రాష్ట్రంలో 2.77 లక్షల టన్నుల యూరియా నిల్వలు
22 జిల్లాల్లో ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ అమలు
యూరియాపై ఆందోళన వద్దంటున్న వ్యవసాయ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, సమాన పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్‌ను రాష్ట్రంలో దశలవారీగా అమలు చేస్తు న్న ప్రభుత్వం.. ఎరువుల వినియోగంపై రైతులను అప్రమ త్తం చేస్తోంది. రైతులకు ఎరువులు అందించేందుకు గత సంవత్సరం రబీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ యాప్ ను రూపొందించి అమలు చేసింది.
అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండడంతో తదనుగుణంగా అడుగు లు వేస్తోంది. తొలుత రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానాన్ని ఆగస్టు 6 నుంచి మరో 10 జిల్లాలకు, ఆగస్టు 21 నుంచి మరో 10 జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన 10 జిల్లాల్లో ఈ నెలాఖరులోగా అమలు చేయనున్నారు.
42.34 లక్షల బస్తాలకు బుకింగ్
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఇప్పటివరకు 10.17 లక్షల క్యూఆర్ కోడ్‌లు జనరేట్ కాగా, 42.34 లక్షల ఎరువుల బస్తాలు బుక్ అయ్యాయి. ఇందులో 28.39 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ అమలు కాని జిల్లాల్లో రాష్ట్ర యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 33.37 లక్షల మంది రైతులు 137.63 లక్షల యూరి యా బస్తాలను బుక్ చేసుకోగా, 123.93 లక్షల బస్తాలను కొనుగోలు చేశారు.
అయితే ఎఫ్‌ఎఫ్‌ఎస్ అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు తెలిపారు. కొందరు డీలర్ల వద్ద ఉన్న నిల్వకు మించి బుకింగ్‌లు నమోదవడం, కొన్ని గ్రామాలు, భూముల వివరాలు యాప్‌లో కనిపించకపోవడం, బుకింగ్ ప్రక్రియలో ఇతర సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, సాంకేతిక బృందాలు సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాయని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి తెలిపారు.
2.77 లక్షల టన్నుల యూరియా నిల్వ
గత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో 9.79 లక్షల టన్నుల యూరియా వినియోగం కాగా, ప్రస్తుత వానాకాలంలో ఇప్పటివరకు 6.75 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2.77 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది. సెప్టెంబర్ నెలకు కేటాయించిన అదనపు సరఫరా కూడా రాష్ట్రానికి రానుంది. గత ఏడాది ఇదే సమయానికి 0.32 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 2.77 లక్షల టన్నులు ఉన్నాయి.
రైతులు అవసరానికి మించి ముందస్తుగా ఎరువులను బుక్ చేసుకోవడం, కొనుగోళ్ల కోసం తొందరపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఎరువుల లభ్యత, సరఫరా, రవాణా, పంపిణీని వ్యవసాయశాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రతి నిజమైన సాగుదారుడికి అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి.గోపి తెలిపారు.


