తొలి లేడీ డిటెక్టివ్‌..! ఆఖరికి పెళ్లి గురించి కూడా... | The story of indias first lady detective rajani pandit | Sakshi
Sakshi News home page

తొలి లేడీ డిటెక్టివ్‌..! ఆఖరికి పెళ్లి గురించి కూడా...

Aug 3 2026 1:22 PM | Updated on Aug 3 2026 1:26 PM

The story of indias first lady detective rajani pandit

మనం టీవీల్లో, సినిమాల్లో.. ట్రెంచ్‌కోట్‌ ధరించి, ఆధారాలను వెంబడిస్తూ..నేరస్థులను బయటపెట్టే డిటెక్టివ్‌లను చూశాం, ఆయా కథలు, నవలలు చదివాం. కానీ మహిళా డిటెక్టివ్‌ల గురించి వినడం గానీ, తెరపై చూడటం గానీ అత్యంత అరుదు. కానీ ఈమె సమస్యను బట్టి వేషం మారుస్తూ.. ఎన్ని కేసులు పరిష్కరించారో తెలిస్తే షాకవ్వుతారు. మహిళలు అత్యంత అరుదుగా వచ్చే ఈ వృత్తిలో కొనసాగుతూ.. నిలదొక్కుకోవడమే గాక మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక్కోసారి నిజాలను వెలికి తీసినా.. బయటకు చెప్పకుండా..కౌన్సలర్‌లుగా వ్యవహరిస్తుంటుంది కూడా. 

ఆ మహిళే..రజనీ పండిట్‌. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిశబ్దంగా తనపని తాను చూసుకుంటూ పోతూ..తన వృత్తిని నిర్మించుకున్నారామె. అలా ఆమె భారతదేశపు తొలి మహిళా ప్రైవేట్‌ డిటెక్టివ్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రమాదం అనేది ఆమె ఉద్యోగంలో అంతర్భాగం. రచయిత్రి నటి, రచయిత్రి ఛవి మిట్టల్‌తో ఒక పాడ్‌కాస్ట్‌లో రజనీ మాట్లాడుతూ..తన వృత్తి గురించి ఇలా చెప్పుకొచ్చారు. దాదాపు 40 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వేలాది కేసులను చేధించినట్లు తెలిపారు. అయితే తనను తాను స్వతాహాగా డిటెక్టివ్‌ అవ్వాలని ఎన్నడు అనుకోలేదని చెప్పుకొచ్చారామె. 

ఆ ఒక్క కేసు ఆమె జీవితాన్నే మార్చేసింది..
కాలేజీ రోజుల్లో, ఇంట్లో విలువైన వస్తువులు పదేపదే మాయమవుతుండటంతో ఒక క్లాస్‌మేట్ సహాయం కోసం ఆమె వద్దకు వచ్చింది. ఎప్పుడూ ఆసక్తిగా ఉంటూ, మనుషులను అర్థం చేసుకోవడంలో నేర్పరి అయిన రజనీ, స్వయంగా ఆ విషయాన్ని పరిశీలించి..చివరికి దొంగను గుర్తించింది. కేవలం ఒక సాధారణ ఆసక్తిగా మొదలైనది నెమ్మదిగా ఒక అసలైన వృత్తిగా మారింది. 

తాను 1986లో, కేవలం 24 ఏళ్ల వయసులో, సొంత ఏజెన్సీ ‘రజనీ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో’ను ప్రారంభించినట్లు తెలిపారు. దీన్నే తర్వాత ‘రజనీ పండిట్ డిటెక్టివ్ సర్వీసెస్’ అని పేరు మార్చారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే పనిజీవితం ప్రారంభమైందని అన్నారు. అందువల్లే పెళ్లి కూడా చేసుకోలేకపోయానని చెప్పారు. కనీసం కుదురుగా కూర్చోని టీవి కూడా చూడలేనని అన్నారామె. ఎందుకంటే పదే పదే ఫోన్‌ మోగుతూనే ఉంటుందని అన్నారు. 

కేసుకి అనుగుణంగా మారిపోతా..!
ఒక కేసు దర్యాప్తు కోసం తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలని అదే తన విజయాలకి ప్రధాన కారణమని తెలిపారు. ఇన్నేళ్లలో పనిమనిషిగా, వీధి వ్యాపారిగా, అంధురాలిగా, మానసిక అస్థిరత ఉన్న మహిళగా ఇలా ఎన్నో రకాలుగా నటించినట్లు వెల్లడించారు. తాను చేపట్టిన తొలి అత్యంత ప్రమాదకరమైన కేసులో ఒకటి..అనుమానితురాలి ఇంట్లో పనిమనిషిగా నిశసించడం అని చెప్పుకొచ్చారు. 

జంట హత్యల కేసును ఛేదించడానికి ఆరు నెలల పాటు పనిమనిషిగా మారువేషంలో ఉండి ఆధారాలు సేకరిస్తుండగా..ఒకరోజు కెమెరా క్లిక్‌ మనడంతో వెంటనే నిందితురాలు తనను అనుమానించడం మొదలు పెట్టిందన్నారు. తను అటాక్‌ చేసే లోపలే ఆధారాలన్నీ పక్కాగా సేకరించి ఆమెను కటకటాల వెనక్కి పంపినట్లు తెలిపారు. కొన్ని కేసులు పిల్లలు చెడు వ్యసనాలకు సంబంధించినవి, విచ్చినమైన సంబంధాలతో బాధపుడుతున్న కుటుంబాలు వంటి కేసులను కూడా చేధించారు. 

అలా ఆ క్రమంలో కౌన్సలర్లగా కూడా మారతామని అంటున్నారామె. అయితే వివాహేతర సంబంధాన్ని కోర్టులో నిరూపించడం చాలా కష్టమని చెప్పారు. అందుకే తాము టెడ్డీ బేర్‌లలో దాచిన స్పై కెమెరాలు, పెన్నులలో అమర్చిన రహస్య కెమెరాలు, బటన్ కెమెరాలు, బల్లల కింద అమర్చిన రహస్య మైక్రోఫోన్‌లపై ఆధారపడుతుంటామని చెప్పారు. 

విచిత్రంగా తాను కూడా నేరం నుంచి తప్పించుకోలేకపోయానన్నారు. ఎందుకంటే తన పుస్తకాన్ని తర ప్రమేయం లేకుండానే అక్రమంగా కాపీ చేసి మార్కెట్‌లో అమ్మారని రజనీ వెల్లడించారు. తన కేసుని పరిష్కరించే ప్రయత్నం చేస్తుండగా..బెదరింపులు కూడా వచ్చాయన్నారు. అయితే తాను న్యాయ మార్గాన్ని ఎంచుకుని గెలిచినట్లు తెలిపారు. 

ఏ నిజం బయటపెట్టాలో తెలియాలి..
రహస్యాలను వెలికి తీసే వృత్తే అయినప్పటికీ..ప్రతి నిజాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదని అంటోందామె. ఎందుకంటే ఆ నిజాన్ని బయటపెడితే కలిగే పరిణామాలపై అవగాహన ఉండాలని నొక్కి చెబుతోంది. ఈ వృత్తి కేవలం దొంగలను, నేరస్తులను పట్టుకోవడమే కాదు, మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడంపై పట్టు అందిస్తుందట. అందువల్ల కొన్ని కేసులు చేధించే క్రమంలో కుటుంబాలను కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని అన్నారు. 

ఇంతలా తిరుగులేని లేడి డిటెక్టివ్‌గా ఏకంగా 80 వేలకు పైగా కేసులను చేధించిన మీరు తెరపై మీ పాత్రరె పోషించగలరా అని ప్రశ్నించగా..వెంటనే ఆమె నవ్వుతూ..నటించొచ్చేమో కానీ, నిజ జీవితంలో డిటెక్టివ్‌గా మారడం అనేది అంత ఈజీ కాదు. అలాగే ఆయా కేసు భావోద్వేగ భారాన్ని మోయడం అంత సులభం కాదని కూడా అన్నారు. ఇవన్నీ పుస్తకాల నుంచో, సినిమాల నుంచో నేర్చుకునేవి కాదని అన్నారామె. చివరగా డిటెక్టివ్‌గా రాణించాలంటే చక్కటి ధైర్యం, సహనం, సత్యాన్ని కనుగొనే వరకు వదలని పట్టుదల చాలా అవసరమంటూ తన సంభాషణను ముగించారు.  

(చదవండి: ఐఐటీ స్టూడెంట్‌ కాదు.. కానీ ఏకంగా రూ..4.8 లక్షలు..! కనీసం బీటెక్‌ కూడా..)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement