ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా.. | Infosys Fined France Employee Time Tracking 175000 Euros | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా..

Jul 26 2026 9:29 AM | Updated on Jul 26 2026 11:01 AM

Infosys Fined France Employee Time Tracking 175000 Euros

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లోని కార్మిక నియంత్రణ సంస్థ 1.75 లక్షల యూరోలు (సుమారు రూ.1.75 కోట్లు) జరిమానా విధించింది. కంపెనీ ఉపయోగిస్తున్న ఉద్యోగుల వర్కింగ్ టైమ్ రికార్డింగ్ సిస్టమ్ ఫ్రెంచ్ కార్మిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ జూలై 25న స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

ఫ్రెంచ్ అధికారుల పరిశీలనలో, కొందరు ఉద్యోగుల పని గంటలను ఖచ్చితంగా నమోదు చేయడం, ఆడిట్‌కు అనుకూలంగా భద్రపరచడం, సమర్థవంతంగా పర్యవేక్షించడం వంటి అంశాల్లో కంపెనీ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం 175,000 యూరోలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ లోపాలు ఏ విభాగానికి చెందిన ఉద్యోగులకు సంబంధించినవో, వ్యవస్థలో మార్పులు చేయాలని ఆదేశించారా లేదా అనే వివరాలను ఇన్ఫోసిస్ వెల్లడించలేదు.

అయితే ఈ పరిణామం తమ ఆర్థిక ఫలితాలు, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం చూపదని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. జరిమానా సమాచారం అందిన వెంటనే బహిరంగంగా వెల్లడించకపోవడానికి కారణంగా, ముందుగా సమాచారాన్ని ధ్రువీకరించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.

యూరప్‌లో ఉద్యోగుల పని గంటల నమోదు, విశ్రాంతి సమయాలు, ఓవర్‌టైమ్‌ వంటి అంశాలపై కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా అమలవుతాయి. ఈ నేపథ్యంలో బహుళజాతి సంస్థలు స్థానిక నిబంధనలకు అనుగుణంగా తమ హెచ్‌ఆర్‌, టైమ్‌-ట్రాకింగ్‌ వ్యవస్థలను నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. తాజా జరిమానా కూడా అదే తరహా కంప్లయన్స్‌ లోపాలకు సంబంధించినదేనని ఇన్ఫోసిస్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement