలు, పశువులు, ఇతర జంతువుల కళేబరాలు కొట్టుకురావడంతో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కాలుష్యపూరితమైన నదులు, వాగుల నుంచి చేపలు లేదా ఇతర జలచరాలను పట్టి ఆహారంగా తీసుకోవద్దని ప్రజారోగ్య కార్యాలయం సూచించింది. కలుషిత నీటిలో ఈత కొట్టకూడదని, తాగునీటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకున్న తర్వాతే ఉపయోగించాలని తెలియజేసింది. కలుషిత నీటి వినియోగం వల్ల కలరా, టైఫాయిడ్, డయేరియా (విరేచనాలు), డిసెంట్రీ, హెపటైటిస్ ఎ,ఇ వంటి తీవ్ర వ్యాధులు ప్రబలే ముప్పు ఉందని హెచ్చరించింది. పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని మాత్రమే భుజించాలని, పచ్చి పదార్థాలను, వండిన వంటకాలను వేర్వేరుగా ఉంచాలని సూచించింది. వరద నీటిలో మునిగిన, కలుషితమైన, కుళ్ళిన లేదా దుర్వాసన వచ్చే ఆహారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదని స్పష్టం చేసింది.

వరదల అనంతర పరిస్థితుల్లో డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫలైటిస్ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు పాముకాటు ప్రమాదాలు పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని,  రాత్రివేళ నడిచేటప్పుడు టార్చ్ లైట్ ఉపయోగించాలని సూచించారు. పడుకునే ముందు పరుపులను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల తర్వాత మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులు పేర్కొన్నారు. నదీ తీరాల్లో లేదా వాగుల పరివాహక ప్రాంతాల్లో మానవ శరీర భాగాలు లేదా జంతు కళేబరాలు కనిపిస్తే వెంటనే స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి లేదా నేపాల్ పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: నేపాల్: 1.6 లక్షల మహిళల పరిస్థితి దయనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement