దారి తప్పిన రాకెట్‌.. మెరుపు వేగంతో చంద్రుడిపై ఢీ | Runaway SpaceX Rocket Part Set To Crash Into Moon, Offering Rare Chance To Study Lunar Impact | Sakshi
Sakshi News home page

దారి తప్పిన రాకెట్‌.. మెరుపు వేగంతో చంద్రుడిపై ఢీ

Aug 1 2026 7:59 AM | Updated on Aug 1 2026 11:00 AM

Rogue Rocket on Collision Course With Moon Details

అంతరిక్షంలో దారితప్పిన ఓ భారీ రాకెట్‌ ఇప్పుడు చంద్రుడివైపు దూసుకెళ్తోంది. గంటకు దాదాపు 8 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. అతి త్వరలోనే చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టనుంది. ఈ అనూహ్య పరిణామాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువు ఢీకొట్టినప్పుడు జరిగే ప్రభావాలను అధ్యయనం చేసేందుకు ఇది అరుదైన అవకాశంగా మారనుంది. అదే సమయంలో భవిష్యత్‌ అంతరిక్ష యాత్రల్లో రాకెట్‌ వ్యర్థాల నిర్వహణ, అంతరిక్ష ట్రాఫిక్‌ నియంత్రణపై కొత్త సవాళ్లను కూడా తెరపైకి తెస్తోంది.

స్పేస్‌ఎక్స్‌ కిందటి ఏడాది జనవరిలో ప్రయోగించిన రాకెట్‌లోని అప్పర్‌ స్టేజ్‌ (పై భాగం) అదుపు తప్పి అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి ఢీకొనే మార్గంలోకి వచ్చింది. చంద్రుడిపై ఉన్న ఐన్‌స్టీన్‌ క్రేటర్‌ సమీపంలో ఇది కూలిపోతుందని అంతరిక్ష పరిశీలకుడు బిల్‌ గ్రే అంచనా వేశారు. భారత కాలమానం ప్రకారం సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ ఢీకొట్టు సమయంలో రాకెట్‌ వేగం గంటకు 8,700 కిలోమీటర్లు (సెకనుకు సుమారు 2.4 కిలోమీటర్లు) ఉండనుంది. ఇది ధ్వని వేగం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ.

అనుకోకుండా.. ఢీ
చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువు అదుపు తప్పి ఢీకొట్టడం ఇది రెండోసారి. అంతకుముందు 2022లో ఓ చైనా రాకెట్‌ భాగం చంద్రుడి అవతలి వైపున కూలి రెండు భారీ గోతులను సృష్టించింది. తాజాగా జరగనున్న ఈ ఘటన కూడా చంద్రుడిపై అంతరిక్ష వ్యర్థాల ప్రభావంపై మరోసారి చర్చకు దారితీస్తోంది. అయితే ఈ రాకెట్‌ చంద్రుడిని ఢీకొట్టడం అనుకోకుండా జరుగుతున్న పరిణామమే తప్ప.. ఇది స్పేస్‌ఎక్స్‌ ప్రణాళికలో భాగం కాదు. రాకెట్‌ పైభాగాన్ని సరైన సమయంలో సూర్యుడి కక్ష్యలోకి మళ్లించి ఉంటే ఈ ఢీకొట్టు ప్రమాదాన్ని నివారించవచ్చని అంతరిక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. అందుకు అవసరమైన నియంత్రణ, ఇంధన సామర్థ్యం లేకపోవడంతో అది అంతరిక్షంలో తేలుతూ చివరకు చంద్రుడి ఢీకొట్టు మార్గంలోకి చేరింది.

90 అడుగుల గోతిని తవ్వే అవకాశం
ఈసారి రాకెట్‌ చంద్రుడి భూమికి కనిపించే వైపునే ఢీకొట్టనుంది. దాదాపు 4,500 కిలోల బరువున్న ఈ రాకెట్‌ భాగం ఢీకొట్టడంతో సుమారు 90 అడుగుల వెడల్పు, 16 అడుగుల లోతు ఉన్న గోతిని సృష్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఢీకొనే సమయంలో వెలువడే కాంతి మెరుపు ఒక్క క్షణం మాత్రమే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పైకి ఎగిసే దుమ్ము, రాళ్ల మేఘం మాత్రం కొన్ని నిమిషాల పాటు టెలిస్కోపుల ద్వారా కనిపించే అవకాశం ఉంది.

చంద్రుడిపై పరిశీలనకు అవకాశం
ఈ ఘటనను శాస్త్రవేత్తలు ఒక ప్రమాదంగా మాత్రమే కాకుండా పరిశోధన అవకాశంగా చూస్తున్నారు. చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువుల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ ఢీకొట్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. నాసాకు చెందిన లూనార్‌ రికానైసెన్స్‌ ఆర్బిటర్‌ (LRO), దక్షిణ కొరియాకు చెందిన దనూరి లూనార్‌ ఆర్బిటర్‌ ఢీకొట్టడానికి ముందు, తర్వాత చంద్రుడి ఉపరితల చిత్రాలను సేకరించనున్నాయి.

భవిష్యత్‌ చంద్ర యాత్రలకు హెచ్చరిక
చంద్రుడిపై మళ్లీ మానవులు అడుగుపెట్టేందుకు అమెరికా, చైనా వంటి దేశాలు పోటీపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా చంద్ర యాత్రల్లోకి అడుగుపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్ష వ్యర్థాల నియంత్రణ, రాకెట్‌ భాగాల కదలికలపై పర్యవేక్షణ మరింత కీలకమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాకెట్‌ ఢీకొట్టు ప్రమాదకరం కాకపోయినా.. భవిష్యత్‌లో చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు పెద్ద సవాలుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement