ఇంతకీ ఖమేనీ ఎక్కడ?.. ఆ రహస్యం ఇదేనా? | CIA And Mossad Hunt For Mojtaba Khamenei | Sakshi
Sakshi News home page

ఇంతకీ ఖమేనీ ఎక్కడ?.. ఆ రహస్యం ఇదేనా?

Aug 1 2026 8:07 PM | Updated on Aug 1 2026 9:18 PM

CIA And Mossad Hunt For Mojtaba Khamenei

ప్రపంచంలోనే దిగ్గజ నిఘా సంస్థలు ఏవని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఠక్కున వచ్చే సమాధానాలు.. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్.. అమెరికాకు చెందిన సీఐఏ..! తమ శత్రువు ప్రపంచంలోని ఏ మూలన దాక్కొన్నా.. లేపేస్తామనే ధీమా ఈ రెండు సంస్థలకు ఉంది. అయితే.. మధ్యప్రాశ్చ్యంలో ఇప్పుడు ఈ రెండు సంస్థల విషయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏకు మేకై కూర్చున్నాడు. ఈ రెండు నిఘా సంస్థల టెక్నాలజీకి దొరకకుండా జాగ్రత్తపడుతున్న ఖమేనీ.. ఇప్పుడు అటు ట్రంప్.. ఇటు నెతన్యాహుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ ఖమేనీ ఎక్కడున్నాడు? ఆయన విషయంలో మొస్సాద్, సీఐఏ ఎందుకు విఫలమవుతున్నాయి?

కంటిమీద కునుకు లేకుండా..
అది 2020 నవంబరు 27వ తేదీ.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఇరాన్ అణు సాంకేతికతకు పెద్దదిక్కుగా ఉన్న మోహాసేన్ ఫాఖ్రిజాదేహ్ (Mohsen Fakhrizadeh) కారులో ప్రయాణిస్తున్నారు. మొస్సాద్, సీఐఏ నిఘా సంస్థల టార్గెట్‌గా ఆయన ఉన్నారు. ఆ కారుపై దాడికి ఈ సంస్థలు ఒక్క ఏజెంట్‌ని కూడా నియమించలేదు. కానీ, ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆయనను గుర్తించి.. ఏఐ ఆధారిత మెషీన్ గన్ సాయంతో అత్యంత కచ్చితత్వంతో అతణ్ని మట్టుబెట్టాయి. హాలీవుడ్ చిత్రాలను తలపించిన ఈ డిజిటల్ ఆపరేషన్‌తో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అత్యాధునిక శాటిలైట్లు, ప్రపంచంలోనే నంబర్ వన్ హ్యాకర్లతో ఇజ్రాయెల్, అమెరికాలు అతణ్ని అంతమొందించాయి. అంతటి టెక్నాలజీ ఉన్నా.. ఖమేనీ జాడను కనిపెట్టలేకపోవడం ఇప్పుడు ఈ రెండు నిఘా సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

చిన్న ఫోన్‌ కాల్ మాట్లాడినా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ అప్పట్లోనే ఓ భారీ ప్రకటన చేసింది. తమ తదుపరి టార్గెట్ కొత్తగా నియమితులయ్యే సుప్రీం లీడరేనన్నది అందులోని సారాంశం. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా చీఫ్‌లను, గాజా కేంద్రంగా ఉన్న హమాస్ నేతలను లేపేసిన విధానాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్ అయ్యారు.

అయితే.. ఆయనను ఇంతవరకు ఎవరూ బహిరంగంగా చూడలేదు. చివరికి ఇటీవల జరిగిన ఆయన తండ్రి ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు సైతం మొజ్తబా హాజరుకాలేదు. దీంతో.. ఆయనను ట్రేస్ చేయడంలో మొస్సాద్, సీఐఏ చతికిలపడిపోతున్నాయి. ముఖ్యంగా.. మొజ్తబా ఇప్పుడు జీరో డిజిటల్ పాలసీని అందిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఎలాంటి డిజిటల్ గాడ్జెట్స్‌ను తన దరిచేరనీయకుండా ఆయన జాగ్రత్తపడుతున్నారు. చిన్న ఫోన్‌కాల్ మాట్లాడినా.. తనను మొస్సాద్ గుర్తింస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే.. ఆయన డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

మొజ్తబా.. అదే ఫాలో అవుతున్నారా?
ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒకప్పుడు అమెరికాను గడగడలాడించిన అల్-ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ అవలంబించిన మోడల్‌ను మొజ్తబా ఫాలో అవుతున్నారు. లాడెన్ చేసిన పొరపాట్లు తన విషయంలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి పాకిస్థాన్‌లో తలదాచుకున్న లాడెన్‌ను చేరడానికి.. అతని కమ్యూనికేటర్లను సీఐఏ ట్రాక్ చేసింది. మొజ్తబా విషయానికి వస్తే.. ఆయన కమ్యూనికేటర్లు.. అంటే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు ఎవరనే విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కేవలం మొజ్తబా రాసి ఇచ్చే చిన్నచిన్న చీటీలు మాత్రమే అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి.

మొజ్తబా ఎక్కడ? 
ఇంతకీ మొజ్తబా ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడిలో మొజ్తబా భవనం ధ్వంసమైంది. ఆయన భార్య ఈ దాడిలో మరణించినట్లు వార్తలొచ్చాయి. తీవ్రంగా గాయపడిన మొజ్తబా ప్రస్తుతం ఓ బంకర్‌లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇక రెండో వాదన విషయానికి వస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తననుతాను కాపాడుకునేందుకు మొజ్తబా తనకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం రష్యాలోని ఓ బంకర్‌లో తలదాచుకుంటున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం మొజ్తబా తెరవెనకే ఉంటూ.. ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దేశ రక్షణ, విదేశీ విధానాల వంటి కీలక నిర్ణయాలను ఐఆర్‌జీసీ కమాండర్లు నిర్వర్తిస్తున్నారు.

ఇరాన్ మైండ్‌గేమ్ ఆడుతోందా?
ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చినా.. అంతరిక్షం నుంచి భూగాళాన్నే జల్లెడ పట్టేలా శాటిలైట్లు ఉన్నా.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా మాత్రం పాతకాలపు రహస్య పద్ధతులకు జైకొట్టారు. అందుకే.. మొస్సాద్, సీఐఏలకు షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు. అయితే.. మొజ్తబా నిజంగానే బంకర్లలో తలదాచుకుంటున్నారా? లేక ఇరాన్ ఆయన పేరుతో మైండ్‌గేమ్ ఆడుతోందా? అనేది ఆసక్తికరంగా మారింది.
-హెచ్‌.కమలాపతిరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement