ప్రయాణికుడి కేసు.. రైల్వేకు రూ.25 వేల జరిమానా | Train Blanket Row: Indian Railways Fined Rs 25,000 for Providing Single Blanket to RAC Passengers | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి కేసు.. రైల్వేకు రూ.25 వేల జరిమానా

Jul 30 2026 3:49 PM | Updated on Jul 30 2026 4:06 PM

Train Blanket Row Indian Railways fined Rs 25000

రైలులో ప్రయాణికులకు అందించాల్సిన బెడ్‌రోల్ విషయంలో రైల్వేకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆర్ఏసీ టికెట్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అపరిచితులకు ఒకే దుప్పటి, దిండు ఇచ్చిన ఘటనలో సేవాలోపం జరిగిందని తేల్చిన ఢిల్లీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ప్రయాణికుడు పడిన మానసిక వేధన, శారీరక అసౌకర్యానికి రూ.20,000, వ్యాజ్య ఖర్చుల కింద మరో రూ.5,000 మొత్తం రూ.25,000 పరిహారం చెల్లించాలని నార్తెర్న్‌ రైల్వేను ఆదేశించింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా రైల్వే ఈ మొత్తాన్ని చెల్లించాలి. గడువులోగా చెల్లించకపోతే, ఉత్తర్వు తేదీ నుంచి మొత్తాన్ని వసూలు చేసే వరకు 7 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?

2022 అక్టోబర్ 28న ప్రయాగ్‌రాజ్‌ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు ఆర్ఏసీ టికెట్‌ బుక్ చేసుకున్నాడు. రైలులో మరో ప్రయాణికుడితో ఉమ్మడి సీటును పంచుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇద్దరికీ కలిపి ఒకటే దుప్పటి, దిండు, రెండు బెడ్‌షీట్లు మాత్రమే అందించారని అతను కమిషన్‌ను ఆశ్రయించాడు. అపరిచితుడితో ఒకే దుప్పటి పంచుకోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని ప్రయాణికుడు విన్నవించాడు. అదనపు దుప్పటి, దిండు ఇవ్వాలని కోచ్‌ అటెండెంట్‌ను కోరినా స్పందన లేదని తెలిపాడు. రైల్వే అధికారులకు, టీటీఈకి ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నాడు.

రైల్వే వాదన ఏంటి?

తమ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు బెడ్‌రోల్ అందిస్తామని ఉత్తర రైల్వే కమిషన్‌కు తెలిపింది. అదనపు దుప్పటి అవసరం, డిమాండ్, అందుబాటుపై ఆధారపడి ఇవ్వవచ్చని వాదించింది. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత రైల్వే అధికారుల పరిధిలో విచారణ జరుగుతోందని పేర్కొంది.

అయితే.. బెడ్‌రోల్ అందించే కాంట్రాక్టర్‌పై రూ.1,000 జరిమానా విధించినట్లు రైల్వే అంతర్గత సమాచారంలో వెల్లడైంది. కానీ ఆ చర్యను ఫిర్యాదుదారుడికి తెలియజేయలేదని కమిషన్ గుర్తించింది. అంతేకాకుండా, ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్‌రోల్ అందించామని రైల్వే పేర్కొన్నప్పటికీ, దానికి సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని పేర్కొంది.

2009 సర్క్యులర్ కీలకం

ఈ కేసులో 2009 సెప్టెంబర్ 23న జారీ చేసిన ప్రభుత్వ సర్క్యులర్‌ను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఆర్ఏసీ ప్రయాణికులకు బెడ్‌రోల్ సదుపాయం కల్పించవచ్చని, బెడ్‌రోల్ ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఛార్జీల్లోనే భాగంగా ఉన్నాయని కమిషన్ గమనించింది. అందువల్ల ప్రయాణికుడికి వాగ్దానం చేసిన సదుపాయాన్ని అందించకపోవడం సేవలో లోపం కిందకు వస్తుందని తేల్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ప్రయాగ్‌రాజ్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడని, ఆర్ఏసీ సీటులో అపరిచితుడితో ప్రయాణాన్ని పంచుకున్నాడని ఇరుపక్షాలు అంగీకరించినట్లు కమిషన్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement