ఉద్యోగం కోల్పోవడం, మూడుసార్లు వ్యాపారంలో నష్టం..చివరికి ఏకంగా రూ. 100 కోట్లు.. | Singapore Entrepreneur Miza Nazili Success Story: From Bankruptcy to Rs 100 Crore Empire | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోల్పోవడం, మూడుసార్లు వ్యాపారంలో నష్టం..చివరికి ఏకంగా రూ. 100 కోట్లు..

Jul 30 2026 12:25 PM | Updated on Jul 30 2026 12:48 PM

Singapore entrepreneur Miza Nazili Success Story

ఎడతెగని వైఫల్యాలు మరింత బలోపేతం కావడానికే...పదేపదే ఓటమి పలకరిస్తోందంటే ఎవ్వరూ ఊహించనంత ఎవరెస్ట్‌ అంత ఎత్తుకు వెళ్తున్నామని అర్థం... ఇక్కడ కావాల్సింది ఒక్కటే బలహీనమవుతున్న మనసుని స్ట్రాంగ్‌గా మార్చుకుని ధైర్యంగా ముందుకు సాగడం. అది తెలిసినవాడిని ఓటమి మట్టికరింపించలేదు..ఎందుకంటే అచంచలమైన పట్టుదల ముందు ఆకాశమంత గెలుపుని తలవంచాల్సిందే. అందుకు ఉదాహరణ ఈ మహిళ. ఆమె తాను ఎదుర్కొన్న సవాళ్లను, కష్టాలను ఎంతో నిజాయితిగా సోషల్‌మీడియా పోస్ట్‌లో వివరించి,  నెటిజన్ల మనసును దోచడమే కాదు..గెలుపు పోరాటంపై అద్భుతమైన పాఠం నేర్పించింది.

ఆ మహిళే సింగపూర్‌కి చెందిన పారిశ్రామికవేత్త మిజా నజిలి. ఆమె సోషల్‌మీడియా వేదకగా వ్యాపార ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాల గురించి వివరించి వైరల్‌గా మారింది. ఆమె ఆ పోస్ట్‌లో ప్రస్తుతం అందరూ తన సక్సెస్‌ని మాత్రమే చూస్తారు తప్ప ఆ మార్గంలో తనకు ఎదురైన ఎదురుదెబ్బలు, త్యాగాలు పెద్దగా ఎవ్వరూ గమనించారు అంటూ తన సక్సెస్‌ జర్నీని వివరించింది ఇలా. 

ఒకప్పుడు తాను పూర్తికాలపు ఉద్యోగం నుంచి తొలగించబడినట్లు తెలిపారు. ఆ తర్వాత చేసిన మూడు వ్యాపారాల్లోనూ తీవ్ర నష్టం చవిచూసినట్లు వెల్లడించింది. ఒకానొక సమయంలో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ సైతం రూ. 2 వేలుకి మించి లేదని ఆవేదనగా చెప్పారు. అంతేగాదు వ్యాపారాల్లో నష్టం కారణంగా సుమారు రూ. 70 లక్షలదాక అప్పులుపాలైనట్లు తెలిపారు. తన వ్యాపారం ప్రారంభ దశలో మెరుగైన లాజిస్టిక్స్ మద్దతును పొందలేకపోయినందున, సరుకును తీసుకెళ్లడానికి దాదాపు ప్రతిరోజూ జోహోర్ బహ్రూకు ప్రయాణించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

ఆ తర్వాత రిటైల్ అవకాశాలను పొందడానికి ప్రయత్నించినప్పుడు మరో సవాలు ఎదురైందంటూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఒక ప్రముఖ రిటైలర్‌కు తన ఉత్పత్తులను మొదటిసారిగా అందించినప్పుడు, ఎలా తిరస్కరించారో ఇప్పటికీ మర్చిపోనన్నారు. కానీ ఇవాళ తన ప్రొడక్ట్స్‌ వందకు  పైగా వాట్సన్స్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని గర్వంగా చెప్పారామె. 

కేవలం పట్టువదలని ప్రయత్నంతో తన వ్యాపారాన్ని నిలబెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పోర్ట్‌ఫోలియోలో 5 వివిధ బ్రాండ్లు ఉన్నాయని, వాటి నుంచి ఏడాదికి ఏకంగా దాదాపు రూ. 100 కోట్లుపైనే ఆర్జిస్తానని చెప్పారు. అంతేగాదు రెండు భవనాల్లో ఆరు అంతస్థుల ప్రధాన కార్యాలయాన్ని నిర్మించానని కూడా అన్నారు. అలాగే ఇటీవలే తానొక కొత్త పోర్షే కారుని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 

ప్రస్తుతం తనను అందరూ బహుళ బ్రాండ్‌లను నడుపుతున్న ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చూస్తున్నారని, ఒకప్పుడు తల్లిదండ్రులు సైతం చిరాకుపడ్డ అమ్మాయిగా కానీ, చదువు మధ్యలోనే మానేసిన మొద్దుదానిలా గానీ చూడరని చెప్పుకొచ్చింది. ఇదంతా గెలుపు గొప్పతనం అంటూ తన పోస్ట్‌ని ముగించింది. అంతేగాదు ఆమె ప్రతి ఒక్కరిని ఇతరుల విజయాలతో పోల్చుకుని అస్సలు చూసుకోవద్దని అది మనల్ని వెనక్కి లాగేస్తుందని అన్నారు. అలాగే తాను ఇన్ని ఎడతెగని ఓటములు చవిచూసినా ఎన్నడూ భయపడలేదని, ఎందుకంటే ఓటమి భయం కంటే పేదరికంలో ఉండిపోతానన్న భయమే ఎక్కువ అంటూ సరికొత్త గెలుపు పాఠాన్ని చెప్పింది మిజా నజిలి.

 

(చదవండి: నో ఐఐటీ/ఎన్‌ఐటీ, 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ..కట్‌చేస్తే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement