ఒంటరిగా నిరసన చేయడానికి ఎంతో గుండె నిబ్బరం కావాలి. అది ప్రజల మనసును కదిలించి..అందుకు అందరూ చేయి చేయి కలిపి ముందు వచ్చేలా చేయగలగాలి. సమస్య పరిష్కారం దిశగా నడిపించగలగాలి. అందుకు నిరసనలో ప్రత్యేకత తప్పనిసరి. ముఖ్యంగా యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసేలా ప్రేరేపించాలి. అచ్చం అలాంటి నిరసననే చేపట్టి మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. పైగా ఆ సమస్యపై ప్రతి పౌరుడు బాధ్యత వహించేలా చేసి ప్రభుత్వాన్నే చైతన్యపరిచింది.
ఆ అమ్మాయే మిరాండా గిబ్సన్. ఆమె ఏమి మొదటి నుంచి పర్యావరణ కర్త కాదు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్లో ఇప్స్‌విచ్‌లో పెరిగిన ఆమెకు అడవులు గురించి అంతగా తెలియదు, వాటితో పరిచయం కూడా లేదు. సరిగ్గా టీనేజ్ వయసులో విశ్వవిద్యాలయ చదువుల సమయంలో అటవీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. టాస్మానియా అడవులు ఎలా అంతరించిపోతున్నాయో తెలుసుకుంది. అలా ఆ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల గురించి తెలుసుకోవడం ప్రారంభించింది.
ఆ తర్వాత ఆ అడవులు ఉండే రాష్ట్రాన్ని సందర్శించి ఆ సమస్యను కళ్లారా చూసి.. చలించిపోయింది. అక్కడ అప్పర్ ఫ్లోరెంటైన్ లోయకు ఒక పర్యటనలో అప్పటికే మొద్దుగా మారిపోయిన ఒక భారీ చెట్టు ఆమెకు ఎదురైంది. ఆ దృశ్యం రానున్న రోజుల్లో ఎంతటి నష్టాన్ని దారితీయనున్నదో తెలియజేసిందామెకు. దాంతో సెలవుల్లో నిరసనలలో చేరేందుకు టాస్మానియాకు తిరిగి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రచార కార్యకర్తలతో పనిచేయడం మొదలుపెట్టడమే కాకుండా అక్కడే స్థిరపడింది.
అలా ఆమె అప్పర్ ఫ్లోరెంటైన్ లోయ దిగ్బంధంలో సంవత్సరాలు గడిపింది. కానీ అడువులు కనుమరుగవుతూ ఉండటాన్ని సాంప్రదాయ నిరసనలు తగినంత ప్రభావాన్ని చూపించడం లేదని గుర్తించింది. టాస్మానియా అడవులను దాటి ఈ విధ్వంసాన్ని ప్రపంచానికి కనిపించేలా చేయడానికి ఒక మార్గం కోసం వెతికి మరి.. 'ట్రీ సిట్ నిరసన'ను ఎంచుకుందామె. అదీగాక కలప నరికివేత ఉన్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉందని తెలుసుకుందామె.
ఆ కనెక్షన్ ద్వారా, ఆమె అడవిలోని చిత్రాలను నేరుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రసారం చేయగలిగితే తన పని సులువవుతుందని అనుకుంది. అలా గిబ్సన్ డిసెంబర్ 14, 2011న అడవిలోని ఒక చెట్టుని ఎంచుకుని, దానిపై సుమారు 60 కిలోమీటర్ల ఎత్తులో ఒక చిన్న వేదికపై కూర్చొని నిరసన ప్రారంభించింది. అంతేగాదు అడవికి రక్షణ లభించేంత వరకు 'ట్రీ సిట్' నిరసన కొనసాగిస్తానని ప్రకటించింది.
ఆమె చెట్టుపై ఏర్పాటు చేసుకున్న ఆవాసం చాలా సాధారణమైనది. కేవలం 1.5 మీటర్ల వెడల్పుతో పరిమిత స్థలాన్ని మాత్రమే అందించింది. అలా ఆమె ఏకంగా 449 రోజులు ఒంటరిగా ఆ చెట్టుపైనే గడిపింది. టాస్మానియా అనూహ్య వాతావరణం మార్పులన్నింటిని తట్టుకుంది. తాజా సమాచారాన్ని పంచుకునేందుకు సౌరశక్తితో నడిచే కంప్యూటర్‌ని వినియోగించింది. చురుకుగా ఉండటానికి ఒక చిన్న వాకింగ్ మెషీన్, యోగ సాధన వంటి దినచర్యతో ఒంటరిగా ఆ చెట్టుపైనే నిరసన చేసింది. ఈ నిరసన ఫలితంగా ఆమె కనీస అవసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఆ చెట్టుపైనే ఉంటూ.. పచ్చి ఆహారమే తింటూ నిరసన కొనసాగించింది.
ముఖ్యంగా ఒంటరితనం, నిత్యావసరాలను సర్దుకుని మరి కొనసాగించక తప్పని స్థితి అయినా అధైర్యపడలేదు. అనుకున్నట్లుగానే నెలలు గడిచేకొద్దీ, గిబ్సన్ చెట్టుపై కూర్చోవడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ప్రజల నుంచి అమితమైన స్పందన మద్దతు లభించాయి. అలా 2013 ప్రారంభంలో టాస్మానియా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడమే గాక అడవుల విస్తరణకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అయితే అదంతా అధికారికంగా గుర్తింపు లభించేంత వరకు ఆ చెట్టుపైనే ఉండి నిరసన చేద్దాం అనుకుంటే ప్రకృతి కార్చిచ్చు రూపంలో వ్యతిరేకించడంతో నిరసనను విరమించక తప్పలేదు గిబ్సన్‌కి. ఎలాగైతేనేం ఆమె పోరాటం ఫలించింది. గిబ్సన్ గడిపిన చెట్టుతో సహా అటవీ ప్రాంతాలకు అదనపు రక్షణను ప్రపంచ వారసత్వ కమిటీ ఆమోదించింది.
గిబ్సన్ 449 రోజులు గడిపిన ఆ నివాస చెట్టుకి అధికారిక గుర్తింపు లభించింది. అయితే గిబ్సన్ ఆ తర్వాత పూర్తికాల కార్యకర్తగా తన వృత్తిని విడిచిపెట్టి, మెల్బోర్న్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించింది. టాస్మానియా అడవులపై జరుగుతున్న విస్తృత పోరాటంలో ఆ చెట్టుపై ఆమె గడిపిన సమయం ఒక కీలక అధ్యాయంగా నిలిచింది.
(చదవండి: సీతగా అలరించనున్న సాయిపల్లవి జపమాల ఎందుకు ధరిస్తుందంటే..!)


