అమ్మ రోజువారీ పనుల్లో కష్టాన్ని చూసి తను సాయం చేయాలనుకోలేదు. కానీ టెక్నాలజీ సాయంతో ఆమెకు సహకరించే ఆవిష్కరణలు చేశాడు. అందుకోసం పెద్ద పెద్ధ ఖరీదైన పరికరాలను కూడా ఉపయోగించలేదు. చుట్టూ ఉండే వస్తువులు, పనికిరాని కార్డుబోర్డులాంటి వాటితోనే అద్భుత ఆవిష్కరణలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు శెభాష్ అని ప్రశంసలందుకుంటున్నాడు.
అతడే కేరళకు చెందిన 12 ఏళ్ల లెవిన్ పౌలోస్. రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి రూపొందించిన అతడి చేసిన ఆవిష్కరణలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాటలో కొన్ని వాక్యూమ్ క్లీనర్, ఒక బటన్ నొక్కగానే కర్టెన్లను తెరిచి మూసే మోటార్‌తో నడిచే ఆటోమేటెడ్ కర్టెన్ సిస్టమ్, అలాగే స్టవ్ నుంచి దూరంగా వెళ్లిన ఆటోమేటిగ్గా గరిట పట్టుకుని తిప్పే ఆటోమేటిక్ ఫుడ్ స్టిరర్ తదితరాలు. ఆచరణాత్మకమైన రూపకల్పన, రోజువారీ పనుల్లో ఉపయోగపడే అతడి ఆవిష్కరణలు అందర్నీ అబ్బురపరుస్తున్నాయి.
వీటన్నింటి తోపాటు తాజాగా పారేసిన కార్డ్‌బోర్డ్‌తో నిర్మించిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్, అతడి క్రియేటివిటీకి, ఇంజనీరింగ్ నైపుణ్యలను నిదర్శనం. పూర్వినయోగ వస్తువులు, ప్రాథమిక ఎలక్ట్రానిక్ భాగాలతో ఆకర్షణీయంగా రూపొందించడం విశేషం. అతడు రూపొందించిన ఈ రోబోట్ తన తల్లికి రోజువారీ పనులలో ఉపయోగపడుతుంది. ఇవననీ తన తల్లి పడే కష్టాన్ని చూసి చేసిన అద్భుతమైన ఆవిష్కరణలు. పొద్దున లేస్తే ఇంటి పనులతో, వంటతో అమ్మ పడుతున్న అలసటను తగ్గించాలనే ఉద్దేశంతో చేసినవే.
అంతేగాదు అతడి ఆవిష్కరణల కారణంగా సాక్షాత్తు తన రాష్ట్ర సీఎంనే కలిసే అవకాశం దక్కించుకున్నాడు. ఆయన సైతం అతడి ప్రతిభకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు. లెనిన్ కథ యువతను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం వంటి (STEM) రంగాలను ఆచరణాత్మక అభ్యాసం ద్వారా అన్వేషించేలా చేస్తున్నాడు. అంతేగాదు లెవిన్ ఆవిష్కరణలు విద్యావేత్తలు, టెక్నాలజీ ఔత్సాహికులు, సోషల్ మీడియా వినియోగాదారులందరినీ ఆకట్టుకుంది. పైగా ఉత్సుకత, పట్టుదల సమయస్ఫూర్తి సాధారణ గృహోపకరణాలను అద్భుతమైన ఆవిష్కరణలుగా ఎలా మారుస్తుందో చూపించింది.


