గల్ఫ్‌ దేశాలను వీడండి.. అమెరికా పౌరులకు ట్రంప్‌ అత్యవసర హెచ్చరిక | US warns its citizens in Middle East Prepare to leave Gulf | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాలను వీడండి.. అమెరికా పౌరులకు ట్రంప్‌ అత్యవసర హెచ్చరిక

Aug 2 2026 7:53 AM | Updated on Aug 2 2026 7:54 AM

US warns its citizens in Middle East Prepare to leave Gulf

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌, అమెరికా వరుస దాడులు తీవ్రతరమయ్యాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. భద్రతా ముప్పులు పెరుగుతున్నందున వీలైతే మధ్యప్రాచ్య దేశాలను విడిచి వెళ్లాలని, లేకపోతే ఎప్పుడైనా అత్యవసరంగా బయలుదేరాల్సిన పరిస్థితి రావచ్చని ముందస్తుగా సిద్ధంగా ఉండాలని సూచించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. గగనతల మూసివేతలు, విమాన సర్వీసుల రద్దు, ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచించింది. మధ్యప్రాచ్యానికి వెళ్లే ప్రయాణాలను కూడా పునరాలోచించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. అంతకుముందు చేసిన సూచనల కంటే తాజా సూచన మరింత కఠినంగా ఉండటం గమనార్హం.

ఇక, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అవసరమైతే ఇరాన్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, అమెరికా దాడులకు తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్‌కు చెందిన డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని కువైట్ సైన్యం వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం ప్రకటించడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘర్షణలు మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండగా, ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు.. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే దానికి ‘నిర్ణయాత్మక, తీవ్రమైన ప్రతిస్పందన’ ఇస్తామని హెచ్చరించారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇజ్రాయెల్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులకు తమ భూభాగాన్ని లేదా సౌకర్యాలను ఉపయోగించేందుకు ఏ దేశం అనుమతించవద్దని ప్రాంతీయ దేశాలకు ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, అమెరికా హెచ్చరికలు ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలని ఇరాన్ విమర్శించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రాంతీయ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement