ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారులను దిగ్బంధించిన పొగాకు రైతులు
రూ.1,000 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు పోరు బాటపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన గళం విప్పారు. ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద 16వ జాతీయ రహదారిని, టంగుటూరు మండలం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని బుధవారం దిగ్బంధించారు. హైవేపై బైఠాయించి టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీంతో దాదాపు గంటకు పైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఎం చంద్రబాబు పొగాకు సీ–గ్రేడ్‌కు కిలో రూ.110గా ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు రైతులకు భిక్షం వేస్తున్నారో, లేక రైతులను భిక్షగాళ్లుగా చూస్తున్నారో, మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే రూ.1,000 కోట్లు కేటాయించి, మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాల్లో సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వి.కృష్ణయ్య, భారీ సంఖ్యలో పొగాకు రైతులు, రైతు సంఘాల నేతలు జజ్జూరి జయంత్ బాబు, కిలారు పెద్దబ్బాయి, టి.శ్రీకాంత్, వడ్డే హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ధర్నా చేస్తున్న పొగాకు రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
పొగాకు రైతులపై సర్కారు నిరంకుశత్వం
హైవేల దిగ్బంధం నేపథ్యంలో రైతుల అక్రమ నిర్బంధం
ఆత్మకూరు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో బుధవారం చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టకుండా సర్కారు నిరంకుశత్వానికి తెగించింది. ఐదు రోజులుగా రైతు సంఘం నేతలు, వామపక్షాల నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం జాతీయ రహదారిని నిర్బంధించాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని ముందుగానే అదుపులోకి తీసుకోవడం, వారి ఇళ్ల వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడం వంటి చర్యలకు చంద్రబాబు సర్కారు దిగింది.
ఈ క్రమంలో పలువురు రైతు నాయకులు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డీసీపల్లిలోని పొగాకు బోర్డు వద్దకు వెళ్లేందుకు బుధవారం ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసేందుకు ఆత్మకూరులోని ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. ఆర్డీవో లేకపోవడంతో వారిని పోలీస్ సర్కిల్ కార్యాలయానికి తీసుకెళ్లిపోయారు. ఆ నాయకులు పోలీస్‌స్టేషన్ వద్ద మాట్లాడుతూ..ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్న తమను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అదుపులోకి తీసుకున్న రైతు సంఘాల నాయకుల్లో నాగయ్య ,మూలి వెంగయ్య, లక్కు కృష్ణప్రసాద్, డేవిడ్‌రాజు, లక్ష్మీపతి తదితరులున్నారు.
సిండికేట్ అయ్యామని వ్యాపారులే చెప్పారు
పొగాకు కొనుగోళ్లు అస్సలు జరగడం లేదు. దీనిపై వ్యాపారులను ప్రశ్నిస్తుంటే మేమంతా సిండికేట్ అయ్యామని నేరుగా చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. పంట వేయమంటారు.. తీరా కొనుగోలు దగ్గరకు వచ్చేసరికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ఏ విధంగా సాగు చేయాలి? – గాలి వెంకటేశ్వర్లు, పొగాకు రైతు, శంకరాపురం, ముండ్లమూరు మండలం, ప్రకాశం జిల్లా
నో–బిడ్ పేరుతో వేధింపులు
పొగాకు బోర్డుకు పొగాకును తీసుకెళ్తే నో–బిడ్ పేరుతో వెనక్కు పంపుతున్నారు. ఒక్కో పొగాకు మొక్కకు 25 వరకు ఆకులు వస్తాయి. అన్నీ ఒకే నాణ్యతతో ఉండవు. చెట్టు మధ్య ఆకులు మాత్రమే బాగుంటాయి. నాణ్యమైన ఎఫ్–1, ఎఫ్–2 పొగాకు మాత్రమే తెమ్మంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది. క్వాలిటీ బాగున్నా రోజూ దాదాపు 50 శాతం పొగాకు బేళ్లు వెనక్కు పంపుతున్నారు. – జల్లి చిన వెంకటేశ్వర్లు, పొగాకు రైతు, మైనంపాడు, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా
చంద్రబాబు ప్రభుత్వంలో పొగాకు రైతులకు సంక్షోభం
ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ధ్వజం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పొగాకు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే రాష్ట్రంలో పొగాకు రైతులు ప్రతిరోజూ ఆందోళనలకు దిగుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగాల్సిన పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమన్నారు.


