నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఎలాటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా ముందుకు సాగిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ దీనికి భిన్నంగా ఉంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేయడం మాత్రమే కాకుండా.. ఆలోచింపజేసింది కూడా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఒక 27 ఏళ్ల ఐటీ ఉద్యోగి తన జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి రెడ్డిట్‌లో వెల్లడించాడు. నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నప్పటికీ సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత తన జీవితంలో వరుసగా ఎన్నో పెద్ద ఖర్చులు వచ్చాయని చెప్పాడు.
పెళ్లి ఖర్చులతో పాటు.. కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చింది. కొన్ని నెలలకే భార్యతో కలిసి మరో నగరానికి మారాల్సి రావడంతో కొత్త ఇంటిని పూర్తిగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇంటి అద్దె, అడ్వాన్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామగ్రి వంటి అవసరాల కోసం లక్షల రూపాయలు ఖర్చయ్యాయని టెకీ పేర్కొన్నాడు.
ఇంతలో మరో ఊహించని సమస్య ఎదురైంది. తన భార్య ఉద్యోగం కోల్పోవడంతో.. కుటుంబం మొత్తం ఒక్కరి జీతంపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆదాయం తగ్గిపోకపోయినా, బాధ్యతలు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో అప్పులు చేయడం తప్ప.. మరో మార్గం కనిపించలేదని ఆయన వివరించాడు.
Earning ₹2L/month but drowning in debt, need advice
by u/lonewolf_2298 in FinancialAdviceIndia
ప్రస్తుతం ఆయన బంధువుల నుంచి తీసుకున్న రూ.20 లక్షల అప్పుకు ప్రతి నెల రూ.25 వేల చెల్లిస్తున్నారు. మరోవైపు పర్సనల్ లోన్ ఈఎంఐ కూడా రూ.25 వేల వరకు ఉంది. అదనంగా క్రెడిట్ కార్డు ఈఎంఐల కోసం ప్రతి నెల దాదాపు రూ.30 వేల చెల్లిస్తున్నారు. ఈ ఈఎంఐలు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత కొంత ఉపశమనం లభిస్తుందని అతడు ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా.. రూ.6 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టి రూ.2.2 లక్షల లోన్ తీసుకున్నారు. ప్రస్తుతం చేతిలో సేవింగ్స్ లేకపోవడమే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదని చెప్పారు. ఈ పరిస్థితి తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అయితే తన పరిస్థితిపై ఎవరి సానుభూతి అవసరం లేదని, ఈ సమస్య నుంచి వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఎలా బయటపడాలో చెప్పాలని రెడ్డిట్ యూజర్లను కోరారు. దీనికి స్పందించిన చాలామంది ముందుగా అవసరం లేని ఖర్చులను తగ్గించాలని, అధిక వడ్డీ ఉన్న అప్పులను త్వరగా తీర్చాలని, మళ్లీ పొదుపు ప్రారంభించాలని సూచించారు. అలాగే కుటుంబంలో ఇద్దరూ సంపాదించే పరిస్థితి వస్తే.. ఆర్థిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ఎక్కువ జీతం వస్తే.. అదే ఆర్ధిక భద్రత ఉన్నట్లు కాదు. జీవితంలో అనుకోకుండా వచ్చే బాధ్యతలు, అత్యవసర ఖర్చులు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల ఎవరైనా అప్పుల ఊబిలో చిక్కుకోవచ్చు. కాబట్టి.. ఎంత ఆదాయం ఉన్నా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, అవసరం లేని అప్పులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే, దానిని సరిగ్గా నిర్వహించడం అంతకంటే గొప్ప నైపుణ్యం.


