సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కాంతారావు.. తనను లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల మేరకు.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.. తనను వివాహం చేసుకుంటానని నమ్మంచి మోసం చేశారని బాధితురాలు పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ చానెల్ పేరుతో ప్లాట్‌కు పిలిపించి వేధించారని పేర్కొంది. ఇదే సమయంలో కాంతారావు.. తన ప్రైవేటు ఫొటోలతో బ్లాక్ మొయిల్ చేస్తున్నారని యువతి ఆరోపించింది. అలాగే, రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద నాలుగు లక్షలు తీసుకుని మోసం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈనెల 26న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో రేగా కాంతారావు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని పిటిషన్ చేశారు. దీంతో, తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.


