భారత తొలి మహిళా డిటెక్టివ్‌ అరెస్టు

First Woman Private Detective of India Arrested - Sakshi

సాక్షి, ముంబై : భారత తొలి మహిళా ప్రైవేట్‌ డిటెక్టివ్‌ రజనీ పండిట్‌(54)ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మార్గాల ద్వారా కాల్‌ రికార్డింగ్స్‌ను టెలికాం కంపెనీల నుంచి రజనీ తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాల్‌ డిటెయిల్‌ రికార్డ్స్‌(సీడీఆర్‌)లను అక్రమ మార్గాల్లో సంపాదించి, అమ్ముతున్న నలుగురు డిటెక్టివ్‌ల గ్యాంగ్‌ను పోలీసులు గురువారం పట్టుకున్నారు.

వారిలో ఒకరైన సమ్రేష్‌ ఝా సీడీఆర్‌లను రజనీ తెమ్మన్నారని, అందుకు గానూ భారీ మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్పారని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో శుక్రవారం రజనీ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రజనీ తండ్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌ పని చేసి రిటైరయ్యారు.

ఐదుగురు వ్యక్తుల సీడీఆర్‌లు కావాలని సమ్రేష్‌ను రజనీ అడిగారనడానికి బలమైన సాక్ష్యాధారాలున్నాయని థాణే పోలీసు చీఫ్‌ పరంబీర్‌ సింగ్‌ చెప్పారు. రాకెట్‌లో ఆమె హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించారు. సీడీఆర్‌ల స్కాంతో సంబంధం ఉన్న వ్యక్తులు దేశంలో ఎక్కడవున్నా పట్టుకొని తీరుతామని చెప్పారు. నవీ ముంబైలోని కేంద్రంగా పని చేస్తున్న సంతోష్‌ పండ్‌గాలే(34), ప్రశాంత్‌ సోనావానే(34)లను కూడా అరెస్టు చేసినట్లు వివరించారు.

రజనీ పండిట్‌ నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు తెలిపారు. మరికొందరు డిటెక్టివ్‌లను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పేరు తెలపడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top