నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గోవా ప్రభుత్వం చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఊపిరితిత్తుల కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 1.46 లక్షలకు పైగా పౌరులకు ఈ కార్యక్రమం కింద వైద్య పరీక్షలు చేయించుకున్నారు
ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 1,46,135 మంది పౌరులను రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఆంకో క్యూర్.ఏఐ (Qure.ai) సంస్థల భాగస్వామ్యంతో పరీక్షించింది. ఈ కార్యక్రమంలో AI ఆధారిత ఇమేజింగ్ విశ్లేషణ సాంకేతికతను ఉపయోగించి, ఊపిరితిత్తుల కేన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే అంటే చికిత్స అత్యంత సాధ్యమయ్యే దశలోనే గుర్తిస్తున్నారు.
ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పరీక్షించిన వారిలో 15,036 మందికి ఊపిరితిత్తుల సంబంధిత అసాధారణతలు (pulmonary abnormalities) ఉన్నట్లు తేలింది. వీరిలో 2,219 మంది తక్షణ వైద్య సహాయం అవసరమైన హై-రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు గుర్తించారు.
హై-రిస్క్ కేటగిరీలో గుర్తించిన రోగులకు తదుపరి పరిశోధనలు, నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, అవసరమైతే చికిత్స ప్రణాళిక వేగంగా అందించనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం వల్ల, తీవ్రమైన పరిస్థితులు మరింత ముదిరిపోకముందే చికిత్స ప్రారంభించడం సాధ్యమవుతోందని శాఖ పేర్కొంది.
కార్యక్రమం ఎలా పనిచేస్తుంది
సంప్రదాయ స్క్రీనింగ్ పద్ధతిలో ప్రతి చెస్ట్ స్కాన్‌ను రేడియాలజిస్టులు మాన్యువల్‌గా పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో, ముందుగా AI వ్యవస్థ స్కాన్‌లను విశ్లేషించి, అసాధారణతలు కనిపించే స్కాన్‌లను ప్రాధాన్యతా ప్రాతిపదికన వైద్యుల పరిశీలన కోసం గుర్తు పెడుతుంది. దీనివల్ల స్క్రీనింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది పౌరులను పరీక్షించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ స్క్రీనింగ్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో కొనసాగుతోంది, ఇది దేశంలోనే ఈ తరహా అతిపెద్ద ప్రజారోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది.
(చదవండి: తొలి అంధ, చెవిటి వైద్యురాలు.. చికిత్స ఎలా చేస్తారంటే?)
.


