ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టమైన విధానం రూపొందించాలి: సీఎం రేవంత్
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్,అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టత ఇవ్వాలి
మూసీ ప్రాజెక్టు ఫేజ్–2కు త్వరగా టెండర్లు పిలవాలి
సమీక్షలో అధికారులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మూసీ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో భూసేకరణ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ విధానం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. వీటిపై స్పష్టమైన విధానం రూపొందించాలని, భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్–2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లభించే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. భూసేకరణలో భాగమైన టీడీఆర్ అంశంపై ప్రతి వారం సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం సూచించారు.
కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్కుకు విస్తృత ప్రచారం కల్పించి సందర్శకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు 55 కిలోమీటర్ల కారిడార్‌ను పునరుద్ధరించే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్టు ఎంఆర్‌డీసీఎల్ అధికారులు తెలిపారు. మూసీ పరిధిలోని ఎంఎఫ్‌ఎల్/బఫర్ జోన్లలో భూములను స్వచ్ఛందంగా అప్పగించే వారికి టీడీఆర్ అందించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మూసీ ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించి కొందరు యజమానులు టీడీఆర్‌కు బదులుగా నగదు, ఇళ్లు లేదా ఓపెన్ ప్లాట్లు కోరుతున్నట్టు సమాచారం. భూముల స్వభావం, హక్కులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ హద్దులను స్పష్టంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్ న్యాయ వివాదాలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.


