మార్కెట్‌కు మళ్లీ ‘పశ్చిమాసియా’ సెగ? | West Asia Tensions Return Stock Market Outlook This Week | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు మళ్లీ ‘పశ్చిమాసియా’ సెగ?

Apr 13 2026 7:36 AM | Updated on Apr 13 2026 8:42 AM

West Asia Tensions Return Stock Market Outlook This Week

యూఎస్‌–ఇరాన్‌ చర్చలు విఫలం.. సెంటిమెంట్‌పై ప్రభావం

క్రూడ్‌ ధరల కదలికలు కీలకం

ద్రవ్యోల్బణం గణాంకాలపై ఫోకస్‌

క్యూ4 ఫలితాలూ నడిపిస్తాయ్‌...

ఈ వారం మార్కెట్‌ గమనంపై విశ్లేషకుల అంచనా

ఇరాన్‌–అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశి్చమాసియా మళ్లీ భగ్గుమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి డీల్‌ కుదరకుండానే ఇరు పక్షాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌పై దీని ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దాడులు మొదలై హార్మూజ్‌ జలసంధిలో తిరిగి ఇరాన్‌ అడ్డంకులు సృష్టిస్తే.. క్రూడ్‌ ధరలు దూసుకెళ్లడంతో పాటు దీని సెగ మార్కెట్‌కు గట్టిగానే తగలవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం (14న) మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. 
    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

పశ్చిమాసియాలో చోటుచేసుకునే కీలక పరిణామాలకు తోడు క్రూడ్‌ ధరల కదలికలు మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. ఇరాన్‌–అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌... శాంతి ఒప్పందంపై ఆశలతో గతవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రివ్వుమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రూడ్‌ 100 డాలర్ల కిందికి జారడంతో సూచీలకు బూస్ట్‌ లభించింది. అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పేందుకు ఇరాన్‌ ససేమిరా అనడంతో చర్చలు విఫలయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఆరోపించగా.. యూఎస్‌ అలవికాని డిమాండ్‌లే డీల్‌ కుదరకపోవడానికి కారణమని ఇరాన్‌ స్పష్టం చేసింది. అయితే, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతాయని ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఖాయీ పేర్కొనడం విశేషం.

చర్చలు విఫలమైన నేపథ్యంలో సమీపకాలానికి మార్కెట్‌ ముఖచిత్రం మళ్లీ మారిపోయే అవకాశం ఉందని లివ్‌లాంగ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ హరిప్రసాద్‌ కె అభిప్రాయపడ్డారు. ’నిఫ్టీ శరవేగంగా తిరిగి 24,000 స్థాయిని అధిగమించిన నేపథ్యంలో సూచీకి ఈ వారం చాలా కీలకంగా మారనుంది. అయితే, ఇరాన్‌–అమెరికా శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో మళ్లీ మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. సోమవారం సూచీలు భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తాజా సీజ్‌ఫైర్‌ ర్యాలీలో ఆర్జించిన లాభాలు చాలా వరకు ఆవిరయ్యే ప్రమాదం నెలకొంది’ అని ఆయన పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణం డేటా.. 
ఈ వారంలో విడుదలయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా చెప్పారు.. మార్చి నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం డేటా ఏప్రిల్‌ 13న,  టోకు ధరల ద్రవ్యోల్బణం 14న వస్తుంది. ఆహార ధరల మంటతో ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి ఎగబాకగా.. టోకు ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ట స్థాయి అయిన 2.13 శాతానికి చేరింది. రానున్న కాలంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంలో ద్రవ్యోల్బణం గణాంకాలు కీలక పాత్ర పోషించనున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈ డేటాపై మరింత ఫోకస్‌ చేయనున్నారు.

ఫలితాలపై దృష్టి... 
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4) ఫలితాల సీజన్‌ను గతవారంలో టీసీఎస్‌ బోణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర బ్లూచిప్‌ కంపెనీల ఫలితాలు వెలువడనున్నాయి. క్యూ4తో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ కార్యకలాపాలు కూడా మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని మిశ్రా పేర్కొన్నారు.

సాంకేతికంగా చూస్తే... 
ఇరాన్‌–అమెరికా చర్చలు విఫలం కావడంతో మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 23,700 వద్ద తొలి మద్దతు లభించచ్చని.. ఆ స్థాయిని కోల్పోతే 23,500 మద్దతు కీలకమని మార్కెట్‌నిపుణులు చెబుతున్నారు. ఇక సూచీ గనుక పెరిగితే 24,100 వద్ద తొలి నిరోధం, ఆపై 24,300 వద్ద కీలక రెసిస్టెన్స్‌ ఉందనేది వారి విశ్లేషణ.

గత వారమిలా...
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకోవడం, రూపాయి బలోపేతం, క్రూడ్‌ ధరలు శాంతించడం వంటి పరిణామాలతో దేశీ మార్కెట్లు కూడా భారీగా కోలుకున్నాయి. గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 4,231 పాయింట్లు (5.77%) దూసుకెళ్లగా.. ఎస్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,338 పాయింట్లు (5.88%) ఎగబాకింది.

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల బాట... 
దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల తొలి 10 రోజుల్లో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.48,213 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం దీనికి నిదర్శనం. ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల నికర పెట్టుబడుల అనంతరం, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు అమ్మేసిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో ఇప్పటిదాకా మొత్తం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను వారు ఉపసంహరించుకున్నారు.

పశ్చిమాసియా సంక్షోభం తర్వాత మార్కెట్‌ భారీ పతనానికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలే కీలకంగా నిలిచాయి. ‘పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్‌ ధరలు భగ్గుమనడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రిస్కులు తీవ్రమయ్యాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు స్థూల ఆర్థిక ప్రతికూలతలు ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలకు పురిగొల్పుతున్నాయి’ అని మార్నింగ్‌ స్టార్‌ రీసెర్చ్‌ ఇండియాకు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement