సారంపల్లి... నీకు సలాములయ్యా | Communist Leader Sarampallis Body Donated to Gandhi Medical College | Sakshi
Sakshi News home page

సారంపల్లి... నీకు సలాములయ్యా

Aug 25 2026 9:38 PM | Updated on Aug 25 2026 9:40 PM

Communist Leader Sarampallis Body Donated to Gandhi Medical College
  • కమ్యూనిస్టు యోధుడు సారంపల్లి మల్లారెడ్డికి ఎర్రెర్రని వీడ్కోలు
  • కడసారి చూపు కోసం కదలొచ్చిన రైతాంగ నేతలు, అన్నదాతలు
  • వేలాది మందితో ఎంబీ భవన్‌ ‌నుంచి గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర
  • గాంధీ మెడికల్‌ ‌కాలేజీకి ఆయన పార్థీవ దేహం అప్పగింత

హైదరాబాద్‌:  ‘సారంపల్లి మల్లారెడ్డి నీకు సలాములయ్యా...మీ తరమెల్లిపోతుందయ్యా...మా చేయి పట్టి నడిపేదెవరయ్యా...మీలాంటి నేతలు మళ్లీ మళ్లీ పుట్టాలయ్యా... కార్మిక కర్షక రాజ్యం రావాలయ్యా... సమాసమాజ స్థాపన జరగాలయ్యా...’’ అంటూ కమ్యూనిస్టు యోధుడు సారంపల్లి మల్లారెడ్డికి రైతాంగం కన్నీటి వీడ్కోలు పలికింది. 

రైతాంగ ఉద్యమాల గురువు భావించే మల్లారెడ్డిని కడసారి చూసేందుకు హైదరాబాద్‌‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయానికి అన్నదాతలు, రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు  పెద్ద ఎత్తున కదలొచ్చారు. చివరి చూపు కోసం వచ్చిన ప్రతి ఒక్కరి కండ్లలోనూ ‘మొన్నటిదాకా నవ్వుతూ పలుకరించిన నేత.. మన కోసం ఇంతగా పోరాడిన మనిషి ఇక లేడా’ అని  ఆయన పార్థీవదేహంపై పుష్పాంజలి ఘటిస్తూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.  నవ్వుతూ మాట్లాడే ఆ విజ్ఞానఖని దేహం నిర్జీవంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయారు.

కన్నీటి చుక్కలు జాలువారాయి.  మాట్లాడేందుకు నోటిమాట రాక మౌనందాల్చారు.  కష్టకాలంలో అండగా నిలిచిన ఆ యోధునికి కడసారి చేతులెత్తి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.  ఆ పెద్ద మనిషికి వీడ్కోలు చెబుతూ బరువైన హృదయంతోనూ ప్రతీ గొంతూ నినదించింది.  తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మల్లారెడ్డి చివరి మజిలీ కూడా ఒక సందేశంగా మారింది. పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించడంతో మరణాన్నీ సమాజ సేవకే అంకితం చేసినట్టు అయింది.   మల్లారెడ్డి లేరనే నిజం ఎంత చేదైనా రైతుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్మరణీయమే..ఆచరణీయమే. ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రతి రైతులో, ఆయన మాటను గుర్తుచేసుకునే ప్రతి మనసులో, అన్నదాత హక్కుల కోసం ఎగిసే ప్రతి గొంతులో... సారంపల్లి మల్లారెడ్డి జీవించే ఉంటారు. రైతుల క్షేమం కోసం ఆయన రగిలించిన స్ఫూర్తి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలువనున్నది. 

ఏఐకేఎస్‌ ‌జాతీయ నేత, సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నేత సారంపల్లి మల్లారెడ్డి పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఆయన్ను కడసారి చూసేందుకు నిమ్స్‌ ‌నుంచి ఆయన మృతదేహం రాకముందే ఎంబీభవన్‌‌కు రైతులు, ప్రజలు, అభిమానులు, సన్నిహితులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌‌రోడ్డు మెట్రో స్టేషన్‌, నాబార్డు కార్యాలయం పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. 

గాంధీ మెడికల్‌ ‌కాలేజీకి సారంపల్లి భౌతిక కాయం అప్పగింత
మధ్యాహ్నం 12 గంటల తర్వాత సారంపల్లి మల్లారెడ్డి అంతిమ యాత్ర సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ ఆస్పత్రి వరకు కొనసాగింది. అందులో ఆయా జిల్లాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజానాట్యమండలికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు, డప్పు కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత గాంధీ మెడికల్‌ ‌కాలేజీ వరకు అంతిమ యాత్ర కొనసాగింది. అక్కడ గాంధీ మెడికల్‌ ‌కాలేజీ వైస్‌ ‌ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌, నాగమోహన్‌, ప్రొఫెసర్లు గౌరి, రమాదేవి సమక్షంలో మల్లారెడ్డి భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌, నాగమోహన్‌ ‌మాట్లాడుతూ..నలుగురికీ ఉపయోగపడాలనుకునే ఉన్నత భావాలున్నవాళ్లే ఇలాంటి మంచి పని చేస్తారనీ, వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం డెడ్‌‌బాడీని ఇవ్వడం గొప్ప విషయమని  కొనియాడారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement