ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డు లేని వారి నుంచి నామమాత్రపు ఫీజులు
నిమ్స్‌లోని టారిఫ్‌నే అమలు చేయాలని నిర్ణయం
ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ ద్వారా ఆర్థిక లావాదేవీల నిర్వహణ
మంత్రి దామోదర అధ్యక్షతన టిమ్స్ తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం
సిబ్బంది నియామకాలకు నిమ్స్ సర్వీస్ రూల్స్ అమలు
సాక్షి, హైదరాబాద్ /వెంగళరావునగర్ : డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్)లో నిమ్స్ తరహా టారిఫ్ విధానం అమలు కానుంది. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు లేని రోగులకు నిమ్స్‌లో వసూలు చేసినట్టే నామమాత్రపు ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గుండె సంబంధమైన వ్యాధుల కోసం ఏర్పాటైన తొలి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కావడంతో రోగుల నియంత్రణ, ఆస్పత్రి నిర్వహణ, నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని టిమ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం నిర్ణయించింది. మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిమ్స్‌లో అమల్లో ఉన్న టారిఫ్‌లను టిమ్స్‌లోనూ అమలు చేసే కీలక నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీనివల్ల రెండు ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్యసేవల చార్జీల్లో ఏకరూపత వస్తుందని, మెరుగైన ఆర్థిక ప్రణాళికకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం టిమ్స్‌కు రోజూ సగటున 600 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని సంస్థ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ మంత్రికి వివరించారు. వారికి అవసరమైన వైద్య సేవలతోపాటు డే కేర్ విధానంలో చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు.
సర్వీస్ రూల్స్ కూడా నిమ్స్‌వే
ఎంసీఆర్ టిమ్స్‌లో డాక్టర్లు, సిబ్బంది నియామకాల కోసం నిమ్స్ సర్వీస్ రూల్స్‌ను అనుసరించడంతోపాటు, నిమ్స్‌లో అమలులో ఉన్న టారిఫ్‌లను టిమ్స్‌లో కూడా అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. టిమ్స్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ (టీఆర్‌ఏ) ద్వారా నిర్వహించేందుకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను సమన్వయం చేయడానికి కూడా అనుమతి ఇచ్చింది.
మల్టీలెవల్ పార్కింగ్..పీజీ హాస్టళ్లు
రోగులు, వైద్యులు, సిబ్బందికి మౌలిక వసతులను మెరుగుపరిచే పలు ప్రతిపాదనలకు కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. ఆస్పత్రిలో పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం, రోగుల సహాయకుల కోసం అదనపు టాయిలెట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నిమ్స్ తరహాలో టిమ్స్‌లో పీజీ కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో పీజీ విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణ ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. టిమ్స్‌ను అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి రాజనర్సింహ తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్, వైద్య విద్య సంచాలకురాలు డాక్టర్ వాణి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్‌నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పాల్గొన్నారు.


