ముంబై: భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగం విస్తృత వృద్ధి దశలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా (పెనెట్రేషన్) 10 నుంచి 12 శాతానికి పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) అంచనా వేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఈ వృద్ధికి ప్రధాన దన్నుగా నిలుస్తాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 8.5 శాతంగా నమోదైంది. ఇండ్–రా నివేదిక ప్రకారం విభాగాల వారీగా ఈవీ వాటా అంచనాలు ఇలా ఉన్నాయి.
తక్కువ నిర్వహణ వ్యయం, ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యం, దిగ్గజ ఆటో కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుండటంతో ద్విచక్ర వాహన విభాగంలో ఈవీల వాటా గతేడాది 6.6 శాతం నుంచి ఈ ఏడాది 8–10 శాతానికి పెరగొచ్చని అంచనా.
ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విభాగంలో ఈవీల ఆధిపత్యం కొనసాగనుంది. గతేడాది (2025–26) మొత్తం త్రిచక్ర వాహన విక్రయాల్లో ఈవీల వాటా 59 శాతంగా ఉంది. కమర్షియల్ ఆపరేటర్లకు అనుకూలమైన నిర్వహణ వ్యయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 62–65 శాతానికి చేరొచ్చు.
కొత్త మోడళ్ల విడుదలతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా గతేడాది 4.4 శాతం నుంచి ఈ ఏడాది 6–8 శాతానికి పెరగొచ్చు. మెట్రో నగరాలు, అధిక ఆదాయ వర్గాల్లో వీటి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే అధిక ప్రారంభ కొనుగోలు ధర, చార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత, ఒక్కసారి చార్జింగ్‌తో ప్రయాణించగల దూరం (రేంజ్) వంటి అంశాలు ఈ విభాగంలో వేగవంతమైన విస్తరణకు సవాళ్లుగా ఉన్నాయి.
ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) వాటా కూడా గతేడాది 4.37 శాతం నుంచి ఈ ఏడాది 6–8 శాతానికి చేరొచ్చు. బలమైన ఆర్డర్ బుక్, ప్రభుత్వ కొనుగోలు కార్యక్రమాలు ఇందుకు దోహదపడనున్నాయి. అయితే రాష్ట్ర రవాణా సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఈ–బస్సుల విస్తరణ ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
బ్యాటరీల దిగుమతులు తగ్గాలి
వాహన వినియోగ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, విస్తృత శ్రేణిలో కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, వినియోగదారుల ఆదరణ పెరగడంతో దేశీయ ఈవీ మార్కెట్‌కు బలమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే తదుపరి దశ వృద్ధి దేశీయ వాల్యూ చైన్ బలోపేతంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీలు, అనుబంధ సాంకేతికతల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ఈ స్థానంలో దేశీయ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనితోపాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించాల్సి ఉంది’’ అని ఇండియా రేటింగ్స్ కార్పొరేట్స్ డైరెక్టర్ శృతి సబూ పేర్కొన్నారు.


