విషపూరిత ఆహారానికి విరుగుడేది? | Sakshi Guest Column On Food Adulteration | Sakshi
Sakshi News home page

విషపూరిత ఆహారానికి విరుగుడేది?

Aug 27 2026 12:29 AM | Updated on Aug 27 2026 12:29 AM

Sakshi Guest Column On Food Adulteration

విశ్లేషణ

2026 ఆగస్టు 11న లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఒక లెక్క చెప్పింది: 2023 నుండి 2026 మధ్య దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సేకరించిన 70,652 పండ్లు, కూరగాయల నమూనా లను పరీక్షించారు. వాటిలో 2,223 నమూనాల్లో, అంటే 3.15 శాతంలో పురుగుమందుల అవశేషాలు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్ణయించిన గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్‌ఎల్‌– మ్యాగ్జిమమ్‌ రెసిడ్యూ లిమిట్‌) కంటే ఎక్కువగా కనిపించాయి. జాతీయ సగటుగా చూస్తే ఇది చిన్న సంఖ్యే. కానీ తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి వేరు.

తెలుగు రాష్ట్రాలు ఆందోళనకరం
తెలంగాణలో 8,198 నమూనాల్లో 486 నమూనాలు, అంటే 5.93 శాతం (జాతీయ స్థాయిలో మూడో స్థానం) పరిమితి దాటాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2,104 నమూనాల్లో 134, అంటే 6.37 శాతం (జాతీయ స్థాయిలో రెండో స్థానం) పరిమితి దాటాయి. రెండూ దేశ సగటు కంటే దాదాపు రెట్టింపు. మరో విధంగా చెప్పాలంటే, దేశంలో పరిమితి దాటిన మొత్తం నమూనాల్లో దాదాపు 28 శాతం ఈ రెండు రాష్ట్రాల నుండే వచ్చాయి. కానీ పరీక్షించిన మొత్తం నమూనాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 15 శాతమే. 2004–2010 మధ్యలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సగానికి పైగా తగ్గిన పురుగు మందుల వినియోగం అ తర్వాత విపరీతంగా పెరిగింది అని అర్థం అవుతోంది. వినియోగంతో పాటు అవశేషాలు కూడా పెరుగుతున్నాయి. మోతాదుకి మించి అవశేషాలు ఉండ టాన్ని వినియోగదారులుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి?  

ఎంఆర్‌ఎల్‌ అంటే ‘సురక్షితం – అసురక్షితం’ అనే గీత కాదు. ఇక్కడో ముఖ్యమైన అపార్థం ఉంది. ఎంఆర్‌ఎల్‌ అనేది ఆరోగ్య కోణంలో ‘ఇంతకు మించితే విషం’ అనే గీత కాదు. సిఫారసు చేసిన పంటపై, సిఫారసు చేసిన మోతాదులో, సిఫారసు చేసినన్నిసార్లు మాత్రమే పిచికారీ చేసి, కోతకు ముందు నిర్ణీత విరామం పాటించి నప్పుడు పంటలో మిగిలే గరిష్ఠ అవశేషం అది. అంటే అది ముఖ్యంగా ‘మందును సరిగ్గా వాడారా?’ అని చెప్పే కొలమానం. అయితే ఇక్కడ రెండు ‘నిజాలను’ గుర్తించాలి. 1. ఎంఆర్‌ఎల్‌ దాటిందంటే ఆ కూరగాయ తినగానే హాని జరుగుతుందని కాదు. ఈ పరిమితులను చాలా కింది స్థాయిలో పెడతారు. 2. ఎంఆర్‌ఎల్‌ లోపల ఉందంటే సురక్షితమని కూడా కాదు.
పంట వేరు, భోజనం వేరు ప్రయోగశాల టమాటాను విడిగా, మిర్చిని విడిగా పరీక్షిస్తుంది. కానీ ఇంట్లో మనిషి టమాటా, మిర్చి, ఆకుకూర, బియ్యం, పప్పు, పండ్లు– అన్నీ కలిపి తింటాడు. ప్రతీ పదార్థం దాని సొంత ఎంఆర్‌ఎల్‌ లోపలే ఉండవచ్చు. కానీ ఒకే మందు నాలుగైదు పదార్థాల ద్వారా శరీరంలోకి వెళ్ళవచ్చు. 

ప్రపంచంలో ఇందుకోసం రెండు కొలమానాలు ఉన్నాయి. మొదటిది ఏడీఐ (యాక్సెప్టబుల్‌ డెయిలీ ఇన్‌టేక్‌)– కిలో శరీర బరు వుకు, రోజుకు, జీవితాంతం తీసుకున్నా ఇబ్బంది లేని మోతాదు. రెండోది ఏఆర్‌ఎఫ్‌డీ (అక్యూట్‌ రిఫరెన్స్‌ డోస్‌)– ఒక్క పూటలో లేదా ఒక్క రోజులో తీసుకోదగిన మోతాదు. రెండూ శరీర బరువుకు అనుగుణంగా లెక్కగట్టేవి. అందుకే అదే కూర 60 కిలోల బరువున్న పెద్దవాడికంటే 15 కిలోల పిల్లవాడికి ఎక్కువ ప్రమాదం అవుతుంది. ఒకే నమూనాలో రెండు, మూడు, నాలుగు రకాల మందుల అవశేషాలు కనిపించడం అసాధారణం కాదు. ప్రతీ మందూ దాని సొంత పరిమితి లోపలే ఉండవచ్చు. కానీ ఒకే రకమైన ప్రభావం చూపే మందులు కలిసినప్పుడు మొత్తం ప్రభావం ఎంత అనేది వేరే ప్రశ్న. యూరప్‌ ఆహార భద్రతా సంస్థ (ఈఎఫ్‌ఎస్‌ఏ) ఈ దిశగా పని మొదలుపెట్టింది. మనం కనీసం ఏ నమూనాలో ఎన్ని మందులు కలిసి ఉన్నాయో నమోదు చేసి, ప్రచురించడం నుండి మొదలుపెట్టాలి.

ఎంఆర్‌ఎల్‌ దాటడం అనేది కేవలం ప్రయోగశాల ఫలితం కాదు– అది పొలంలో జరిగిన దాని సంకేతం. కారణాలు రైతులకు కొత్తవేమీ కాదు: ఆ పంటకు అనుమతి లేని మందు వాడకం,లేబుల్‌ కంటే ఎక్కువ మోతాదు, అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ పిచికారీ, మూడు నాలుగు మందుల అనవసర మిశ్రమాలు, పురుగు కనిపించకపోయినా క్యాలెండర్‌ ప్రకారం పిచికారీ, పంట కోత విరామం పాటించకపోవడం, పిచికారీ చేసిన వెంటనే కోయడం. మిర్చి, టమాటా, బెండ, వంకాయ, ద్రాక్ష– తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగేవి, ఎక్కువ పిచికారీలు అవసరమయ్యేవి. అయితే గణాంకాల నుండి కారణం ఏదని నేరుగా చెప్పలేం. అది పొలాల్లో విచారణ చేసినప్పుడే తెలుస్తుంది.

ఒక సంగతి: ఈ పట్టికను రాష్ట్రాల ర్యాంకింగ్‌గా చదవకూడదు. ఛత్తీస్‌గఢ్‌లో పరీక్షించినవి 29 నమూనాలే; ఒక్కటీ పరిమితి దాట లేదు. అయినా అక్కడ సమస్య లేదని అర్థం కాదు. ఎక్కడ సేకరించారు, ఏ పంటలు, ఏ కాలంలో, ఎన్ని మందుల కోసం చూశారు– ఇవన్నీ సంఖ్యను మార్చేస్తాయి.

కూరగాయలు మానేయకండి!
చివరగా ఒక ముఖ్యమైన మాట: ఈ కథనం చదివి కూర గాయలు, పండ్లు తినడం తగ్గించవద్దు. ఐసీఎంఆర్‌– జాతీయ పోషకాహార సంస్థ రోజుకు 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు తినాలని సిఫారసు చేస్తోంది. మనం అంతకంటే చాలా తక్కువ తింటున్నాం. కూరగాయలు తక్కువ తినడం వల్ల కలిగే గుండె, మధుమేహ, క్యాన్సర్‌ ముప్పు... అవశేషాల ముప్పు కంటే చాలా పెద్దది. కడగడం, తొక్క తీయడం, వండటం వంటివి అవశేషాలను గణనీయంగా తగ్గిస్తాయి. కానీ మొత్తం బాధ్యతను వినియోగ దారుడిపై నెట్టడం సరైనది కాదు. అవశేషం పుట్టేది ఇంట్లో కాదు, పొలంలో. అందుకే పరిష్కారం అక్కడే జరగాలి. పురుగుమందుల అవసరం తగ్గించడమే సమస్యకు అసలైన పరిష్కారం. ఎర పంటలు వేయడం, ఫెరమోన్‌ ట్రాప్‌లు పెట్టడం, మిత్రపురుగుల పరిరక్షణ, పంట వైవిధ్యం, ఆర్థిక నష్టస్థాయి దాటినప్పుడే చర్య తీసుకోవడం, రైతు క్షేత్ర పాఠశాలల ఏర్పాటు వంటివి అవసరం. తెలుగు రాష్ట్రాలకు ఈ అనుభవం ఇప్పటికే ఉంది.

డా‘‘ జి.వి.రామాంజనేయులు
వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,
‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement