ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 1,075 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో నమోదైన రూ. 463 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 132.4 శాతం వృద్ధి చెందడం విశేషం. బ్యాంక్ మొత్తం కస్టమర్ వ్యాపారం 18.6% వృద్ధితో రూ.5,10,031 కోట్ల నుంచి రూ.6,04,776 కోట్లకు చేరింది.
జారీ చేసిన రుణాలు, అడ్వాన్సులు 20.6 శాతం వృద్ధితో రూ. 3,05,370 కోట్లకు పెరిగాయి. ఆస్తుల నాణ్యత కూడా గణనీయంగా మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు 1.97 శాతం నుంచి 1.51 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పీఏ 0.55 శాతం నుంచి 0.44 శాతానికి దిగొచి్చంది. నికర వడ్డీ మార్జిన్ గతేడాది ఉన్న 5.71 శాతం నుంచి 5.96 శాతానికి బలపడింది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ లాభం 37% జంప్
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అద్భుత ప్రదర్శన కనబరిచింది. బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 37 శాతం వద్ధితో రూ.796 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం, నికర వడ్డీ మార్జిన్లు 5.9%కి మెరుగుపడటంతో లాభాలు పెరిగాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.2,695 కోట్లకు చేరింది. రుణాలు 23 శాతం వృద్ధి చెందాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.10 శాతానికి తగ్గడం ద్వారా ఆస్తుల నాణ్యత మెరుగైంది.


