ఒక పర్వతం.. దాని లోపల అంతుచిక్కని సొరంగాలు.. ప్రపంచ శక్తుల కళ్లన్నీ దానిపైనే. ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత రహస్యంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ఇందుకు కారణం.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వరుస హెచ్చరికలు. ‘ఆ ప్రాంతాన్ని త్వరలోనే.. చాలా తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంటాం’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో కొత్త ఉద్రిక్తతలకు తెరతీశాయి. ఇప్పటికే ఇరాన్‌లోని కొన్ని అణు కేంద్రాలపై దాడులు జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడు అమెరికా చూపు పికాక్స్ మౌంటెన్‌పై పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పర్వతం లోపల ఏముంది?
ఇరాన్‌లోని నటాంజ్ అణు సముదాయానికి దక్షిణంగా ఉన్న ఈ పర్వత ప్రాంతం బయటికి చూస్తే సాధారణ కొండలా కనిపిస్తుంది. కానీ దాని లోపల భారీ భూగర్భ నిర్మాణం ఉందని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ‘కుహ్-ఎ కొలాంగ్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఆంగ్లంలో పికాక్స్ మౌంటెన్ అనే పేరు వచ్చింది. పికాక్స్ అంటే కొండను తవ్వే పనిముట్టు. పేరు మాదిరిగానే ఈ ప్రాంతం లోపల భారీ సొరంగ వ్యవస్థ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉపగ్రహ చిత్రాల్లో ఈ ప్రాంతంలో నాలుగు సొరంగ ప్రవేశ మార్గాలు కనిపిస్తున్నాయి. రెండు తూర్పు వైపు, మరో రెండు పడమర వైపు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలి చిత్రాల్లో అక్కడ నిర్మాణ వాహనాలు, కొత్త రహదారి పనులు, సొరంగాల వద్ద కదలికలు కనిపించడం అనుమానాలను పెంచింది.
అణు కేంద్రానికి ప్రత్యామ్నాయమా?
2020లో నటాంజ్ అణు కేంద్రంలో జరిగిన అనుమానాస్పద విధ్వంసం తర్వాత.. మరింత సురక్షితమైన, ఆధునిక భూగర్భ కేంద్రాన్ని నిర్మిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఆ కేంద్రం పికాక్స్ మౌంటెన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. సెంట్రిఫ్యూజ్‌లు యురేనియం శుద్ధికి ఉపయోగపడతాయి. తక్కువ స్థాయి శుద్ధితో అణు విద్యుత్ అవసరాలకు ఉపయోగించే యురేనియం తయారు చేయవచ్చు. అయితే అత్యధిక స్థాయి శుద్ధి చేస్తే అణ్వాయుధాల తయారీలోనూ ఉపయోగించే అవకాశం ఉంటుంది.
Iran : ( Video ) Israeli Channel 14 explains what Pickaxe Mountain is and what it has become . Iran's most strategic asset in its necular program. 👇 pic.twitter.com/TipMFrNOM9
— Kbar57 (@kbar57) July 30, 2026
ట్రంప్ ఎందుకు గురి పెట్టారు?
పికాక్స్ మౌంటెన్‌లో అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉండవచ్చని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే అమెరికా ఆందోళనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. జూలై 21న ట్రంప్ మాట్లాడుతూ.. “ఆ ప్రాంతాన్ని త్వరలోనే భారీగా దెబ్బతీస్తాం” అని వ్యాఖ్యానించారు. తర్వాత కూడా ఒప్పందం కుదరకపోతే పికాక్స్ మౌంటెన్‌ను లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అక్కడ ఎలాంటి అణు కార్యకలాపాలు జరగడం లేదని చెబుతోంది. అమెరికా బెదిరింపులు దాడికి సాకులు మాత్రమేనని విమర్శిస్తోంది.
అమెరికా బాంబులతోనైనా కూలుతుందా?
పికాక్స్ మౌంటెన్‌కు ఉన్న అతిపెద్ద రక్షణ.. దాని లోతు. ఈ కేంద్రం భూమికి దాదాపు 100 మీటర్ల లోపల ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో GBU-57 బంకర్ బస్టర్ బాంబులు ఒకటి. ఇవి భారీగా రక్షణ కలిగిన నిర్మాణాలను ఛేదించేందుకు రూపొందించబడ్డాయి. అయితే ఇంత లోతులో ఉన్న పికాక్స్ మౌంటెన్‌ను పూర్తిగా ధ్వంసం చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. లోపలి నిర్మాణం ఎలా ఉందో స్పష్టంగా తెలియకపోవడం కూడా మరో సమస్య. కేంద్రంలోని సొరంగ మార్గాలు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సరఫరా మార్గాలను దెబ్బతీయడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అంచనాల ప్రకారం.. 2025లో ఇరాన్ వద్ద దాదాపు 440 కిలోల (970 పౌండ్ల) 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల్లో కొంత భాగం లేదా మొత్తం పికాక్స్ మౌంటెన్ భూగర్భ కేంద్రంలో ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అంతేకాదు.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత నటాంజ్, ఫోర్డో అణు కేంద్రాల్లో దెబ్బతినకుండా మిగిలిన కొన్ని అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను కూడా పికాక్స్ మౌంటెన్‌కు తరలించి ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒక పర్వతం.. రెండు దేశాల పోరు
పికాక్స్ మౌంటెన్ ఇప్పుడు కేవలం ఓ అణు కేంద్రం అనుమానంతో ఉన్న ప్రాంతం మాత్రమే కాదు.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతీకగా మారింది. ఒకవైపు అమెరికా “అణు బెదిరింపును అడ్డుకోవాలి” అంటోంది. మరోవైపు ఇరాన్ “దాడికి ప్రతీకారం తప్పదు” అని హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భూమి లోపల దాగిన ఈ రహస్య కేంద్రంపై నిజంగా బాంబులు పడతాయా? లేక ఇది కేవలం ఒత్తిడి వ్యూహమా? అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.


