మాజీ బస్‌ డ్రైవర్‌ ఇంట్లో 15 కేజీల బంగారం | Bengal police seize Rs 20 crore cash, 15 kg gold from bus driver | Sakshi
Sakshi News home page

మాజీ బస్‌ డ్రైవర్‌ ఇంట్లో 15 కేజీల బంగారం

Jul 30 2026 5:43 AM | Updated on Jul 30 2026 5:43 AM

Bengal police seize Rs 20 crore cash, 15 kg gold from bus driver

35 సంచుల్లో రూ. 20 కోట్లకుపైగా నగదు 

పశ్చిమబెంగాల్‌ అక్రమ వ్యాపార లావాదేవీలను చేధించిన పోలీసులు

సురీ: పశ్చిమబెంగాల్‌లో అతనో సాధారణ వ్యక్తి. నార్త్‌బెంగాల్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో చాన్నాళ్లు బస్సు డ్రైవర్‌గా పనిచేసి మానేశాడు. అతని ఇంట్లో అసాధారణ స్థాయిలో నగదు నిల్వలు పోగుబడ్డాయన్న నిఘా వర్గాలు ఉప్పందించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై బుధవారం అతని ఇంట్లో సోదాలుచేశాక అక్కడ వెలుగుచూసిన బంగారం, నగదు చూసి నోరెళ్లబెట్టారు. 35 సంచుల నిండా నింపిన రూ.20 కోట్లకుపైగా కరెన్సీ కట్టలు, విడిగా 15 కేజీల బరువైన బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాదీనంచేసుకున్నారు. 

వివరాలను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సువేంధు అధికారి తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీర్భూమ్‌ జిల్లాలోని దేవ్‌చా గ్రామంలో గతంలో బస్సు డ్రైవర్‌గా ఉన్న మినార్‌ మొండల్‌ ప్రస్తుతం తన బామ్మర్ది అయిన స్టోన్‌ ట్రేడర్‌ తులు మొండల్‌ అలియాస్‌ మొహ్మద్‌ నజీబుద్దీన్‌తో కలిసి అక్రమ లావాదేవీల్లో మునిగిపోయాడు. నజీబుద్దీన్‌కు స్టోన్‌ ట్రేడింగ్‌కాకుండా ఇసుక మాఫియాతోనూ సంబంధాలున్నట్లు గతంలోనే ఆరోపణలున్నాయి. 

మినార్‌ మొండల్‌కు చెందిన విలాసవంత రెండంతస్తుల భవంతిలో నగదు పోగుబడిందని తెలియగానే పోలీసులు సోదాలుచేసి అక్కడి సొత్తున స్వా«దీనంచేసుకున్నారు. ఒక్కోటి వంద గ్రాముల బరువైన మొత్తంగా రూ.21.5 కోట్ల విలువైన 15 కేజీల బంగారు బిస్కెట్లను పోలీసులు స్వా«దీనంచేసుకున్నారు. సంచులకొద్దీ కరెన్సీ కట్టలను లెక్కించేందుకు ఐదు లెక్కింపు మెషీన్లను రప్పించి వాటిని లెక్కబెడుతున్నారు. లెక్కింపు కొనసాగుతోందని, ఇప్పటికే కరెన్సీ విలువ రూ.20 కోట్లు దాటిపోయిందని దాడులుచేసిన బృందంలోని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  

టోల్‌ సొమ్ము.. దారి మళ్లించి...! 
మూడు జిల్లాల్లోని ఆరు స్టోన్‌ క్రషింగ్‌ క్లస్టర్ల నుంచి బయటికొచ్చే ట్రక్కుల నుంచి ఎంట్రీ గేట్‌ల వద్ద రుసుములను వసూలుచేసి ప్రభుత్వ ఖజానాలో జమచేయాల్సి ఉంది. అందులో ఒక టోల్‌ గేట్‌ వద్ద నిర్వహణ బాధ్యతలను బామ్మర్ది తులు మొండల్‌ నుంచి తీసుకుని అక్రమంగా మినార్‌ కోట్లు కూడబెట్టినట్లు తెలుస్తోంది. తులు మొండల్‌పై గతంలోనే పలు కేసులు నమోదుకావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఘటనాస్థలిలో మినార్, అతని కుమారుడిని అరెస్ట్‌చేసి పోలీసులు ప్రశి్నస్తున్నారు. గతంలో మే మధ్య నుంచి జూన్‌ మధ్యవరకు నెలకు ఈ టోల్‌గేట్ల వద్ద రూ.35–40 లక్షల రుసుములు వచ్చేవి.

 ప్రస్తుతం ఇవి ఏకంగా రూ.83 కోట్లకుపెరిగాయి. కానీ ప్రభుత్వ ఖజానాలో మాత్రం రూ.5 కోట్ల లోపే జమ అవుతుండటంతో ఈ వసూళ్ల అక్రమ మళ్లింపుపై పోలీసులు దృష్టిసారించడంతో ఎట్టకేలకు ఈ గుట్టురట్టయిందని సీఎం తెలిపారు. ఈ ఉదంతంలో విజిలెన్స్‌ దర్యాప్తు సైతం కొనసాగనుందని తెలుస్తోంది. గత తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రంగం నుంచి కేవలం రూ.100 కోట్లు మాత్రమే వసూలుచేయగలిగింది. ఇలా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,100 కోట్ల నష్టం వాటిల్లేలా చేశారు’’అని సీఎం ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement