ఒక్కరోజులో రూ.39 లక్షల కోట్లు.. మైక్రోసాఫ్ట్‌ సంచలనం! | Microsoft 450 Billion One-Day Market Cap Record AI Azure Growth | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులో రూ.39 లక్షల కోట్లు.. మైక్రోసాఫ్ట్‌ సంచలనం!

Jul 31 2026 12:11 PM | Updated on Jul 31 2026 12:20 PM

Microsoft 450 Billion One-Day Market Cap Record AI Azure Growth

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ షేర్‌ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ షేర్లు ఒక్క ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 15.5 శాతం దూసుకెళ్లడంతో.. మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ దాదాపు 450 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) పెరిగింది. ఒకే రోజులో ఏ లిస్టెడ్‌ కంపెనీ సాధించని స్థాయిలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెరగడం ఇదే తొలిసారి. గతంలో ఎన్విడియా నెలకొల్పిన సుమారు 441 బిలియన్‌ డాలర్ల రికార్డును మైక్రోసాఫ్ట్‌ అధిగమించింది.

మైక్రోసాఫ్ట్‌ షేర్లలో ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణం కంపెనీ ప్రకటించిన బలమైన త్రైమాసిక ఫలితాలే. జూన్‌తో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 18 శాతం పెరిగి 90 బిలియన్‌ డాలర్లకు చేరింది. ముఖ్యంగా క్లౌడ్‌ విభాగం ‘అజూర్‌’ అంచనాలను మించి వృద్ధిని నమోదు చేయడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది.

అజూర్‌ వృద్ధి 43 శాతం

మైక్రోసాఫ్ట్‌కు కీలక ఆదాయ వనరుగా మారిన అజూర్‌ క్లౌడ్‌ సేవల ఆదాయం నాలుగో త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 43 శాతం పెరిగింది. ఇది మార్కెట్‌ అంచనాలను అధిగమించింది. అంతేకాదు, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అజూర్‌ వృద్ధి దాదాపు 45 శాతంగా ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. దీంతో కృత్రిమ మేధ (AI) సేవలకు సంస్థలు భారీగా ఖర్చు చేయడం కొనసాగిస్తున్నాయనే సంకేతం ఇన్వెస్టర్లకు లభించింది.

మరో కీలక మైలురాయిగా.. అజూర్‌ వార్షిక ఆదాయం తొలిసారిగా 100 బిలియన్‌ డాలర్లను దాటింది. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ మొత్తం వార్షిక ఆదాయం కూడా 200 బిలియన్‌ డాలర్ల స్థాయిని అధిగమించింది. దీంతో కంపెనీ భారీగా చేస్తున్న డేటా సెంటర్లు, చిప్‌లు, AI మౌలిక సదుపాయాల పెట్టుబడులు కేవలం ఖర్చులుగానే మిగలకుండా ఆదాయాన్ని సృష్టిస్తున్నాయనే అభిప్రాయం బలపడింది.

జూలై 30న ర్యాలీ అనంతరం మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సుమారు 3.35 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. తాజా మార్కెట్‌ డేటా ప్రకారం ఎన్విడియా సుమారు 5 ట్రిలియన్‌ డాలర్లకు పైగా మార్కెట్‌ విలువతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement