‘ధురంధర్‌’ ల్యారీ మళ్లీ వార్తల్లో! ఈసారి.. | Dhurandhars Lyari Connection, Mystery Deepens After Attack On Gangster Uzair Baloch’s Brother, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ధురంధర్‌’ ల్యారీ మళ్లీ వార్తల్లో! ఈసారి..

Aug 1 2026 10:28 AM | Updated on Aug 1 2026 11:33 AM

Dhurandhars Lyari Connection: Gangster Family Hit Mystery Deepens

సినిమాల్లో చూపించిన చీకటి ప్రపంచం.. నిజ జీవితంలోనూ అంతే భయానకంగా ఉంటుందా? పాకిస్థాన్‌లోని కరాచీ గ్యాంగ్‌వార్‌ ప్లేస్‌ ‘ల్యారీ’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ‘ధురంధర్‌’లో చూపించిన ఈ ప్రాంతంలో గ్యాంగ్‌ కల్చర్‌, అండర్‌వల్డ్‌ ఆధిపత్య పోరు వాస్తవమనే విషయం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకప్పుడు ల్యారీని తన గుప్పిట్లో ఉంచుకున్న గ్యాంగ్‌స్టర్‌ ఉజైర్‌ బలోచ్‌ సోదరుడు జుబైర్‌ బలోచ్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కరాచీలోని ల్యారీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చుని ఉన్న జుబైర్‌ బలోచ్‌పై బైక్‌పై వచ్చిన సాయుధులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ దాడిలో అతడికి ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. పోలీసుల ప్రకారం.. చాకీవారా రోడ్డులోని సింగూ లేన్‌ ప్రాంతంలో జుబైర్‌పై దాడి జరిగింది. అతడిని వెంటనే కరాచీ సివిల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంది. 

ఈ దాడి వెనుక ఉంది  ఎవరు? అనేదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. గ్యాంగ్‌ వార్‌, వ్యక్తిగత కక్షలు, పాత నేర సంబంధాలు.. ఇలా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. 

ల్యారీ అంటేనే గ్యాంగ్‌ల గడ్డ
కరాచీ నగరంలోని ల్యారీ ప్రాంతానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు రాజకీయ ప్రభావం, గ్యాంగ్‌ల ఆధిపత్యం, ఆయుధ సంస్కృతికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉండేది. చిన్న వీధుల్లో పెరిగిన గ్యాంగ్‌లు క్రమంగా భారీ నెట్‌వర్క్‌లుగా మారి.. ప్రాంతీయ రాజకీయాలు, స్థానిక వ్యాపారాలపై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంతో.. నిజజీవిత ఘటనల స్ఫూర్తితో మాంచి మసాలా స్పై డ్రామాగా ‘ధురంధర్‌’ సినిమాను మలిచాడు దర్శకుడు ఆదిత్య ధార్‌.

ఎవరీ ఉజైర్‌ బలోచ్‌?
ఇప్పుడు కాల్పులకు గురైన జుబైర్‌ బలోచ్‌.. ఉజైర్‌ బలోచ్‌ సొంత తమ్ముడు. ఉజైర్‌ బెలూచ్‌ కరాచీలోని ల్యారీ ప్రాంతంలో రెహమాన్‌ డకాయిట్‌ వారసుడిగా ఎదిగాడు. రెహమాన్‌ మరణం తర్వాత అతడి కజిన్‌ అయిన ఉజైర్‌ చేతికి ల్యారీ గ్యాంగ్‌ పగ్గాలు వెళ్లాయి. అయితే సినిమాలో సొంత సోదర బంధంగా చూపించారు. ఆ తర్వాత.. 

కరాచీ అండర్‌వల్డ్‌లో ఉజైర్‌ పేరు మరింత ప్రభావవంతంగా మారింది. అతడిపై హత్యలు, పోలీసులపై దాడులు, ఆయుధ కేసులు సహా అనేక ఆరోపణలు ఉన్నాయి. 2012లో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసుల్లోనూ అతడి పేరు వచ్చింది. ఆఖరికి 2020లో పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం గూఢచర్యం కేసులో అతడిని దోషిగా తేల్చి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది(సినిమాలో రణ్‌వీర్‌ హమ్జా పాత్ర ఉజైర్‌ను పక్కా స్కెచ్‌తో ఇరికించినట్లు చూపించాడు). వాస్తవంగా.. ఇప్పటికీ అతడిపై పలు కేసులు కొనసాగుతున్నాయి.

ఒకప్పుడు తుపాకుల మోత, గ్యాంగ్‌ల ఆధిపత్యానికి పేరున్న ల్యారీ.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి రావడంతో కరాచీ భద్రతపై చర్చ మొదలైంది. ఉజైర్‌ బలోచ్‌ కుటుంబంపై జరిగిన ఈ దాడి వెనుక అసలు కథ ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

పాక్‌లో వాళ్ల అంతం.. ఎప్పుడూ మిస్టరీనే?
పాకిస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్లు, అండర్‌వల్డ్‌ డాన్‌లు, ఉగ్ర సంబంధం ఉన్న నేతల జీవితాలు తరచూ అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి. ఆధిపత్య పోరులు, రాజకీయ విభేదాలు, ప్రత్యర్థి వర్గాల దాడులు.. ఇలా పలువురు కీలక వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఆ సమయాల్లో భారత్‌పైనా పాక్‌ ఆరోపణలు గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. అయితే కొన్ని ఘటనల్లో దాడి వెనుక అసలు కారణాలు, కుట్రదారులు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement