సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమానికి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. వనమహోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా పండగలా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చినప్పటికీ, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు గైర్హాజరయ్యారు. కేవలం మంత్రి సీతక్క మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వరంగల్ జిల్లాలో నిర్వహించిన వనమహోత్సవంలో భాగంగా కొండా సురేఖ మొక్కలు నాటారు. ఆమె పిలుపు మేరకు మంత్రి సీతక్క వచ్చి మద్దతు తెలిపారు. అయితే, సీతక్క మినహా మిగతా మంత్రులందరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.
కొండా సురేఖకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వివాదం నడుస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలోనే మంత్రులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వనమహోత్సవంలో పాల్గొంటే సీఎంకు దూరంగా ఉన్నట్లు అవుతుందనే ఉద్దేశంతోనే మిగతా మంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది.


