దేశీయ ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ పాలనాపరమైన నియమ ఉల్లంఘనల కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శశిధర్ జగదీషన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) శ్రీనివాసన్ వైద్యనాథన్, రిటైల్ అసెట్స్ గ్రూప్ హెడ్ అరవింద్ వోహ్రాలపై బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించడంతో పాటు హెచ్చరిక లేఖలు జారీ చేసింది.
కేసు నేపథ్యం
మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 2017-21 మధ్యకాలంలో సేకరించిన భారీ డిపాజిట్లకు సంబంధించి సుమారు రూ.45 కోట్లను మార్కెటింగ్ వ్యయాలుగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన స్పెషల్ డిసిప్లినరీ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది. విచారణలో ఎలాంటి దురుద్దేశం గానీ, వ్యక్తిగత లాభార్జన ధోరణి గానీ లేనప్పటికీ తమ అధికారిక పరిధిని దాటి వ్యవహరించడం (Business Overreach) జరిగిందని కమిటీ గుర్తించింది.
ఆర్‌బీఐ నిబంధనలు.. బోర్డు నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల నుంచి పాక్షికంగా పాటించనట్లు బోర్డు భావించి స్వతంత్ర కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు చేపట్టింది. మిగిలిన సంబంధిత సిబ్బందికి కూడా హెచ్చరిక లేఖలు పంపినట్లు, ఈ అంతర్గత విచారణ వివరాలు, చేపట్టిన చర్యలను ఆర్‌బీఐకి అధికారికంగా నివేదించనున్నట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన సమాచారంలో తెలిపింది.
ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు


