దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతనాల పెంపుపై స్పష్టత ఇచ్చింది. అర్హులైన ఉద్యోగులకు వచ్చే రెండు నెలల్లో దశలవారీగా జీతాల పెంపు అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఎక్కువ మంది ఉద్యోగులకు అక్టోబర్ నుంచి సవరించిన వేతనాలు అమల్లోకి రానుండగా, సీనియర్ స్థాయి ఉద్యోగులకు 2027 జనవరిలో పెంపు వర్తించనుంది. అయితే ఈ పెంపు అందరికీ కాకుండా, అర్హత సాధించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేతన పెంపులు ఉద్యోగుల పనితీరు, పాత్ర, అనుభవం, వ్యాపార అవసరాలు వంటి ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఏడాది సగటు ఎంత శాతం ఇంక్రిమెంట్ ఇస్తామన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. గతంలో లాగే పనితీరు ఆధారిత విధానాన్నే కొనసాగించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
ఇదే సమయంలో నియామకాల విషయంలో మాత్రం ఇన్ఫోసిస్ దూకుడు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తొలి త్రైమాసికంలో 4,000 మందికిపైగా ఫ్రెషర్లను సంస్థలోకి తీసుకుంది. అయితే మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి చివర్లో 3,28,594 ఉండగా, జూన్ 30 నాటికి 3,28,062కు స్వల్పంగా తగ్గింది. మరోవైపు ఉద్యోగుల అట్రిషన్ రేటు 12.6 శాతం నుంచి 13 శాతానికి పెరగడం గమనార్హం.
ఇక జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.48,211 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి రూ.7,769 కోట్లకు చేరింది. అయితే క్లయింట్‌లు వ్యయాలను ఇంకా జాగ్రత్తగా కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాల గరిష్ఠ పరిమితిని 3.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించింది. తాజా మార్గదర్శకత్వం ప్రకారం సంస్థ FY27 రెవెన్యూ వృద్ధి అంచనా 1.5–3 శాతం మధ్య ఉండనుంది.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలు ఇన్ఫోసిస్ వ్యాపారంలో మరింత కీలకంగా మారుతున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 5.5 శాతం మాత్రమే ఉన్న AI సేవల వాటా, ఇప్పుడు 8.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో 3.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందాలు కుదిరినట్లు కంపెనీ వెల్లడించింది. దీర్ఘకాలిక డిజిటల్, AI ప్రాజెక్టులపై ఖాతాదారులు పెట్టుబడులు కొనసాగిస్తున్నప్పటికీ, తక్షణ వ్యయాల విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని సంస్థ పేర్కొంది.
తదుపరి సీఈవో ఆశిష్ కుమార్ దాస్
ఇన్ఫోసిస్ మరో కీలక నిర్ణయంగా నాయకత్వ మార్పును కూడా ప్రకటించింది. సంస్థలో మూడు దశాబ్దాలకుపైగా పనిచేసిన ఆశిష్ కుమార్ దాస్‌ను సీఈవో-డిజిగ్నేట్‌గా నియమించింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న సలీల్ పరేఖ్ పదవీకాలం 2027 మార్చితో ముగియనుండగా, 2027 ఏప్రిల్ 1 నుంచి ఆశిష్ కుమార్ దాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.


