సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది. ఈ రోజు (మంగళవారం) టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు ఆరు పేజీల నివేదికను అందించింది. నివేదికలో.. "కొండా సురేఖ పదే పదే తప్పులు చేస్తున్నారు. గతంలో కూడా కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుటుంబసభ్యులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. సురేఖపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం" అని తెలిపింది.
మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మల్లురవి భేటీ కానున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి నివేదికలోని అంశాలు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఏ నిర్ణయం తీసుకోనుందా అని ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ అంశంపై ఇదివరకే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను. తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిటీ సైతం మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది.
అసలు వివాదం ఏంటి?
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ అభ్యంతకరంగా మాట్లాడారు. 'సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేస్తున్నారు. ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’ అని ప్రశ్నించారు
ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్‌లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.
కొండా సురేఖ వివరణ
కాగా ఈ వివాదంపై ఇదివరకే కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు. అయినప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఆమెపై చర్యలకే సిపారసు చేసింది.
ఇదీ చదవండి:
ఒంటరైన మంత్రి కొండా సురేఖ


