ముంబై: దేశీయ ట్రాక్టర్ల పరిశ్రమ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో మందగింవచ్చని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ భావిస్తోంది. అధిక బేస్ ఎఫెక్ట్, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావచ్చన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ ఎఫ్‌వై 27లో ట్రాక్టర్ల విక్రయాల వృద్ధి 1–4 శాతానికి పరిమితం కావచ్చని తెలిపింది. కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్‌వై26) ట్రాక్టర్ పరిశ్రమ వార్షికంగా ఏకంగా 23.5 శాతం అద్భుత వృద్ధిని నమోదు చేసింది.
రుతుపవనాలు కీలకం
భారత వాతావరణ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ నెలాఖరు వరకు అందిన గణాంకాల ప్రకారం దక్షిణ, మధ్య, తీరప్రాంత భారతదేశంలో వర్షపాతం లోటు కనిపిస్తోంది. వర్షాభావ లేమి పరిస్థితులు సుదీర్ఘంగా కొనసాగితే అది ఖరీఫ్ సాగు, పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇక్రా స్పష్టం చేసింది. దీనివల్ల రైతు ఆదాయాలు తగ్గి, కొత్త ట్రాక్టర్ల కొనుగోళ్లు లేదా రీప్లేస్‌మెంట్ (పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకోవడం) డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది.
జూన్ అమ్మకాలు మాత్రం జోరుగానే
జూన్‌లో ట్రాక్టర్ల హోల్‌సేల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 11.9 శాతం, రిటైల్ విక్రయాలు 25.3 శాతం పెరిగినట్లు ఇక్రా వెల్లడించింది. గత ఏడాది తక్కువ బేస్ ఎఫెక్ట్, రైతుల నగదు ప్రవాహం మెరుగుపడటం, గత సెపె్టంబర్‌లో జీఎస్‌టీ తగ్గింపు వల్ల ట్రాక్టర్ల కొనుగోలు మరింత అందుబాటులోకి రావడం ఇందుకు కారణాలని పేర్కొంది. అయితే గతేడాది అధిక వృద్ధి కారణంగా ఏర్పడిన అధిక బేస్, ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం, బలహీన రుతుపవనాల అంచనాల నేపథ్యంలో మిగిలిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాల వృద్ధి మందగించవచ్చని ఇక్రా అభిప్రాయపడింది.
తయారీ కంపెనీలకు ఊరట
ట్రాక్టర్ తయారీ సంస్థల (ఓఈఎంలు) నిర్వహణ మార్జిన్లు స్థిరంగా కొనసాగే అవకాశముందని తెలిపింది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల (ఆపరేటింగ్ లెవరేజ్), ముడిసరుకుల స్థిరమైన ధరలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. లాభదాయకత, తక్కువ రుణభారం, తగినంత ద్రవ్య లభ్యత కారణంగా తయారీ సంస్థల క్రెడిట్ ప్రొఫైల్ కూడా బలంగానే కొనసాగే అవకాశముందని ఇక్రా అంచనా వేసింది.


