భారత్ ప్రస్తుతం దౌత్య వ్యవహారాల్లో తలమునకలై ఉంది. కిర్గిజ్‌స్తాన్‌లోని బిష్కెక్‌లో ఆగస్టు 31 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) శిఖ రాగ్ర సమావేశాలు మొదలవుతున్నాయి. తర్వాత, ఢిల్లీలో సెప్టెంబర్ 12 నుంచి ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు జరగ నున్నాయి.మన జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ ఆగస్టు 25న చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యితో బీజింగ్‌లో చర్చలు జరిపారు. భారత్–చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల ప్రత్యేక ప్రతి నిధుల 25వ దఫా సమావేశాలు చైనాలో జరిగాయి. రెండు దేశాలు మొదటి రోజున విడివిడిగా ప్రకటనలు చేశాయి. దాంతో ఏకాభి ప్రాయం కుదరనట్లుగా కనిపించింది. కానీ, ఆగస్టు 26న, ఎనిమిది అంశాలతో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
ఏకీభావం ఎందులో?
ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరింపజేసుకోవడం, స్థిరత్వాన్ని కొనసాగించడం, శాంతి, ప్రశాంతతలకు భంగం వాటిల్లకుండా చూసుకొనే దిశగా ముందడుగు వేయాలని స్థూలంగా ఒక అభిప్రా యానికి వచ్చారు. సరిహద్దుల పునర్విభజనపై ‘వీలైనంత త్వరగా, గణనీయమైన ఫలితాలు’ సాధించేలా చర్చలు జరపాలనే సంకల్పం గురించి ప్రత్యేకించి పేర్కొన్నారు. సరిహద్దుకు రెండు వైపుల ప్రవహి స్తున్న నదుల గురించి సెప్టెంబర్‌లో మాట్లాడుకోవాలని నిర్ణయాని కొచ్చారు. సరిహద్దు గుండా సాగే వర్తకానికి వెసులుబాటు కల్పించు కోవాలనీ, సరిహద్దులో అదనంగా సమావేశ ప్రాంతాలు, హాట్ లైన్స్ ఏర్పాటు చేసుకోవాలనీ నిర్ణయించారు.
భారత్–చైనా మధ్యనున్న 3,488 కిలోమీటర్ల నిడివి గల వాస్తవాధీన రేఖలో పునర్విభజనకు ఏయే రంగాలను ఎంచుకున్నదీ రెండు పక్షాలు వెల్లడించలేదు. భారత్–చైనా ప్రత్యేక ప్రతినిధుల తదుపరి దఫా సమావేశం మన దేశంలో 2027లో జరుగనుంది. గల్వాన్ ఘర్షణ (2020) తర్వాత, స్నేహ సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు ఆమధ్య కాలంలో సాగిన ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ చర్చలు జరిగాయని భావించవచ్చు.
కూటముల భిన్న లక్ష్యాలు
భారత్ విషయానికొస్తే, ‘ఎస్‌సీఓ’, ‘బ్రిక్స్’ నెరవేర్చగల ప్రయోజనాలు భిన్నమైనవి. షాంఘై సహకార సంస్థలో భారత్– చైనాలతోపాటు రష్యా, పాకిస్తాన్, కజికిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ ఉన్నాయి. ఇది మొదట్లో ప్రాంతీయ భద్రత, కౌంటర్–టెర్రరిజంపైనే దృష్టి పెట్టింది. తర్వాత, ఆయా దేశాల మధ్య కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలకు విస్తరించి నప్పటికీ, ఈ సంస్థకు ఇప్పటికీ భద్రతే మూల బిందువు.
బిష్కెక్ సమావేశంలో మనం సీమాంతర తీవ్రవాదం గురించి లేవనెత్తే అవకాశం ఉంది. సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేదిగా ఉన్న చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లపై వెనక్కి తగ్గాలని కోరవచ్చు. మధ్య ఆసియా, రష్యా, చైనాలతో కలసి పనిచేయగల మార్గాలను అన్వేషించవచ్చు. ‘బ్రిక్స్’కు విస్తృత భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత అధ్యక్ష హోదాలో ‘బ్రిక్స్’ కూటమి నాయకుల 18వ శిఖరాగ్ర సమావేశాలకు మనమే ఆతిథేయిగా ఉన్నాం. ‘స్థితిస్థాపకత, నవీ కరణ, సహకారం, సుస్థిరత’లను ప్రధాన భావనగా చేసుకుని ఈ సమావేశాలు సెప్టెంబర్ 12–13 తేదీలలో జరుగనున్నాయి.
రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఢిల్లీ సదస్సుకు జిన్‌పింగ్ హాజరవుతారని బీజింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. కానీ, భారత్ ‘విజయవంతంగా’ ‘బ్రిక్స్’ సమావేశాలు నిర్వహించేందుకు అండగా ఉంటామని చైనా చెబుతోంది. బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ హాజరవబోవడం లేదని బీజింగ్ 2025 మొదట్లోనే ప్రక టించేసింది. ఇది నిష్క్రియాపరత్వం కాదు. ఆచితూచి వ్యవహరించే ధోరణి. హాజరయ్యే అంశాన్ని నాన్చడం వల్ల సరిహద్దు పునర్విభజన, వాణిజ్యం అంశాలపై బేరసారాలాడేందుకు బీజింగ్‌కు అవకాశం చిక్కుతుంది.
పాతుకుపోయిన అపనమ్మకం
బీజింగ్ రెండు నాల్కల ధోరణి ఢిల్లీని కలవరపరుస్తోంది. అది ఒక పక్క, ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక, దీర్ఘకాలికదృక్పథం’తో చూస్తున్నామని చెబుతోంది. మరోపక్క, అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి కొత్త మ్యాప్‌లు విడుదల చేస్తోంది. వాస్తవాధీన రేఖపై అస్పష్టతను కొనసాగిస్తోంది. ఉగ్ర జాబితాలో చేర్చే విషయంలో ఐక్యరాజ్య సమితిలో మనకు అడ్డంపడుతోంది.ఢిల్లీ కూడా రెండు మార్గాల వైఖరిని కనబరుస్తోందని బీజింగ్ భావిస్తోంది. ‘క్వాడ్’ (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా)తో సంబంధాలు బలపరచుకోవాలని చూస్తోంది.
భారత్‌లో చైనాసంస్థల పెట్టుబడుల విషయంలో సవాలక్ష నిబంధనలనుముందుకు తెస్తోంది. భారత్ ఇలా సంశయించడానికి ఆర్థికఅంశాలు కారణమవుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధాని అయినపుడు 2003–04లో భారత్–చైనా వాణిజ్య లోటు కేవలం 1.1 బిలియన్ డాలర్లు. మొత్తం వాణిజ్యం 14 బిలియన్ డాలర్లకన్నా తక్కువే. చైనా 2008 నాటికి భారత్‌కు పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారుగా 38 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అది 2023–24 నాటికి 118.4 బిలియన్ డాలర్లను మించిపోయింది. 2024–25 నాటికి 127.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
చైనాతో వాణిజ్యం మాదిరిగానే దాని నుంచి దిగుమతులు కూడా మనకు ఎక్కువ అవుతున్నాయి. ఈ వాణిజ్య లోటు 2003–04లో 1 బిలియన్ డాలర్లుగా ఉండేది. అది 2023–24 నాటికి 85.07 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 17% పెరుగుదలను కనబరుస్తూ 2024–25లో 99.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశపు మొత్తం వాణిజ్య అసమతుల్యతలో చైనా వాటాయే ఇపుడు 35%. చైనా నుంచి మరో పెద్ద అలను తట్టుకోగల స్థితిలో భారత్ లేదు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 245% ఉన్నాయి. దాంతో చైనా వస్తువులు మన దేశంలోకి మరింతగా వచ్చిపడే ప్రమాదం ఉంది. పైగా, అమెరికాతో వాణిజ్యాన్ని పెంపొందించుకుని, దాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ఢిల్లీ–వాషింగ్టన్ మధ్య చర్చలు సాగుతున్నాయి.
భారత్ ఆత్మరక్షణ ధోరణిలో ఉంది. కనుక, ఎంతో యుక్తిని ప్రదర్శించవలసి ఉంటుంది. షాంఘై సంస్థలో సరిహద్దు, భద్రతా సమస్యలను లేవనెత్తాలి. ప్రపంచ బడుగు దేశాల వేదికగా ‘బ్రిక్స్’ను సజీవంగా ఉంచాలి. అదే సమయంలో, ఆర్థిక సంబంధాలు తెగి పోకుండా చూసుకోవాలి. ట్రంప్ 2026లో సృష్టించిన సంక్షోభం భారత్–చైనాలను ఎడమొహం పెడమొహం కాకుండా చేస్తోంది. అందుకనే, భారత్–చైనా ముంగిట ‘చారిత్రక అవకాశం’ ఉందని డోభాల్ వ్యాఖ్యానించారు.
ఇతర విషయాల్లో ప్రగతిని సాధించే ముందు ‘సరిహద్దు సమస్యను సరైన విధంగా పరిష్కరించుకునేందుకు’ భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యి కూడా గత ఏడాదిగా రెండు పక్షాలు ‘క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపేందుకు కృషి చేశాయి. మంచి ప్రగతిని కనబరి చాయి’ అని వ్యాఖ్యానించారు. ప్రగతిని కనబరిచాయి అన్నారేగానీ, పురోగతి అనే పదాన్ని ఉపయోగించలేదు. సంపూర్ణ నమ్మకం లేక పోవడం వల్లనే పదాలను ఆచితూచి ప్రయోగిస్తున్నారు.
రెండు దేశాలు ఘర్షణను కోరుకోవడం లేదు. గొప్పగా బేర సారాలు సాగించాలనే కోరిక ఇరువైపులా లేదు. పోటీని కొనసా గిస్తూ రావడమే ప్రస్తుతానికి చేయగలిగిన పని. రక్షణను చూసుకుంటూనే మిగిలిన పనులను చక్కబెట్టుకోవడం. ఇదీ భారత్–చైనా మధ్య సంబంధాల ప్రస్తుత స్థితి. రెండూ పరస్పర మిత్రదేశాలు కాదు. శత్రువులూ కాదు. ఒకరిని చూసి ఒకరు శాశ్వతంగా జంకే శక్తిమంతమైన దేశాలు. తదుపరి సంక్షోభం సంభవించకుండా నివారించడానికి చర్చలు జరుపుతూ ఉంటాయి.
-వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు;‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్’
-సి. ఉదయ్ భాస్కర్


