హిమాలయాలు కోట్లాది ప్రజలకు జీవనాధారమైన నదులకు పుట్టినిల్లు. భారత ఉపఖండ వాతావరణం, వ్యవసాయం, జీవ వైవిధ్యం, ఆధ్యాత్మికతతో వాటికి విడదీయరాని సంబంధం ఉంది. కానీ నేడు మనిషి హిమాలయాలను ప్రకృతి వరంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, రహదారి కారిడార్‌గా, విద్యుత్ ప్రాజెక్టుల ప్రాంతంగా, నిర్మాణాలకు అనువైన భూమిగా చూడటం మొదలు పెట్టాడు. మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావం కూడా పెరుగు తోంది. ఫలితంగా నేపాల్–టిబెట్ సరిహద్దు హిమాలయప్రాంతంలో ఆగస్టు 26 లాంటి ఘోరవిపత్తులు సంభవిస్తున్నాయి.
అభివృద్ధి కావాలి. కానీ హిమాలయాల మూల్యంతో కాదు. దేశ భద్రతకు రహదారులు అవసరం. స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి పర్యాటకం అవసరం. కానీ హిమాలయాలను మైదాన ప్రాంతాల మాదిరిగా చూస్తూ అభివృద్ధి చేయడం ప్రమాదకరం. కొండను తొలిచి రోడ్డు వేస్తాం. తవ్విన మట్టి, రాళ్లను పక్కనే వేస్తాం. నదీ తీరంలో హోటల్ కడతాం. పార్కింగ్ కోసం నదినే పూడ్చివేస్తాం. వాగులపై నిర్మాణాలు చేపడతాం. సహజ డ్రైనేజీలను మూసేస్తాం. ఆ తర్వాత భారీ వర్షం వస్తే మాత్రం దాన్ని ‘అనూహ్య ప్రకృతి విపత్తు’గా పేర్కొంటాం. ప్రకృతి అనూహ్యంగా ప్రవర్తించిందా? లేక ప్రకృతి హెచ్చరికలను మనమే పట్టించుకోలేదా?
హిమాలయంలో రహదారి నిర్మాణం అంటే కేవలం కొండను తవ్వడం కాదు. కొండ స్థిరత్వం, నీటి సహజ ప్రవాహం, వర్షపు నీటి డ్రైనేజీ, దిగువ ప్రాంతాల భద్రత అన్నింటిపైనా ప్రభావంఉంటుంది. అందుకే ‘ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మించాం?’ అన్నదే కాకుండా ‘ఎంత భూభాగం అస్థిరమైంది?’ అని కూడా ప్రశ్నించాలి. రోడ్డు ‘ఆల్ వెదర్’ కావచ్చు... హిమాలయం మాత్రం ‘ఆల్ వెదర్’ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి.
కేదార్‌నాథ్ నుంచి జోషిమఠ్ వరకు...
2013 కేదార్‌నాథ్ విషాదం హిమాలయాల సున్నితత్వాన్ని దేశా నికి స్పష్టంగా చూపించింది. నదీ లోయలు, వరద మైదానాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో నిర్మాణాలపై హెచ్చరికలు వచ్చాయి. 2023లో జోషిమఠ్ భూమి కుంగుబాటు మరోసారి హెచ్చరించింది.హిమాలయాల్లో మరో పెద్ద సమస్య నదీ తీరాలు, వరద మైదానాల్లో పెరుగుతున్న నిర్మాణాలు. సహజ నదీ ప్రవాహప్రాంతం క్రమంగా కుంచించుకు పోతోంది. సాధారణ రోజుల్లో నది ప్రశాంతంగా ఉంటుంది. కానీ అసాధారణ వర్షం వచ్చినప్పుడు దాని పాత ప్రవాహ మార్గాలు తిరిగి జీవం పొందుతాయి. నది తన దారిని తిరిగి వెతుక్కుంటుంది. అందుకే నదీ గర్భం, వరద మైదా నాల్లో నిర్మాణాలకు కఠినమైన జోనింగ్ నిబంధనలు అవసరం.
హిమాలయాలను రక్షించాలంటే అభివృద్ధిని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. అభివృద్ధి విధానాన్ని మార్చాలి. ప్రతి ప్రధాన తీర్థ, పర్యాటక ప్రాంతానికి శాస్త్రీయ క్యారీయింగ్ కెపాసిటీని నిర్ణయించాలి. నదుల వెంట, సహజ డ్రైనేజీలలో నిర్మాణాలను కఠినంగా నియంత్రించాలి. భారీ రోడ్డు, టన్నెల్, విద్యుత్ ప్రాజెక్టులకు పర్యా వరణ ముప్పు మదింపును తప్పనిసరి చేయాలి. కొండ తవ్వకాల వ్యర్థం నదుల్లోకి చేరకుండా పటిష్ట పర్యవేక్షణ ఉండాలి. స్థానిక ప్రజల అనుభవం, సంప్రదాయ జ్ఞానాన్ని విపత్తు నిర్వహణలో భాగం చేయాలి.
హిమాలయాలను జయించలేం, గౌరవించాలి. ఎంత పెద్ద రోడ్డు వేసినా, ఎన్ని టన్నెళ్లు తవ్వినా, ఎన్ని హోటళ్లు కట్టినా, ఒక విరిగిన భారీ కొండచరియ ముందు మనిషి ఎంత చిన్నవాడోప్రకృతి నిరూపిస్తూనే ఉంటుంది. హిమాలయాలను మన అవసరా లకు తగ్గట్టు మార్చడం కాదు. మన అవసరాలను హిమాలయాల పరిమితులకు తగ్గట్టు మార్చుకోవాలి. అదే నిజమైన అభివృద్ధి.
– శ్రీకాంత్ బందు ‘ సీనియర్ జర్నలిస్ట్


